‘అమ్రపాలి’పై ఎన్‌సీఎల్‌టీకి వెళ్లండి!

Amrapali Group Case: Supreme Court Orders Sale Of Directors Assets - Sakshi

కార్పొరేషన్‌ బ్యాంక్‌కు సుప్రీం అనుమతి  

న్యూఢిల్లీ: రియల్టీ కుంభకోణంలో చిక్కుకున్న అమ్రపాలి గ్రూప్‌నకు వ్యతిరేకంగా ఎన్‌సీఎల్‌టీని (నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌) ఆశ్రయించడానికి కార్పొరేషన్‌ బ్యాంక్‌కు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. అమ్రపాలి గ్రూప్‌నకు రుణాలిచ్చిన బ్యాంకుల కన్సార్షియంకు కార్పొరేషన్‌ బ్యాంక్‌ నేతృత్వం వహిస్తోంది. అయితే సుప్రీం ఆదేశాలు లేకుండా ఈ కేసులో తదుపరి ప్రొసీడింగ్స్‌ చేపట్టకూడదని ఎన్‌సీఎల్‌టీకి జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా, యూయూ లలిత్‌ల ద్విసభ్య ధర్మాసనం నియంత్రణలు విధించింది. అమ్రపాలి గ్రూప్‌నకు కార్పొరేషన్‌ బ్యాంక్‌ రూ.270 కోట్ల రుణాలు ఇచ్చింది.   

వేలానికి 16 ఆస్తులు..: గ్రూప్‌నకు చెందిన 16 ఆస్తుల వేలానికి సుప్రీంకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. తద్వారా వచ్చిన నిధులను... నిలిచిపోయిన ప్రాజెక్టుల పని ప్రారంభించడానికి ప్రభుత్వ రంగ ఎన్‌బీసీసీ వినియోగించుకోడానికి కూడా వీలు కల్పించింది. నిలిచిపోయిన 15 హౌసింగ్‌ ప్రాజెక్టులకు సంబంధించి మొత్తం 46,575 ఫ్లాట్స్‌ను 36 నెలల్లో దశల వారీగా నిర్మించి ఇవ్వగలమని.. ఇందుకు రూ.8,500 కోట్ల నిధులు కావాలని  సుప్రీంకు సమర్పించిన అఫిడవిట్‌లో ఎన్‌బీసీసీ ప్రతిపాదించింది.  

సీఎండీ ఆస్తులపైనా ఆదేశాలు.. 
ఈ కేసులో గ్రూప్‌ సీఎండీ అనిల్‌ శర్మ.. తన ఆస్తుల విలువ రూ.67 కోట్లు అని ఇప్పుడు డిక్లేర్‌ చేయడాన్ని ప్రస్తావిస్తూ, 2014 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ సందర్భంగా రూ.847 కోట్ల ఆస్తులున్నట్లు శర్మ ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొనడాన్ని సుప్రీం ప్రస్తావించింది. నాలుగేళ్లలో ఈ ఆస్తులు ఎలా కరిగిపోయాయని ప్రశ్నించింది. శర్మ, ఇతర డైరెక్టర్లు వారి కుటుంబ సభ్యుల ఆస్తుల జాబితా నాలుగురోజుల్లో సమర్పించాలని ఆదేశించిన న్యాయస్థానం కేసు తదుపరి విచారణను సెప్టెంబర్‌ 12కు వాయిదా వేసింది. 46 గ్రూప్‌ కంపెనీలు, వాటి డైరెక్టర్లు, ప్రమోటర్లు, వారి జీవిత భాగస్వాములు,  పిల్లల ఆస్తులకు సంబంధించి రెండు నెలల్లో ఫోరిన్సిక్‌ ఆడిట్‌ నిర్వహించాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top