బ్యాంక్‌ సేవలపై భారత్‌ బంద్‌ ప్రభావం

Banking services impacted due to nationwide trade union strike - Sakshi

వాహన ప్లాంట్లలో పాక్షికంగా నిలిచిన ఉత్పత్తి

న్యూఢిల్లీ/ముంబై/చెన్నై: కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా పది కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా నిర్వహించిన భారత్‌ బంద్‌... బ్యాంక్‌ల సేవలపై బాగానే ప్రభావం చూపించింది. వాహన కంపెనీల ప్లాంట్లపై సమ్మె ప్రభావం పాక్షికంగానే  ఉంది. ఐఎన్‌టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్‌ఎమ్‌ఎస్, సీఐటీయూ, ఏఐయూటీయూసీ, టీయూసీసీ తదితర పది కార్మిక సంఘాలు నిర్వహించిన ఈ సమ్మెకు పలు బ్యాంక్‌ సంఘాలూ మద్దతిచ్చాయి.  

ఆర్‌బీఐ కార్యాలయాల్లోనూ సమ్మె...
పలు ఏటీఎమ్‌లలో డబ్బులు అయిపోయాయి. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో క్యాష్‌ విత్‌డ్రాయల్, నగదు డిపాజిట్‌ చేయడం, చెక్‌ క్లియరెన్స్‌ వంటి బ్రాంచ్‌ కార్యకలాపాలపై ఈ సమ్మె ప్రభావం కనిపించింది. ముంబైతో సహా దేశవ్యాప్తంగా ఉన్న 19 ఆర్‌బీఐ కార్యాలయాల్లోని 12,000 మంది సిబ్బంది కూడా ఈ సమ్మెలో పాల్గొన్నారు. దీంతో ఆర్‌బీఐకు చెందిన కరెన్సీ మేనేజ్‌మెంట్‌ తదితర విభాగాలపై తీవ్రమైన ప్రభావమే పడింది. ఎస్‌బీఐ, ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌లు యథావిధిగా పనిచేశాయి.  

మరోవైపు హోండా మోటార్‌సైకిల్, బజాజ్‌ ఆటో, కొన్ని వాహన విడిభాగాల కంపెనీల్లో కార్యకలాపాలు నిలిచిపోయాయి. అయితే మారుతీ సుజుకీ, హీరో మోటోకార్ప్, హోండా కార్స్‌ ఇండియా, మహీంద్రా అండ్‌ మహీంద్రా, టాటా మోటార్స్, హ్యుందాయ్‌ మోటార్స్‌ ఇండియా ప్లాంట్లలో కార్యకలాపాలు సాధారణంగానే కొనసాగాయి. ఈ కంపెనీల ప్లాంట్లలో సమ్మె ప్రభావం కనిపించలేదు. కాగా ఈ  సమ్మెలో 25 కోట్ల మంది ప్రజలు పాల్గొన్నారని కార్మిక సంఘాలు వెల్లడించాయి. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక చట్టాల సంస్కరణలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ప్రభుత్వ వాటాల విక్రయం, ప్రైవేటీకరణ తదితర విధానాలకు నిరసనగా ఈ సమ్మె జరిగింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top