ముఖేష్ అంబానీకి చెందిన ప్రముఖ టెలికమ్ కంపెనీ రిలయన్స్ జియో.. ఎప్పటికప్పుడు చవక రీఛార్జ్ ప్లాన్లు, ఆఫర్లతో యూజర్లను ఆకట్టుకుంటోంది. కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా వివిధ రకాల ప్లాన్లను అందుబాటులోకి తెస్తోంది. తాజాగా కొత్త సంవత్సరం ప్రారంభం నేపథ్యంలో ప్రతి నెలా నంబర్ ను రీఛార్జ్ చేసుకునే టెన్షన్ లేకుండా ఏడాది పొడవునా సిమ్‌ను యాక్టివ్‌గా ఉంచుకునే ప్లాన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
రూ.3,599 ప్లాన్
ఈ ప్లాన్ 365 రోజుల వాలిడిటీతో వస్తుంది. ఒక్కసారి రీచార్జ్ చేసి వదిలేసే వారి కోసం ప్రత్యేకంగా ఈ ప్లాన్‌ను రూపొందించారు. ఇందులో ఏడాది పొడవునా పాన్-ఇండియా రోమింగ్ తో అపరిమిత వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. ప్రతిరోజూ 2.5 జీబీ హైస్పీడ్ డేటా.. అంటే మొత్తం 912.5 జీబీ డేటా లభిస్తుంది. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఉచితంగా పంపుకోవచ్చు. 5జీ కవరేజీ ఉన్న ప్రాంతాల్లో అపరిమిత 5జీ డేటాను ఉపయోగించుకోవచ్చు. ఇక జియో టీవీ, జియోఏఐ క్లౌడ్, గూగుల్ జెమిని ప్రో సబ్ స్క్రిప్షన్ అదనపు ప్రయోజనాలు.
రూ.3,999 ప్లాన్
లైవ్ స్పోర్ట్స్ ను ఇష్టపడే వ్యక్తుల కోసం ఈ ప్లాన్ ప్రత్యేకంగా రూపొందించింది జియో. ఈ ప్లాన్ ప్రీమియం ఓటీటీ సబ్ స్క్రిప్షన్ ను అందిస్తుంది. వ్యాలిడిటీ 365 రోజులు. పాన్-ఇండియా రోమింగ్ తో అపరిమిత కాలింగ్ ఉంటుంది. ప్రతిరోజూ 2.5 జీబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. 5జీ కవరేజీ ఉన్న ప్రాంతాలలో అపరిమిత 5జీ డేటాను ఆనందించవచ్చు. ఫ్రీ ఫ్యాన్ కోడ్ యాప్ ఇందులో లభించే ఓటీటీ బెనిఫిట్. అదనపు ప్రయోజనాల విషయానికి వస్తే జియో టీవీ, జియోఏఐ క్లౌడ్, గూగుల్ జెమిని ప్రో వంటివి లభిస్తాయి.
రూ .1,748 ప్లాన్
కాలింగ్ ఒక్కటే ఉంటే చాలు మొబైల్ డేటా అవసరం లేదు అనుకునే వినియోగదారులకు ఈ ప్లాన్ ఉత్తమమైనది. ఇందులో వ్యాలిడిటీ 336 రోజులు. అన్ని నెట్ వర్క్ లకు అపరిమిత కాలింగ్ చేసుకోవచ్చు. ఇది వాయిస్ ఓన్లీ ప్యాక్ కాబట్టీ ఎలాంటి డేటా రాదు. 3,600 ఉచిత ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. జియోఏఐ క్లౌడ్, జియో టీవీలకు యాక్సెస్ పొందుతారు.


