నాలుగు రెట్లు పెరిగిన బజాజ్‌ ఎలక్ట్రికల్స్‌ లాభం

Bajaj Electricals Q4 jumps twofold to Rs 28.54 crore - Sakshi

10 శాతం వృద్ధితో రూ.1,773 కోట్లకు మొత్తం ఆదాయం 

ఒక్కో షేర్‌కు రూ.3.50 డివిడెండ్‌ 

న్యూఢిల్లీ: బజాజ్‌ ఎలక్ట్రికల్స్‌ కంపెనీ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2018–19)మార్చి క్వార్టర్‌లో నాలుగు రెట్లు పెరిగింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2017–18) క్యూ4లో రూ.7 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.29 కోట్లకు పెరిగిందని బజాజ్‌ ఎలక్ట్రికల్స్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.1,606 కోట్ల నుంచి 10 శాతం వృద్ధితో రూ.1,773 కోట్లకు పెరిగిందని కంపెనీ సీఎమ్‌డీ శేఖర్‌ బజాజ్‌ చెప్పారు. మొత్తం వ్యయాలు రూ.1,496 కోట్ల నుంచి 17 శాతం వృద్ధితో రూ.1,755 కోట్లకు పెరిగాయని వివరించారు. రూ.2 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు రూ.3.50 డివిడెండ్‌ను ఇవ్వనున్నామని తెలిపారు. స్థూల లాభంలో ఎలాంటి వృద్ధి లేదని నిర్వహణ లాభం రూ.38 కోట్ల నుంచి 22 శాతం వృద్ధితో రూ.46 కోట్లకు పెరిగిందని వివరించారు.  

రెట్టింపైన ఏడాది లాభం.... 
ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2017–18లో రూ.84 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో రెండు రెట్లు పెరిగి రూ.167 కోట్లకు పెరిగిందని శేఖర్‌ బజాజ్‌ చెప్పారు. మొత్తం అమ్మకాలు రూ.4,716 కోట్ల నుంచి 41 శాతం పెరిగి రూ.6,673 కోట్లకు పెరిగాయని పేర్కొన్నారు. రాజీవ్‌ బజాజ్‌ను అదనపు డైరెక్టర్‌గా నియమించామని, ఈ నియామకం తక్షణం అమల్లోకి వస్తుందని వివరించారు. 
ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో బజాజ్‌ ఎలక్ట్రికల్స్‌ షేర్‌ 2 శాతం నష్టంతో రూ.550 వద్ద ముగిసింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top