చైనాకు అమెరికా టెక్‌ దిగ్గజం సాయం

Apple Has Announced A $300 Million Green Energy Fund In China - Sakshi

బీజింగ్‌ : ఓ వైపు అమెరికాకు, చైనాకు మధ్య ట్రేడ్‌ వార్‌ పరిస్థితులు ఉద్రిక్తమవుతే, మరోవైపు అమెరికా టెక్‌ దిగ్గజాలు చైనాకు సాయం చేస్తున్నాయి. తాజాగా ఆపిల్‌, చైనాలో 300 మిలియన్‌ డాలర్ల(రూ.2,054 కోట్ల) క్లీన్‌ ఎనర్జీ ఫండ్‌ను లాంచ్‌చేసింది. ఆ దేశంలో 10 లక్షల గృహాలకు విద్యుత్‌ అందించే లక్ష్యంతో పునరుత్పాదక శక్తి ప్రాజెక్టులలో ఈ మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టనున్నట్టు ఆపిల్‌ ప్రకటించింది. 

చైనా ప్రభుత్వం ప్రస్తుతం కాలుష్యం తగ్గించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. నగరాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కాలుష్య పొగను తగ్గించాలని, దేశం జలమార్గాలను, కలుషిత మట్టిని శుభ్రం చేయాలని స్థానిక, అంతర్జాతీయ కంపెనీలను చైనా ఆదేశించింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని చైనా ప్రభుత్వం కంపెనీలపై ఒత్తిడి తీసుకొస్తోంది. దీంతో కంపెనీలు సైతం ఈ మేరకు చర్యలు తీసుకోవడం ప్రారంభించాయి. పెగాట్రోన్‌ కార్ప్‌, విస్ట్రోన్‌ కార్ప్‌ వంటి 10 మంది సప్లయిర్స్‌తో కలిసి, పునరుత్పాదక శక్తి ప్రాజెక్టుల్లో ఈ మొత్తాన్ని ఐఫోన్‌ తయారీదారి పెట్టుబడిగా పెడుతోంది. 

కాగ, అమెరికా, చైనాల మధ్య నెలకొన్న ట్రేడ్‌ వార్‌, బిలియన్‌ డాలర్ల ఉత్పత్తులపై దెబ్బకు దెబ్బ మాదిరి టారిఫ్‌ల మోత ప్రపంచంలో ఈ రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలకు ప్రతికూలంగా మారాయి. ఇరు దేశాలు ప్రశాంతంగా ఉండాలని ఆపిల్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ టిమ్‌ కుక్‌ పిలుపు కూడా ఇచ్చారు. ఆపిల్‌ సంస్థ తన ఉత్పత్తుల్లో ఎక్కువ భాగం చైనాకే సరఫరా చేస్తుంది. ఆపిల్‌కు అత్యంత కీలకమైన మార్కెట్లలో చైనా కూడా ఒకటి. అయితే ఇటీవల స్థానిక స్మార్ట్‌ఫోన్‌ ప్రత్యర్థుల నుంచి ఆపిల్‌కు పెద్ద ఎత్తున్నే సవాళ్లు ఎదురవుతున్నాయి.     
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top