యాపిల్‌ ఆదాయం 61.1 బిలియన్‌ డాలర్లు..

Apple proved that it is no longer just an iPhone company - Sakshi

2018 రెండో క్వార్టర్‌లో రికార్డు

వార్షిక ప్రాతిపదికన 16 శాతం జంప్‌

సీక్వెన్షియల్‌గా 32 శాతం తగ్గిన అమ్మకాలు   

న్యూయార్క్‌: టెక్‌ దిగ్గజం యాపిల్‌ మార్చి క్వార్టర్లో అత్యుత్తమ ఫలితాలను ప్రకటించింది. సంస్థ 2018 రెండో క్వార్టర్‌లో (మార్చి 31తో ముగిసిన త్రైమాసికం) ఏకంగా 61.1 బిలియన్‌ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది. వార్షిక ప్రాతిపదికన 16 శాతం వృద్ధి నమోదయింది. యాపిల్‌కు ఇప్పటిదాకా ఇవే ఉత్తమ మార్చి క్వార్టర్‌ ఫలితాలు కావడం గమనార్హం. యాపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌ మంగళవారం ఈ ఫలితాలను వెల్లడించారు. ‘అత్యుత్తమ మార్చి త్రైమాసిక ఫలితాలను ప్రకటించడం సంతోషంగా ఉంది. ఐఫోన్, సర్వీసులు, వేరబుల్స్‌ ఆదాయంలో బలమైన వృద్ధి దీనికి ప్రధాన కారణం’ అని వివరించారు. ఆదాయంలో అంతర్జాతీయ విక్రయాలు 65 శాతం వాటాను ఆక్రమించాయన్నారు.

‘మార్చి క్వార్టర్‌లో కస్టమర్లు ప్రతి వారంలోనూ ఇతర ఐఫోన్‌ల కన్నా ఐఫోన్‌–ఎక్స్‌ మోడల్‌నే ఎక్కువగా ఎంచుకున్నారు. అన్ని ప్రాంతాల్లోనూ ఆదాయంలో వృద్ధి కనిపించింది. గ్రేటర్‌ చైనా, జపాన్‌లో ఏకంగా 20 శాతానికిపైగా వృద్ధి సాధించాం’ అని పేర్కొన్నారు. యాపిల్‌ బోర్డు కొత్తగా 100 బిలియన్‌ డాలర్ల విలువైన షేర్లను తిరిగి కొనుగోలు చేయడానికి, క్వార్టర్లీ డివిడెండ్‌ను 16 శాతం ఎక్కువగా చెల్లించేందుకు ఆమోదం తెలిపిందని సంస్థ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ లూకా మాస్ట్రీ తెలిపారు. కాగా యాపిల్‌ 2018 రెండో క్వార్టర్‌లో 5.22 కోట్ల యూనిట్ల ఐఫోన్‌లను విక్రయించింది. తొలి క్వార్టర్‌లోని 7.73 కోట్ల యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే ఇవి 32 శాతం తగ్గాయి. అయితే 2017 రెండో క్వార్టర్‌లోని 5.07 కోట్ల యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే 3 శాతం వృద్ధి కనిపించింది. ఇక 2018 రెండో క్వార్టర్‌లో సంస్థ నికర లాభం 13.8 బిలియన్‌ డాలర్లుగా ఉంది. 

భారత్‌పై అధిక దృష్టి
ప్రపంచంలో మూడో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ను కలిగిన భారత్‌పై తాము ప్రధానంగా దృష్టి కేంద్రీకరించామని టిమ్‌ కుక్‌ తెలిపారు. ఇక్కడ ఎక్కువ వృద్ధికి అవకాశాలున్నాయని అభిప్రాయపడ్డారు. ఇండియన్‌ మార్కెట్‌లో ప్రస్తుతం తమకు చాలా తక్కువ వాటా ఉందన్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top