మీ బీమాకు నామినీ ఉన్నారా?

Are your insurance nominee? - Sakshi

ఏ పాలసీకైనా నామినీ తప్పనిసరి 

ఆ వివరాలు లేకుంటే క్లెయిమ్‌లు ఇబ్బందే చట్టబద్ధ వారసులకు దక్కినా... సమయం పడుతుంది 

ఒకరికన్నా ఎక్కువ వారసులున్నపుడు మరింత కష్టం

జీవిత బీమా పాలసీ ఎందుకు? అనుకోనిదేమైనా జరిగితే కుటుంబానికి ఆర్థిక రక్షణ కల్పించడానికే కదా!! మరి పాలసీదారుడు మరణించిన సందర్భంలో ఆ పరిహారం ఎవరికి అందించాలన్న వివరాలను పేర్కొనకపోతే లాభమేంటి? కుటుంబ సభ్యులను ఇబ్బందుల్లోకి నెట్టినట్టే కదా!! అందుకే జీవిత బీమా పాలసీకి నామినీ చాలా అవసరం. దీని ప్రాధాన్యాన్ని తెలియజేసే కథనమే ఇది.

నామినీ ఎందుకు?
నామినేషన్‌ ప్రాధాన్యం తెలుసుకునే ముందు నామినీ గురించి తెలుసుకోవాలి. పాలసీదారు మరణిస్తే జీవిత బీమా పరిహారం అందుకునేందుకు అర్హులైన వారే నామినీ. నిజానికి టర్మ్‌ పాలసీల్లో ఇది తప్పనిసరి కనక అంతా నామినీ పేరు పేర్కొంటారు. కానీ కొన్ని రకాల మెచ్యూరిటీ తీరాక నగదు అందే పాలసీలకు కొందరు నామినీ వివరాలివ్వరు. తామే తీసుకుంటాం కదా అనే భరోసాయే దీనిక్కారణం. నిజానికి వాటికీ కొంత కవరేజీ ఉంటుంది.

పాలసీదారు మరణించిన సందర్భంలో ఆ కవరేజీ మొత్తాన్ని నామినీకి చెల్లిస్తారు. అయితే పాలసీలో ఎవరినీ నామినీగా  పేర్కొనకపోతే అలాంటి సందర్భంలో పరిహారం చట్టబద్ధమైన వారసులకే చెందుతుంది. జీవిత భాగస్వామి, పిల్లలు, తల్లిదండ్రులు చట్టబద్ధమైన వారసులు. కాకపోతే ఈ ప్రక్రియలో జాప్యం జరుగుతుంది. ‘‘బీమాసంస్థ వారసత్వ ధ్రువీకరణ పత్రాన్ని అడుగుతుంది. అది చట్టబద్ధమైన వారసులను సూచించేలా ఉండాలి. ఇందుకు సమయం పడుతుంది.

వారి కుటుంబ సభ్యులకు వ్యయాలు కూడా అవుతాయి. ఇది సరైనది కాదు. ఎందుకంటే బీమా పాలసీ తీసుకోవడం అన్నది తమపై ఆధారపడిన వారికి ఆర్థిక భద్రత చేకూర్చేందుకే’’ అని టాటా ఏఐఏ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ యూసుఫ్‌ పచ్‌మరివాలా వివరించారు.

ఒకరికి మించి వారసులుంటే...
నామినీగా ఎవరినీ పేర్కొనని సందర్భాల్లో ఒకరికి మించి వారసులు ఉంటే క్లెయిమ్‌ పరిష్కార ప్రక్రియ మరింత జటిలం అవుతుంది. బీమా సంస్థలు పలు రకాల పత్రాలు, ఇండెమ్నిటీ బాండ్‌ అడగొచ్చు. ఇందుకు సమయం పడుతుంది. కొన్ని సందర్భాల్లో ఇరు పార్టీల మధ్య వివాదానికి దారితీయవచ్చు.

ఒకవేళ పాలసీదారుడు నామినీగా ఎవరినీ పేర్కొనకపోయినా, విల్లు రాసి ఉంటే, అందులో పేర్కొన్న వ్యక్తికి బీమా సంస్థ నిబంధనల మేరకు అన్ని ప్రయోజనాలను చెల్లిస్తుంది. ఒకవేళ బీమా పాలసీలో నామినీగా ఒకరిని నమోదు చేయించి, విల్లులో మరొకరిని చట్టబద్ధమైన వారసుడిగా పేర్కొంటే, అప్పుడు బీమా సంస్థ విల్లులో ఉన్న వారికే ప్రయోజనాలను బదలాయిస్తుంది. అందుకే పాలసీలో నామినీగా ప్రతిపాదించిన వారినే విల్లులోనూ పేర్కొనడం మర్చిపోవద్దు.

నమోదు ప్రక్రియ ఇలా...
జీవిత బీమా పాలసీ తీసుకునే సమయంలోనే నామినీ వివరాలిస్తే మంచిది. దీని వల్ల భవిష్యత్తులో వారి కుటుంబానికి సమస్యలు రాకుండా ఉంటాయి. ‘‘నామినీ నమోదు ప్రక్రియ చాలా సులభం. నామినీగా ప్రతిపాదిస్తున్న వ్యక్తి పూర్తి పేరు (అధికారిక ధ్రువీకరణ పత్రాల్లో ఉన్నట్టుగా), వయసు, పాలసీదారునితో ఉన్న అనుబంధం వివరాలు ఇస్తే చాలు’’ అని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఈడీ పునీత్‌ నందా తెలిపారు. నామినీ అంటే ఒక్కరనే పరిమితి లేదు.

ఒకరి కంటే ఎక్కువ మందిని నామినీలుగా పేర్కొనే ఆప్షన్‌ పాలసీదారునికి ఉంటుంది. ఇలా పేర్కొంటే ఒక్కో నామినీకి ఎంత మేర పరిహారం చెల్లించాలన్న వివరాలూ ఇవ్వాలి. ఒకవేళ నామినీ మైనర్‌ అయితే ఆ మైనర్‌కు సంబంధించి అపాయింటీ లేదా ట్రస్టీని పేర్కొనాల్సి ఉంటుంది. ‘‘చట్ట ప్రకారం మైనర్లు ఓ కాంట్రాక్టు పరిధిలో చేరేందుకు అర్హులు కారు. దాంతో బీమా పరిహారం నేరుగా పొందేందుకు అవకాశం లేదు. ఇటువంటి సందర్భం ఎదురైతే అపాయింటీకి పరిహారం చెల్లిస్తారు’’ అని పునీత్‌ వివరించారు.

ఒకసారి నామినీగా ఎవరి పేరును అయినా నమోదు చేసిన తర్వాత పాలసీ కాల వ్యవధిలోపు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తిరిగి మార్చుకోవచ్చు. చివరిగా పేర్కొన్న నామినీయే చట్టప్రకారం అర్హులుగా ఉంటారు. ఒకవేళ నామినీలో మార్పులు చేయదలిస్తే సంబంధిత దరఖాస్తును పూర్తి చేసి బీమా సంస్థకు అందజేయాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు నామినేషన్‌ వివరాలను సమీక్షించుకుంటూ, జీవితంలో వివాహం, నామినీగా ప్రతిపాదించిన వారు మరణించడం వంటి సందర్భాల్లో కొత్తగా మరొకరిని నామినీగా చేర్చుకోవడం పాలసీదారులు గుర్తుంచుకోవాల్సిన విషయం. ప్రస్తుతం బీమా సంస్థలు ఆన్‌లైన్‌లోనే నామినీ వివరాలు మార్చుకునే అవకాశం కూడా కల్పిస్తున్నాయి.

చెల్లుబాటు
జీవిత బీమా పాలసీదారుడు మరణించిన సందర్భంలో నామినీకి పరిహారం అందుతుంది. కొన్ని సందర్భాల్లో కాదు. ఉదాహరణకు పాలసీదారుడు ఏదైనా రుణం తీసుకుని హామీగా బీమా పాలసీని తనఖాగా ఉంచితే, అప్పుడు ఆ పాలసీని అసైన్‌ చేయాల్సి ఉంటుందని యూసుఫ్‌ పేర్కొన్నారు.

‘‘పాలసీని తనఖాగా ఉంచి ఇతరులకు అప్పగించితే అప్పుడు పాలసీదారుడు ఆ విషయాన్ని కంపెనీకి తెలియజేయాల్సి ఉంటుంది. దాంతో బీమా సంస్థ అసైన్‌మెంట్‌ను రిజిస్టర్‌ చేస్తుంది. అప్పుడు పాలసీ డాక్యుమెంట్‌ను అసైనీ (ఎవరికి అయితే తనఖా పెట్టారో)కి పంపడం జరుగుతుంది. ఆ తర్వాత ఏ పాలసీదారుడు మరణిస్తే పరిహారం అసైనీకే చెల్లించడం జరుగుతుంది’’ అని యూసుఫ్‌ వివరించారు. తనఖా పెట్టి ఆ తర్వాత విడిపించుకుంటే తిరిగి పాలసీదారుడు తన పాలసీకి నామినేషన్‌ నమోదు చేసుకోవాల్సి ఉంటుందన్నారు.  

నామినీ ఎవరు?
నామినీ అంటే పాలసీదారుడి కుటుంబమే. జీవిత భాగస్వామి, పిల్లలు, తల్లిదండ్రులు. అయితే, పాలసీదారుడు ఇంకెవరినైనా కూడా నామినీగా ప్రతిపాదించొచ్చు. ‘‘చట్టబద్ధమైన వారసులు కాకుండా, రక్త సంబధీకులు కాకుండా మరెవరినో నామినేట్‌ చేస్తే, క్లెయిమ్‌ సమయంలో కుటుంబ సభ్యుల మధ్య వివాదం ఏర్పడవచ్చు. రక్త సంబంధం లేదా పాలసీదారుని కుటుంబ సభ్యులు అయితే ఎటువంటి ప్రశ్నలు లేకుండా క్లెయిమ్‌ దరఖాస్తును ఆమోదించడం జరుగుతుంది. ఇతరులైతే బీమా కంపెనీల్లో అండర్‌ రైటింగ్‌ సమయంలో ప్రశ్నలు తలెత్తవచ్చు’’ అని పచ్‌మరివాలా పేర్కొన్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top