జియోకు చెక్‌: రూ.32వేల కోట్లతో ప్లాన్‌

జియోకు చెక్‌: రూ.32వేల కోట్లతో ప్లాన్‌

సాక్షి, న్యూఢిల్లీ : టెలికాం మార్కెట్‌లో దూసుకుపోతున్న రిలయన్స్‌ జియోకు చెక్‌ పెట్టడానికి దిగ్గజ కంపెనీలన్నీ భారీ ఎత్తున్న ప్లాన్లు వేస్తున్నాయి. టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్‌ అయితే ఏకంగా రూ.32వేల కోట్లను వెచ్చించబోతుంది. తమ నెట్‌వర్క్‌ను విస్తరించుకోవడానికి వచ్చే రెండు ఆర్థిక సంవత్సరాల్లో రూ.32వేల కోట్లకు పైగా వెచ్చించాలని చూస్తున్నట్టు తెలిసింది. అదేవిధంగా రెవెన్యూ మార్కెట్‌ షేరులో 3-4 శాతం పాయింట్లను అధికంగా ఇది దక్కించుకోవాలనుకుంటోంది. మిగతా కంపెనీలు ఐడియా సెల్యులార్‌, వొడాఫోన్‌ ఇండియాలు కూడా జియోకు అడ్డుకట్ట వేయడానికి విలీన ప్రక్రియకు తెరతీశాయి. ఇలా జియో దెబ్బకు అల్లాడుతున్న కంపెనీలన్నీ మార్కెట్‌లో నిలదొక్కుకోవడానికి పలు వ్యూహాలను రచిస్తున్నాయి. 

 

జియో గతేడాది సెప్టెంబర్‌లో లాంచ్‌ చేసిన కమర్షియల్‌ సర్వీసులతో టెలికాం ఇండస్ట్రిలోని ఇంక్యుబెంట్లు భారీ ఎత్తున్న నష్టపోతున్నాయి. జియోను తట్టుకోవడానికి ఎన్ని ప్లాన్స్‌ వేసినా.. అవి వర్క్‌వుట్‌ కావడం లేదు. కానీ ఈ సారి ఎయిర్‌టెల్‌ పెద్ద ఎత్తునే ప్లాన్‌ వేస్తోంది.ఈ టెలికాం దిగ్గజం ఆర్పూ(ఒక్కో యూజర్‌పై ఆర్జించే కనీస రెవెన్యూ)ను కాపాడుకోవడం కోసం ధరలను మరింత తగ్గించుకోవాలనుకోవడం లేదని కూడా తెలుస్తోంది. ఎయిర్‌టెల్‌ ప్రస్తుతం పెడుతున్న పెట్టుబడులతో డేటా నెట్‌వర్క్‌ను భారీగా విస్తరించనుంది.

 

అంతేకాక వీటిని స్పెక్ట్రమ్‌ కొనుగోలుకు వెచ్చించనుంది. ఈ ఏడాది రూ.16వేల కోట్ల నుంచి రూ.17వేల కోట్ల వరకు మూలధన ఖర్చు రూపంలో వెచ్చించనున్నామని, వచ్చే రెండేళ్లలో కూడా అంతేమొత్తంలో ఇన్వెస్ట్‌ చేయనున్నట్టు కంపెనీకి చెందిన ఓ అధికారి తెలిపారు. ఈ కంపెనీకి క్యాష్‌ఫ్లోస్‌ కూడా వార్షికంగా రూ.20వేల కోట్లు మేర ఉన్నట్టు తెలిసింది. గతేడాది కూడా ఎయిర్‌టెల్‌ తన నెట్‌వర్క్‌లను అప్‌గ్రేడ్‌ చేసుకోవడానికి భారీగానే వెచ్చించింది. వీటికోసం రూ.15వేల కోట్లను ఖర్చుచేసింది. వొడాఫోన్‌ రూ.8300 కోట్లను, ఐడియా రూ.8000 కోట్లను తమ నెట్‌వర్క్‌ల అప్‌గ్రేడ్‌ కోసం ఖర్చు చేసినట్టు తెలిసింది. 
Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top