18% తగ్గిన హిందుస్తాన్‌ జింక్‌ లాభం

18% reduced Hindustan zinc profit - Sakshi

క్యూ4 ఆదాయంలోనూ క్షీణత

పూర్తి ఆర్థిక సంవత్సరంలో మాత్రం వృద్ధి

న్యూఢిల్లీ: వేదాంత గ్రూపులో భాగమైన హిందుస్తాన్‌ జింక్‌ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో 18 శాతం తగ్గింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.3,057 కోట్లుగా ఉన్న నికర లాభం గత క్యూ4లో రూ.2,505 కోట్లకు తగ్గిందని హిందుస్తాన్‌ జింక్‌ తెలిపింది.

మొత్తం ఆదాయం రూ.7,237 కోట్ల నుంచి రూ.6,763 కోట్లకు తగ్గిందని కంపెనీ చైర్మన్‌ అగ్నివేశ్‌ అగర్వాల్‌ వెల్లడించారు. జింక్, ఇతర లోహాల ఆదాయం రూ.6,107 కోట్ల నుంచి రూ.5,547 కోట్లకు, పవన విద్యుత్తు విభాగం ఆదాయం రూ.29 కోట్ల నుంచి రూ.22 కోట్లకు తగ్గాయని వివరించారు. వెండి లోహం ఆదాయం మాత్రం రూ.563 కోట్ల నుంచి రూ.637 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు.

సంవత్సర ఆదాయం రూ.24,272 కోట్లకు...
ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2016–17లో రూ.8,316 కోట్లుగా ఉన్న నికర లాభం గత ఆర్థిక సంవత్సరంలో 12 శాతం వృద్ధితో రూ.9,276 కోట్లకు పెరిగిందని అగ్నివేశ్‌ అగర్వాల్‌ వెల్లడించారు. మొత్తం ఆదాయం రూ.21,272  కోట్ల నుంచి రూ.24,272 కోట్లకు పెరిగిందని వివరించింది.

గత ఆర్థిక సంవత్సరంలో మంచి పనితీరు కనబరిచామని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఒక్కో షేర్‌కు రూ.6  మధ్యంతర డివిడెండ్‌ను ఇవ్వనున్నామని ఈ ఏడాది మార్చిలోనే ప్రకటించామని, ఇప్పుడు ఎలాంటి తుది డివిడెండ్‌ను ఇవ్వడం లేదని పేర్కొన్నారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో హిందుస్తాన్‌ జింక్‌ షేర్‌ ధర 0.3 శాతం లాభంతో రూ.327 వద్ద ముగిసింది.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top