ఐటీ రిటర్న్స్కు ఆధార్‌ ఉండాల్సిందే | Sakshi
Sakshi News home page

ఐటీ రిటర్న్స్కు ఆధార్‌ ఉండాల్సిందే

Published Sat, Jun 10 2017 5:19 PM

Aadhaar number will be mandatory for filing Income Tax Returns from July 1, says Central Board of Direct Taxes

న్యుఢిల్లీ: 2017,జూలై 1నుంచి ఆదాయ పన్ను  రిటర్న్స్ దాఖలుకు ఆధార్‌ కార్డు తప్పనిసరి  అని సెంట్రల్ బోర్డ్ ఆఫ్‌  డైరెక్ట్‌ టాక్సెస్‌( సీబీడీటీ) శనివారం మరోసారి తేల్చి చెప్పింది. అయితే  దేశ అత్యున్నత కోర్టు    ఇచ్చిన పాక్షిక ఉపశమనం నేపథ్యంలో   ఆధార్‌ కార్డు  లేని  వారి  పాన్‌  కార్డులు రద్దు చేయబోమని సీబీడీటీ  స్పష్టం చేసింది. ఇంతవరకూ ఆధార్‌ లేనివారు ఆదాయపు పన్ను రిటర్న్స్‌ దాఖలు చేయవచ్చన్న సుప్రీం వ్యాఖ్యల నేపథ్యంలో  ఆదాయపన్ను శాఖ అత్యున్నత బాడీ ఈ వివరణ ఇచ్చింది.

పాన్‌ కార్డుకు, ఐటీ రిటర్న్స్‌కు ఆధార్‌ కార్డు అనుసంధానాన్ని తప్పనిసరి చేయడాన్ని సుప్రీం కోర్టు సమర్థించింది. అయితే ఇప్పటివరకు ఆధార్‌ లేనివారికి, దాని కోసం దరఖాస్తు చేసుకున్నవారికి ఆ కార్డు పొందేవరకు మినహాయింపునిస్తూ  శుక్రవారం  పాక్షిక స్టే ఇచ్చింది. వ్యక్తిగత గోప్యత అంశంపై రాజ్యాంగ ధర్మాసనం నిర్ణయం తీసుకునేవరకు ఈ మినహాయింపు ఉంటుందని పేర్కొంది.  అయితే ఇప్పటికే ఆధార్‌ ఉన్నవారు మాత్రం పాన్‌ (పర్మనెంట్‌ అకౌంట్‌ నంబర్‌)కు అనుసంధానం చేసుకోవాలని చెప్పింది.  అలాగే ఆధార్‌ కోసం దరఖాస్తు చేసి ఇంకా పొందని వారికి పాన్‌కార్డుతో అనుసంధానం నుంచి మినహాయింపుతోపాటు, వారి పాన్‌కార్డుల్ని  చెల్లనివిగా  ప్రకటించకూడదని ఆదేశించింది.

పాన్‌ జారీ, ఆదాయపన్ను రిటర్న్స్‌ దాఖలుకు ఆధార్‌ లింకును ఈ ఏడాది జూలై 1 నుంచి తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆదాయ పన్ను(ఐటీ) చట్టంలో సెక్షన్‌ 139ఏఏను తీసుకురావడం తెలిసిందే.

 

Advertisement
Advertisement