జీతాల్లో బెంగళూరే ముందు!

Bangalore highest paying city - Sakshi

ప్రొఫెషనల్స్‌కు సగటున రూ.10.8 లక్షలు

తరువాతి స్థానాల్లో పుణే, ఢిల్లీ, ముంబై

7.9 లక్షలతో ఆరో స్థానంలో హైదరాబాద్‌

రాండ్‌స్టాడ్‌ ఇండియా నివేదిక  

న్యూఢిల్లీ: ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రాజధాని బెంగళూరులో ప్రొఫెషనల్స్‌ అత్యధిక జీతభత్యాలు అందుకుంటున్నారు. వీరి వేతనాలు సగటున వార్షికంగా రూ.10.8 లక్షల మేర ఉంటున్నాయి. రూ. 10.3 లక్షలతో పుణే, రూ. 9.9 లక్షలతో నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌ (ఎన్‌సీఆర్‌) టాప్‌ 3 నగరాల్లో నిల్చాయి.

కన్సల్టెన్సీ సంస్థ రాండ్‌స్టాడ్‌ ఇండియాలో భాగమైన రాండ్‌స్టాడ్‌ ఇన్‌సైట్స్‌ రూపొందించిన శాలరీ ట్రెండ్స్‌ 2018 నివేదిక ఈ విషయాలు వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం...  రూ.7.9 లక్షల సగటు వేతనంతో హైదరాబాద్‌ ఆరో స్థానంలో నిలిచింది. నాలుగో స్థానంలో ముంబై (రూ. 9.2 లక్షలు), అయిదో ర్యాంకులో చెన్నై (రూ. 8 లక్షలు) ఉన్నాయి.

ఉద్యోగ విధుల రీత్యా చూస్తే కన్సల్టింగ్, అడ్వైజరీ ఉద్యోగులు అత్యధికంగా వేతనాలు అందుకుంటున్నారు. కొన్ని ఉద్యోగాల్లో 6–10 ఏళ్ల అనుభవం ఉన్న వారికి భారీ జీతభత్యాలు లభిస్తున్నాయి. 20 రంగాల్లో విభాగాలు, 15 రకాల ఉద్యోగ విధులు, 1,00,000 పైగా ఉద్యోగాల విశ్లేషణ ఆధారంగా రాండ్‌స్టాడ్‌ ఇండియా ఈ నివేదిక రూపొందించింది.

ఫార్మా, హెల్త్‌కేర్‌లో భారీ జీతాలు..
రంగాలవారీగా చూస్తే ఫార్మా, హెల్త్‌కేర్‌ సంస్థలు అత్యధిక జీతభత్యాలు ఇస్తున్నాయి. ఈ రంగంలో సగటు వార్షిక సీటీసీ (కాస్ట్‌ టు కంపెనీ) రూ. 9.6 లక్షలుగా ఉంది. ఇక, వస్తు సేవల పన్నుల (జీఎస్‌టీ) విధానం అమల్లోకి వచ్చినప్పట్నుంచి తత్సంబంధిత సర్వీసులు అందించే ప్రొఫెషనల్స్‌కి డిమాండ్‌ గణనీయంగా పెరిగింది.

రూ. 9.4 లక్షల సగటు వేతనాలతో ప్రొఫెషనల్‌ సర్వీసుల విభాగం రెండో స్థానంలో ఉంది. ఇక రూ. 9.2 లక్షల సగటు సీటీసీతో ఎఫ్‌ఎంసీజీ మూడో స్థానంలో, రూ. 9.1 లక్షలతో ఐటీ రంగం నాలుగో ర్యాంకులో, రూ. 9.0 లక్షలతో ఇన్‌ఫ్రా.. రియల్‌ ఎస్టేట్‌.. నిర్మాణ రంగం అయిదో స్థానంలో ఉన్నాయి.

వృత్తి విద్యా నిపుణులకు సంబంధించి.. స్పెషలిస్టు డాక్టర్ల సీటీసీ అత్యధికంగా సగటున వార్షికంగా రూ. 18.4 లక్షలుగా ఉంటుండగా, సొల్యూషన్‌ ఆర్కిటెక్ట్‌ల సీటీసీ రూ. 15.1 లక్షలు, ప్రొడక్టు ఇంజనీరింగ్‌ స్పెషలిస్టులు రూ. 14.8 లక్షలు, బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీ నిపుణులు రూ. 14.6 లక్షలు అందుకుంటున్నారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top