సమోసా, కచోరీలతో కోట్లకు కొలువుతీరి..

Aligarh Kachori Seller Gets IT Notice - Sakshi

లక్నో : యూపీలోని అలీగఢ్‌లో సమోసాలు, కచోరీలు అమ్ముకునే చిరు వ్యాపారికి ఐటీ నోటీసులు అందాయి. అది చూసేందుకు చిన్న షాపే అయినా అమ్మకాలు మాత్రం ఏటా రూ 60 లక్షల నుంచి రూ కోటి వరకూ ఉండటంతో జీఎస్‌టీ కింద నమోదు చేసుకుని పన్ను చెల్లించాలని పేర్కొంటూ వ్యాపారికి అధికారులు నోటీసులు జారీ చేశారు. ముఖేష్‌ కచోరి పేరుతో సీమా సినిమా హాల్‌ సమీపంలో ఉన్న ఈ దుకాణాన్ని రోజూ ఉదయాన్నే తెరిచి రాత్రి పొద్దుపోయేదాకా నడిపిస్తారు. ఇక్కడ వండివార్చే సమోసాలు, కచోరీలకు స్ధానికుల్లో విపరీతమైన క్రేజ్‌ ఉంది.

రోజూ కస్టమర్ల తాకిడితో కౌంటర్‌ కళకళలాడటంతో అంతా బాగానే ఉన్నా ఈ షాప్‌పై వచ్చిన ఫిర్యాదుపై వాణిజ్య పన్నుల శాఖ అధికారులు రంగంలోకి దిగారు. షాప్‌ ఎదురుగా ఉన్న మరో దుకాణంలో కూర్చున్న అధికారులు అక్కడ జరిగే తంతును గమనించారు. ముఖేష్‌ కచోరీలు, సమోసాలపై ఏటా రూ 60 లక్షల నుంచి రూ కోటికి పైగానే ఆర్జిస్తాడని అంచనా వేశారు. అధికారులు ఆరా తీయడంతో కంగుతిన్న ముఖేష్‌ తనకు ఇవేమీ తెలియవని, గత 12 ఏళ్లుగా తాను ఈ షాపును నడిపిస్తున్నా ఈ లాంఛనాలు ఉంటాయని తనకు ఎవరూ చెప్పలేదని చెప్పుకొచ్చాడు.

తాను బతికేందుకు చిన్న స్ధాయిలో ఈ వ్యాపారం చేసుకుంటున్నానని చెప్పడంతో అధికారులు విస్తుపోయారు. ముఖేష్‌ తన వ్యాపారం గురించి పూర్తిగా చెప్పాడని, ఎంత ఆదాయం వస్తుంది నూనె, సిలిండర్‌ వంటి ముడి సరుకులకు ఎంత ఖర్చవుతుందనేది చెప్పాడని ఈ కేసును విచారించిన రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఎస్‌ఐబీ) సభ్యుడు తెలిపారు. రూ 40 లక్షల వార్షిక టర్నోవర్‌ను మించిన వారంతా జీఎస్టీ రిజిస్ర్టేషన్‌ చేయించుకోవాలని, సిద్ధం చేసిన ఆహారంపై 5 శాతం పన్ను విధిస్తారని చెప్పారు. ముఖేష్‌కు నోటీసు జారీ చేసిన అధికారులు అతనితో జీఎస్టీ రిజిస్ర్టేషన్‌ చేయించి పన్ను వసూలు చేసే ప్రక్రియను చేపట్టారు. అసంఘటిత రంగంలో ఇలాంటి వ్యాపారులు ఎందరో అవగాహన లేమితో జీఎస్టీ ఎగవేతకు పాల్పడుతున్నారని, వారందరినీ పన్ను వ్యవస్ధలోకి తీసుకువచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేస్తామని అధికారులు చెబుతున్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top