ఇక ఒక్కొక్కరికి  18 మొబైల్‌ కనెక్షన్లు!

18 mobile connections per person - Sakshi

ఇ–సిమ్స్‌ వినియోగానికి అనుమతి 

 టెలికం విభాగం కొత్త మార్గదర్శకాలు 

న్యూఢిల్లీ: మొబైల్‌ యూజర్లు సర్వీస్‌ ప్రొవైడర్‌ను మార్చినప్పుడు, కొత్త కనెక్షన్‌ను తీసుకున్నప్పుడు కొత్తగా సిమ్‌ను తీసుకోవాల్సిన పని తప్పనుంది. టెలికం విభాగం (డాట్‌) తాజాగా కొత్త మార్గదర్శకాలను తీసుకువచ్చింది. ఇందులో సింగిల్, మల్టీపుల్‌ కాన్ఫిగరేషన్స్‌తో ఇ–సిమ్‌ వినియోగానికి అనుమతినిచ్చింది. అలాగే మొబైల్‌ కనెక్షన్ల పరిమితిని కూడా పెంచింది. ఎం2ఎం/ఐఓటీలో ఆధునిక సాంకేతిక అవసరాలను తీర్చడానికి ఇ–సిమ్‌ (ఎంబెడెడ్‌ సబ్‌స్క్రైబర్‌ ఐడెంటిటీ మాడ్యూల్‌) వినియోగానికి అనుమతినిస్తున్నట్లు డాట్‌ తెలిపింది. ఇ–సిమ్‌ను డివైజ్‌లలో ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. సర్వీస్‌ మార్చినప్పుడు, కొత్త కనెక్షన్‌ తీసుకున్నప్పుడు ఇందులో సర్వీస్‌ ప్రొవైడర్ల వివరాలను అప్‌డేట్‌ చేసుకోవచ్చు. 

కారులో ఇంధనం తక్కువగా ఉన్నప్పుడు, కారు దొంగతనానికి గురైనప్పుడు, రిమోట్‌ కంట్రోల్‌ తదితర వాటికి సంబంధించి వెహికల్‌ నుంచి మొబైల్‌కు వచ్చే అలర్ట్స్‌ వంటి మెషీన్‌–టు–మెషీన్‌ (ఎం2ఎం) కమ్యూనికేషన్స్‌లో వినియోగించే సిమ్‌లకు కూడా నిబంధనలు విడుదల చేసింది. ఎం2ఎం కమ్యూనికేషన్స్‌కు వినియోగించే సిమ్‌లకు 13 అంకెలు ఉంటాయని డాట్‌ గతంలోనే తెలియజేసింది. ఎం2ఎం కమ్యూనికేషన్స్‌కు ఎక్కువ సిమ్‌ కార్డులు అవసరమౌతాయి. అందువల్ల డాట్‌ ఒక్కొక్కరికి మొబైల్‌ కనెక్షన్ల(సిమ్‌ కార్డులు) పరిమితిని 18కి పెంచింది (ప్రస్తుత పరిమితి 9). వీటిలో సాధారణ మొబైల్‌ ఫోన్‌ కమ్యూనికేషన్స్‌ కోసం 9 సిమ్‌లను, మరో 9 సిమ్‌లను ఎం2ఎం కమ్యూనికేషన్‌ సేవలకు ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ డివైస్‌లో ఎం2ఎం సిమ్‌ను ప్రి–ఇన్‌స్టాల్‌ చేయవలసి వస్తే, అప్పుడు సబ్‌స్క్రైబర్‌ వెరిఫికేషన్‌ను డివైజ్‌ తయారీ సంస్థలే పూర్తి చేయాలని డాట్‌ తెలిపింది. ఇక ఇ–సిమ్‌లో మొబైల్‌ నెంబర్‌ పోర్ట్‌బిలిటీ కోసం ఓవర్‌ ద ఎయిర్‌ సబ్‌స్క్రిప్షన్‌ అప్‌డేట్‌ ఫెసిలిటీ కల్పించింది. ఇ–సిమ్‌పై సర్వీసులు అందించే టెలికం ఆపరేటర్లు వాటిపై తగిన పర్యవేక్షణ ఉంచాలని ఆదేశించింది.  

రిలయన్స్‌ జియో, భారతీ ఎయిర్‌టెల్‌ సంస్థలు యాపిల్‌ వాచ్‌ సిరీస్‌–3 విక్రయాలను ప్రారంభించిన ఐదు రోజుల తర్వాత డాట్‌ ఈ మార్గదర్శకాలను జారీ చేయడం గమనార్హం. ఈ వాచ్‌లలో ఇ–సిమ్‌ ఉంటుంది. యూజర్లు వీటిని మొబైల్‌లోని సిమ్‌తో కనెక్ట్‌ చేసుకోవాలి. తద్వారా ఫోన్‌లోని సర్వీస్‌ ప్రొవైడర్‌ సేవలను పొందొచ్చు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top