బ్యాంకులకు.. డబ్బులు కావాలి!!

Banks suffering from npa's - Sakshi

ఎన్‌పీఏల షాక్‌తో... దేశీ బ్యాంకుల నిధుల వేట

అనుబంధ, భాగస్వామ్య సంస్థల్లో వాటాల విక్రయం

ఇప్పటికే పలు వాటాలను అమ్మేసిన ఎస్‌బీఐ, ఐసీఐసీఐ

అదే బాటలో పీఎన్‌బీ, ఫెడరల్, ఐడీబీఐ బ్యాంక్‌.. మరికొన్ని

ముంబై: వసూలుకాని మొండి బకాయిలకు (ఎన్‌పీఏ) భారీగా నిధులు కేటాయిస్తూ నిధుల కటకటను ఎదుర్కొంటున్న బ్యాంకులు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిపెట్టాయి. వ్యాపార కార్యకలాపాలకు నిధులు కరువవటంతో గడ్డు పరిస్థితుల నుంచి బయటపడేందుకు అనుబంధ సంస్థలు, భాగస్వామ్య కంపెనీల్లో వాటాలను విక్రయించటం మొదలు పెట్టాయి.

ఎస్‌బీఐ సహా పలు బ్యాంకులు ఇప్పటికే ఆ దిశగా అడుగులేశాయి. స్టాక్‌ మార్కెట్లో 34 లిస్టెడ్‌ బ్యాంకుల ఉమ్మడి ఎన్‌పీఏలు రూ.9 లక్షల కోట్లకు పెరిగిపోయిన విషయం తెలిసిందే. వీటికి చేస్తున్న కేటాయింపులతో నిధులు అడుగంటిపోయిన పరిస్థితుల్లో సబ్సిడరీల్లో తమకున్న వాటాలను అమ్మి సొమ్ము చేసుకోవడం మినహా వాటికి వేరే మార్గం కనిపించడం లేదు.

దీంతో సబ్సిడరీల్లో వాటాలను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ మార్గంలో లేదా ఏక మొత్తంలో వాటాను ఒకేసారి విక్రయించడమో ఏదో ఒకటి చేయాల్సిన పరిస్థితులు తలెత్తాయి. వాటాలను విక్రయిస్తే వచ్చిన ఆదాయాన్ని బ్యాంకుల తమ స్టేట్‌మెంట్లలో ఇతర ఆదాయం లేదా ట్రెజరీ ఆదాయంగా పేర్కొంటాయి. అయితే, సబ్సిడరీల్లో నికర పెట్టుబడి వివరాలు తెలియనందున వాటాల విక్రయం వల్ల ఒనగూరే అసలు ప్రయోజనం ఎంతన్నది వాటాదారులకు తెలియడం కష్టమే.

వాటాలను విక్రయించిన బ్యాంకులు
గడిచిన ఏడాది కాలంలో ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్‌బీఐ తన అనుబంధ సంస్థ ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌లో కొంత వాటాలను ఐపీవో ద్వారా విక్రయించింది. దీని ద్వారా రూ.5436 కోట్లను సమీకరించింది. దీంతో ఎస్‌బీఐ లైఫ్‌ కూడా లిస్టెడ్‌ సంస్థగా మారి... ఎస్‌బీఐ వాటాలకు మరింత విలువ సమకూరేలా మార్గం సుగమం అయింది. ప్రైవేటు రంగ ఐసీఐసీఐ బ్యాంకు సైతం ఐసీఐసీఐ లాంబార్డ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌లో ఏడు శాతం వాటాలను ఐపీవో ద్వారా విక్రయించి సుమారు రూ.2,100 కోట్ల నిధుల్ని పొందింది.

2017–18లో ఈ వాటాల విక్రయం ద్వారా ఐసీఐసీఐ బ్యాంకు కన్సాలిడేటెడ్‌ ఖాతాల్లో నికరంగా పొందిన ప్రయోజనం రూ.1,711 కోట్లు. అలాగే, ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌లో 20.78 శాతం వాటాను ఐపీవో ద్వారా విక్రయించి రూ.3,480 కోట్లను సమీకరించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం 2016–17లోనే ఐసీఐసీఐ బ్యాంకు అనుబంధ సంస్థల్లో వాటాల విక్రయానికి శ్రీకారం చుట్టింది. ఆ ఆర్థిక సంవత్సరంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌లో కొంత వాటాను విక్రయించి రూ.6,000 కోట్ల వరకూ సమకూర్చుకుంది. ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో ఐడీబీఐ బ్యాంకు పరిస్థితి మరింత దారుణంగా తయారైంది.

స్థూల ఎన్‌పీఏలు 28 శాతానికి చేరాయి. ఐడీబీఐ బ్యాంకు ఇప్పటికే ఎన్‌ఎస్‌ఈ, ఎన్‌ఎస్‌డీఎల్‌ ఈ గవర్నెన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో వాటాల విక్రయం ద్వారా రూ.200 కోట్లు, రూ.112 కోట్ల చొప్పున నిధుల్ని పొందింది. నీరవ్‌ మోదీ దెబ్బకు చతికిల పడిన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు పీఎన్‌బీ హౌసింగ్‌ ఫైనాన్స్‌లో వాటాల విక్రయం ద్వారా రూ.3,250 కోట్ల వరకు పొం దింది. యూనియన్‌ బ్యాంకు సైతం యూనియన్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌లో తనకున్న 39.62% వాటాను సహ భాగస్వామి దైచీ లైఫ్‌ హోల్డింగ్స్‌ కొనుగోలు చేసినట్టు ఇటీవలే ప్రకటించింది.

ఈ ఏడాదిలో మరిన్ని...
ఎస్‌బీఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ వాటాల విక్రయాన్ని కొనసాగించనుంది. ఎస్‌బీఐ జనరల్‌ ఇన్సూరెన్స్‌లో 3–5% వాటాలు, ఎస్‌బీఐ క్యాపిటల్‌ మార్కెట్స్‌లో 24–49 శాతం వరకు వాటాను అమ్మే ప్రణాళికలతో ఉంది. తమ సబ్సిడరీలన్నీ చక్కటి పనితీరును ప్రదర్శిస్తున్నాయని, ప్రస్తుత ఏడాది, వచ్చే ఏడాది కూడా వాటిలోని వాటాల నుంచి సొమ్ము చేసుకోవడం జరుగుతుందని ఎస్‌బీఐ చైర్మన్‌ రజనీష్‌కుమార్‌ తెలిపారు.

క్రెడిట్‌ కార్డు వ్యాపారాన్ని 2019– 20లో లిస్ట్‌ చేయాలనుకుంటున్నట్టు ఎస్‌బీఐ ఎండీ దినేష్‌ ఖరా చెప్పారు. ఇక ఐసీఐసీఐ బ్యాంకు తన సబ్సిడరీ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మ్యూచువల్‌ ఫండ్‌ను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లిస్ట్‌ చేసే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

కర్ణాటక బ్యాంకు: యూనివర్సల్‌ సోంపో జనరల్‌ ఇన్సూరెన్స్‌లో 8.26 శాతం వాటా విక్రయించే ప్రతిపాదనతో ఉంది.
ఐడీబీఐ బ్యాంకు: ఐడీబీఐ మ్యూచువల్‌ ఫండ్‌లో వాటాలను విక్రయించనుంది. ఎన్‌ఎస్‌డీఎల్‌లో తనుకున్న 30 శాతం వాటా విక్రయించే యత్నాల్లో ఉంది.
ఫెడరల్‌ బ్యాంకు: నాన్‌ బ్యాంకింగ్‌ సంస్థ ఫెడ్‌ఫినాలో 26 శాతం వాటా విక్రయించాలని నిర్ణయించింది.
పీఎన్‌బీ: పీఎన్‌బీ మెట్‌లైఫ్‌ ఇన్సూరెన్స్‌లో వాటాలను ఈ ఆర్థిక సంవత్సరంలోనే విక్రయించాలనే ప్రతిపాదనతో ఉంది.

పెట్టుబడుల్లేని బ్యాంకుల పరిస్థితి?
అనుబంధ సంస్థలు, ఇతర సంస్థల్లో పెట్టుబడులు లేని బ్యాంకులు కార్యకలాపాలను కుదించుకునే చర్యల్ని చేపట్టడం గడ్డు పరిస్థితికి నిదర్శనం. ఇప్పటికే ప్రభుత్వ బ్యాంకులు విదేశీ కార్యకలాపాలకు స్వస్తి చెబుతున్నాయి. ఉదాహరణకు బ్యాంకు ఆఫ్‌ బరోడా 2017–18లో బహ్రెయిన్, బహమాస్, దక్షిణాఫ్రికా కార్యకలాపాలను మూసివేసినట్టు ఇటీవలే ప్రకటించింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top