భారతీ ఎయిర్‌టెల్‌ దొంగ పని, తెలిస్తే షాక్‌

Bharti Airtel Gets Embroiled In An Alleged Case Of Power Theft - Sakshi

శ్రీనగర్‌ : టెలికాం దిగ్గజంగా భారతీ ఎయిర్‌టెల్‌కు మంచి పేరుంది. ఈ మధ్యన ఆ కంపెనీ చేసే పనులు దాని బ్రాండ్‌ విలువను అదే పోగొట్టుకుంటోంది. గత కొన్ని రోజుల క్రిందట ఖాతాదారులకు చెప్పా పెట్టకుండా.. వారి తరుఫున అకౌంట్లు తెరిచేసి, గ్యాస్‌ అకౌంట్‌ రాయితీలను తన పేమెంట్‌ బ్యాంక్‌లోకి జమ చేసుకోవడంతో ఆర్‌బీఐ ఆగ్రహానికి గురైంది. ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ కార్యకలాపాలు రద్దు చేసి, భారీ జరిమానా కూడా విధించింది. తాజాగా మరో దొంగ పని చేసి, తన బ్రాండ్‌ ఇమేజ్‌ను మరోసారి దెబ్బతీసుకుంది. భారతీ ఎయిర్‌టెల్‌ తన ప్రత్యర్థి, ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి విద్యుత్‌ను దొంగతనం చేసింది.

జమ్ముకశ్మీర్‌లోని కార్గిల్‌ జిల్లాలో ఎయిర్‌టెల్‌ ఈ దొంగతనానికి పాల్పడిందని బీఎస్‌ఎన్‌ఎల్‌ ఫిర్యాదు నమోదు చేసింది. కార్గిల్‌లోని ఛానిగుండ్‌ వద్ద ఎక్స్‌క్లూజివ్‌గా బీఎస్‌ఎన్‌ఎల్‌ మొబైల్‌ టవర్‌కు మాత్రమే వాడే విద్యుత్‌ను ట్రాన్స్‌ఫార్మర్‌ నుంచి ఎయిర్‌టెల్‌ టవర్‌ దొంగతనం చేసిందని బీఎస్‌ఎన్‌ఎల్‌ అథారిటీలు 2018 ఆగస్టు 3న లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్టు పోలీసు అధికారి చెప్పారు. దీని కోసం కార్గిల్‌ ఎస్‌ఎస్‌పీ టీ గ్యాల్పో,  కార్గిల్‌ డిప్యూటీ ఎస్పీ ఇష్త్‌యాఖ్‌ ఏ కచో హెడ్‌గా ఎగ్జిక్యూటివ్‌ పీడీడీ కార్గిల్‌ మహమ్మద్‌ అల్టఫ్‌తో పాటు ఓ కమిటీ ఏర్పాటు చేశారు. 

ఆ ప్రాంతాన్ని సందర్శించిన టీమ్‌, ఎయిర్‌టెల్‌ టవర్‌ అక్రమంగా బీఎస్‌ఎన్‌ఎల్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ నుంచి విద్యుత్‌ దొంగలించేందుకు ఓ కేబుల్‌ను ఏర్పాటు చేసిందని గుర్తించారు. ఛానిగుండ్‌లో బీఎస్‌ఎన్‌ఎల్‌ టవర్‌కు ప్రత్యేకంగా సరఫరా చేసే విద్యుత్‌ను ఎయిర్‌టెల్‌ అక్రమంగా వాడేస్తుందని టీమ్‌ తెలిపింది. ఎలక్ట్రిసిటీ యాక్ట్‌ సెక్షన్‌ 95 కింద కార్గిల్‌ పోలీసు స్టేషన్‌లో ఎయిర్‌టెల్‌పై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం దీనిపై విచారణ చేపడుతున్నారు. అయితే ఆ టవర్‌ టెలికాం కంపెనీకి చెందినది కాదని,  దాన్ని ఇన్‌ఫ్రాటెల్‌ ఆపరేట్‌ చేస్తుందని, అది భారతీ గ్రూప్‌లో భాగమని ఎయిర్‌టెల్‌ అధికార ప్రతినిధి చెబుతున్నారు. నిజనిజాలు తెలియకుండా తమ కంపెనీ పేరును ఫిర్యాదులో చేర్చారని ఎయిర్‌టెల్‌ మండిపడ్డారు. దీన్ని బీఎస్‌ఎన్‌ఎల్‌ అథారిటీల వద్దకు తీసుకెళ్తామని, ఇదే విషయాన్ని వారికి స్పష్టీకరిస్తామని పేర్కొన్నారు.  
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top