రూ.2.5 కోట్ల విలువైన టవల్స్‌, బెడ్‌షీట్లు దొంగతనం

 Bedsheets, Towels, Blankets Worth RS 2.5 Crores Stolen From Trains In A Year - Sakshi

న్యూఢిల్లీ : దేశీయ రైళ్లలో దొంగతనాలు భారీగానే జరుగుతున్నాయి. ప్రయాణికుల కోసం అందించే బెడ్‌షీట్లను, టవళ్లను, బ్లాంకెట్లను కూడా వదిలిపెట్టకుండా దొంగలిస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో 2 లక్షల టవళ్లు, 7వేల బ్లాంకెట్లు, 81వేల బెడ్‌షీట్లు, 55,573 పిల్లో కవర్లు దొంగతనానికి గురైనట్టు వెల్లడైంది. పశ్చిమ రైల్వే నివేదికలో ఈ విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. వీటి విలువ రూ.2.5 కోట్లు ఉంటుందని పశ్చిమ రైల్వే నివేదిక పేర్కొంది. దొంగతనానికి గురైన ఒక్కో బ్లాంకెట్‌ ఖరీదు 132 రూపాయలు, టవల్‌ ధర 22 రూపాయలు కాగా, పిల్లో ధర 25 రూపాయలు ఉంటుందని నివేదిక తెలిపింది. 

అంతేకాక  2018 ఏప్రిల్‌, సెప్టెంబర్‌ మధ్య కాలంలోనే దాదాపు రూ.62 లక్షల ఇన్వెంటరీ దొంగతనానికి గురైనట్టు దేశీయ రైల్వే ప్రకటించింది. ఈ మధ్య కాలంలో ఏకంగా 79,350 హ్యాండ్‌ టవల్స్‌, 27,545 బెడ్‌షీట్లు, 21,050 పిల్లో కవర్లు, 2150 పిల్లోలు, 2065 బ్లాంకెట్లు దొంగతనానికి గురైనట్టు సెంట్రల్‌ రైల్వే సీపీఆర్‌ఓ సునిల్‌ ఉదాసి చెప్పారు. వీటి విలువ మొత్తం రూ.62 లక్షలు ఉంటుందన్నారు. 

పిల్లోలు, టవళ్లు, బ్లాంకెట్లు, బెడ్‌షీట్లు మాత్రమే కాక, మరుగుదొడ్లలో ఉండే 200 మగ్గులు, వేయి ట్యాప్‌లు, 300కు పైగా ఫ్లష్‌ పైపులు, స్నానం చేసే షవర్లు కూడా దొంగతనానికి గురయ్యాయని చెప్పింది. ప్రస్తుతం ఈ దొంగతనాలు జరగకుండా.. అన్ని రైళ్లో సెన్సార్‌లతో కూడిన ట్యాప్‌లను, సీసీటీవీ కెమెరాలను అమర్చతున్నట్టు దేశీయ రైల్వే తెలిపింది. అయితే ప్రయాణికుల కోసం అందిస్తున్న వీటిని ప్రయాణికులే చోరీ చేయడం, వాటిని ధ్వంసం చేయడంపై దేశీయ రైల్వే ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. 

ఈ ఏడాది మొదట్లో కూడా ప్రయాణికుల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన హై-స్పీడ్‌ సెమీ లగ్జరీ రైలు తేజాస్‌ ఎక్స్‌ప్రెస్‌లో కూడా ప్రయాణికులు బీభత్సం సృష్టించారు. తేజాస్‌ ఎక్స్‌ప్రెస్‌లో అమర్చిన హెడ్‌ఫోన్లను ఎత్తుకెళ్లి, ఎల్‌సీడీ స్క్రీన్లను బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. మరుగుదొడ్లను కూడా మురికిమురికి చేశారు. ఇటీవల ముంబై-నాసిక్‌ పంచవటి ఎక్స్‌ప్రెస్‌లో కూడా ఇదే రకమైన విధ్వంసకర వాతావరణం సృష్టించారు. ఈ రైలు సర్వీసును అప్‌గ్రేడ్‌ చేసిన నాలుగు నెలల్లోనే, ట్రే టేబుల్స్‌ను, కర్టెన్లను చెల్లాచెదురు చేశారు. అంతేకాక కిటికీలను పగులగొట్టారు. హెల్త్‌కు చెందిన రెగ్యులేటర్లను, కుళాయిలను, లగేజ్‌ ర్యాక్‌ల గ్లాస్‌లను ప్రయాణికులు బ్రేక్‌ చేశారు. చెత్తాడబ్బాలను, అద్దాలను ఎత్తుకుపోయారు. ఇలా గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో  దేశీయ రైల్వే రూ.4000 కోట్లు నష్టాలు పాలైంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top