పీఎన్‌బీకి మరో షాక్‌

Another shock to punjab national bank - Sakshi

స్కామ్‌ ఇంకో రూ.1,322 కోట్లు పెరగొచ్చు

నీరవ్‌ మోదీ దెబ్బ మొత్తంగా రూ.12,717 కోట్లు  

న్యూఢిల్లీ: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (పీఎన్‌బీ) కుంభకోణంలో తవ్విన కొద్దీ మరిన్ని అక్రమ లావాదేవీలు బయట పడుతున్నాయి. తాజాగా ఈ స్కామ్‌ పరిమాణం మరో రూ. 1,322 కోట్లు పెరిగి మొత్తం రూ. 12,717 కోట్లకు చేరింది. స్టాక్‌ ఎక్సే్చంజీలకు పంపిన సమాచారంలో పీఎన్‌బీ ఈ విషయం వెల్లడించింది. ‘అనధికారిక లావాదేవీల పరిమాణం మరో 204.25 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ. 1,322 కోట్లు) మేర పెరగొచ్చని అంచనా వేస్తున్నాం‘ అంటూ బ్యాంకు పేర్కొంది.

వజ్రాభరణాల వ్యాపారస్తులు నీరవ్‌ మోదీ, మెహుల్‌ చోక్సీలకు చెందిన సంస్థలు తెరతీసిన ఈ స్కామ్‌ విలువ సుమారు రూ.11,400 కోట్లు ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేశారు. అయితే, విచారణలో మరిన్ని లావాదేవీలు బయటపడుతున్నాయి. దీంతో స్కామ్‌ మొత్తం మరింతగా పెరుగుతోంది. పీఎన్‌బీ అధికారులతో కుమ్మక్కై మోసపూరితంగా బ్యాంకు గ్యారంటీలు తీసుకున్న మోదీ, చోక్సీలకు చెందిన సంస్థలు... వాటి ఆధారంగా అలహాబాద్‌ బ్యాంక్, యాక్సిస్‌ బ్యాంక్‌ తదితర బ్యాంకుల విదేశీ శాఖల నుంచి భారీగా రుణాలు పొందాయి. తద్వారా భారీ స్కామ్‌కి తెరతీశాయి.

జనవరి 25న దీన్ని గుర్తించిన బ్యాంకు.. జనవరి 29న ఆర్‌బీఐకి, సీబీఐకి ఫిర్యాదు చేసింది. ఫిబ్రవరి 5న స్టాక్‌ ఎక్సే్చంజీలకు తెలియజేసింది. ఆ తర్వాత ఫిబ్రవరి 7న ఆర్‌బీఐకి మరో నివేదికనిచ్చిన పీఎన్‌బీ.. నీరవ్‌ మోదీ గ్రూప్, గీతాంజలి గ్రూప్‌ మొదలైన వాటిపై అటు సీబీఐకి, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌కి మరో ఫిర్యాదు కూడా చేసింది. ఈ కేసులో పది మంది పైగా ఉద్యోగులను బ్యాంకు సస్పెండ్‌ చేసింది.   మరోవైపు, ఈ మోసం కారణంగా నష్టపోయిన ఇతర బ్యాంకులకు పరిహారం చెల్లించాలంటూ ప్రభుత్వం నుంచి తమకు ఆదేశాలేమీ రాలేదని పీఎన్‌బీ స్పష్టం చేసింది. ఒకవేళ చట్టప్రకారం చెల్లించాల్సి వస్తే తమ దగ్గర తగినన్ని ఆస్తులు ఉన్నాయని పేర్కొంది.

నీరవ్‌ మోదీ ఫైర్‌స్టార్‌ డైమండ్‌ దివాలా..
నీరవ్‌ మోదీకి చెందిన ఫైర్‌స్టార్‌ డైమండ్‌ సంస్థ దివాలా ప్రకటించింది. ఇందుకు సంబంధించి దివాలా రక్షణ చట్టం చాప్టర్‌ 11 కింద న్యూయార్క్‌ సదరన్‌ దివాలా కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. రుణదాతల సంఖ్య 50 నుంచి 99 దాకా ఉంటుందని పేర్కొంది. రుణాలు తిరిగి చెల్లించడంలో.. నిధుల కొరత, సరఫరాపరమైన సమస్యలు ప్రధాన సవాళ్లుగా మారినట్లు ఫైర్‌స్టార్‌ డైమండ్‌ వివరించింది. 100 మిలియన్‌ డాలర్ల మేర ఆస్తులు, అప్పులు  పిటిషన్లో చూపింది. కంపెనీకి భారత్‌తో పాటు అమెరికా, యూరప్, మధ్యప్రాచ్య దేశాల్లో కార్యకలాపాలున్నాయి.

ఫైర్‌స్టార్‌ డైమండ్‌ వెబ్‌సైట్‌ ప్రకారం.. 1999లో విడి వజ్రాల సరఫరాదారుగా సంస్థ కార్యకలాపాలు ప్రారంభించింది. ఆ తర్వాత 2001లో ఆభరణాల తయారీ మొదలుపెట్టింది. ప్రైవేట్‌ లేబుల్‌ ఉత్పత్తుల కోసం ఫ్రెడరిక్‌ గోల్డ్‌మన్‌ డైమండ్‌ జ్యుయలరీ సంస్థను కొనుగోలు చేయడంతో పాటు అమెరికా రిటైల్‌ మార్కెట్లోకి ప్రవేశించింది. అటుపైన అమెరికాలో వ్యాపార కార్యకలాపాలు విస్తరించింది. 2009లో బెల్జియంలో యూనిట్‌ ప్రారంభించింది. 2010లో నీరవ్‌ మోదీ అల్ట్రా లగ్జరీ డైమండ్‌ జ్యుయలరీ బ్రాండ్‌ను మొదలుపెట్టింది.
 

 రూ.50 కోట్ల పైబడ్డ ఎన్‌పీఏలపై విచారణ
మోసాలకు ఆస్కారమున్న రూ.50 కోట్ల పైబడ్డ మొండిపద్దులన్నింటిపైనా (ఎన్‌పీఏ) విచారణ జరపాలని ప్రభుత్వ రంగ బ్యాంకులను ఆర్థిక శాఖ ఆదేశించింది. అలాంటి కేసులేమైనా ఉంటే తక్షణం సీబీఐకి ఫిర్యాదు చేయాలని సూచించింది. ‘రూ.50 కోట్ల పైబడిన మొండి బాకీల విషయంలో మోసాలకు ఆస్కారమేదైనా ఉందేమో పరిశీలించాలని ప్రభుత్వ రంగ బ్యాంకు ఎండీలకు సూచించాం. అలాంటి మోసాలు, ఉద్దేశపూర్వక ఎగవేతలను సత్వరం గుర్తించాలని, సీబీఐకి ఫిర్యాదు చేయాలని ఆదేశించాం‘ అని రాజీవ్‌ కుమార్‌ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఎగుమతి, దిగుమతి నిబంధనలు.. విదేశీ మారక నిర్వహణ చట్టం ఉల్లంఘనలు మొదలైనవి బయటపడిన పక్షంలో అవసరమైతే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్, డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌కి కూడా ఫిర్యాదు చేయాలని పీఎస్‌బీలకు కేంద్రం సూచించింది. సదరు బ్యాంకుల చీఫ్‌ విజిలెన్స్‌ ఆఫీసర్లు.. రూ. 50 కోట్ల పైబడిన మోసాలపై సీబీఐకి ఫిర్యాదు చేయాలని, విచారణ విషయంలో దర్యాప్తు సంస్థతో కలిసి పనిచేయాలని పేర్కొంది. అటు మొండిబాకీగా మారిన ఖాతాదారు పరిస్థితిపై సెంట్రల్‌ ఎకనమిక్‌ ఇంటెలిజెన్స్‌ బ్యూరో (సీఈఐబీ) నుంచి కూడా బ్యాంకులు నివేదిక కోరవచ్చని, వారం రోజుల వ్యవధిలో సీఈఐబీ స్పందించాల్సి ఉంటుందని తెలిపింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top