 
													శాన్‌ఫ్రాన్సిస్కో: యాపిల్ కంపెనీ గత జూన్ క్వార్టర్‌లో విక్రయించిన ఫోన్ల సంఖ్య కన్నా ఈ జూన్ క్వార్టర్‌లో విక్రయించిన ఫోన్ల సంఖ్య 1 శాతమే పెరిగినా,  ఆదాయం, లాభాలు మాత్రం బాగా పెరిగాయి. ధరలు అధికంగా ఉన్న ఐఫోన్ ఎక్స్, ఐఫోన్ 8 మోడళ్ల ఫోన్ విక్రయాలే దీనికి కారణమని నిపుణులంటున్నారు. జూన్ క్వార్టర్‌లో ముగిసిన కాలానికి ఈ కంపెనీ నికర లాభం 32 శాతం వృద్ధితో 1,152 కోట్ల డాలర్లకు పెరిగింది. ఆదాయం 17 శాతం పెరిగి 5,327 కోట్ల డాలర్లకు చేరింది. ఇక సెప్టెంబర్‌తో ముగిసే తర్వాతి క్వార్టర్‌లో తమ ఆదాయం 6,000 కోట్ల డాలర్ల నుంచి 6,200 కోట్ల డాలర్ల వరకూ పెరగవచ్చని యాపిల్ అంచనా వేస్తోంది. 
తొలి ట్రిలియన్ డాలర్ల కంపెనీ..! 
ఫలితాల జోరుతో కంపెనీ షేరు 5 శాతం పెరిగి 200 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఈ షేర్ 206.49 డాలర్లను తాకితే  ట్రిలియన్ (లక్ష కోట్ల) డాలర్ల మార్కెట్ విలువను చేరిన తొలి కంపెనీగా యాపిల్ అవతరిస్తుంది. మన దేశానికి చెందిన టీసీఎస్, రిలయన్స్‌లు ఇటీవలనే 100 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్ కంపెనీలుగా నిలిచిన విషయం తెలిసిందే.  ఈ ఏడాదిలో యాపిల్ షేర్ ఇప్పటిదాకా 18 శాతం ఎగసింది.   యాపిల్ దగ్గర 243 బిలియన్ డాలర్ల నగదు ఉందని అంచనా. ఇది టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్‌ల కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్ కంటే(200 బిలియన్ డాలర్లు)  అధికం కావడం విశేషం.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
