ముఖ్యమంత్రిగా ఉండటానికి చంద్రబాబు అనర్హుడు

YSRCP MP Varaprasad Comments On CM Chandrababu - Sakshi

సాక్షి, గుంటూరు : టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండటానికి అనర్హుడని వైఎస్సార్‌ సీపీ మాజీ ఎంపీ వరప్రసాద్‌ రావు వ్యాఖ్యానించారు. గురువారం గుంటూరులో జరిగిన వంచనపై గర్జన దీక్షలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రత్యేక హోదా కోసం, ప్రజల కోసం రాజీనామా చేసిన తృప్తి తనకుందని అన్నారు. చంద్రబాబు నాయుడు విభజన హామీలు సాధించలేని అసమర్థుడని విమర్శించారు. నాలుగేళ్లుగా చంద్రబాబుకు విభజన హామీలేవి గుర్తుకు రాలేదని అన్నారు.

సీఎంగా ఉన్న ఇన్నేళ్ల కాలంలో చం‍ద్రబాబు ఏం చేశారని ప్రశ్నించారు. 10లక్షల ఉద్యోగాలు, 10లక్షల రేషన్‌ కార్డులను పీకేశారని మండిపడ్డారు. నాలుగేళ్లుగా కడప స్టీల్‌ప్లాంట్‌ చంద్రబాబుకు గుర్తుకురాలేదా అని ప్రశ్నించారు. చం‍ద్రబాబు 60 ప్రభుత్వ సంస్థలను మూసేశారని, గ్రామాల్లో ప్రభుత్వ స్కూళ్లు మూతపడుతున్నాయని అన్నారు. ఆయన చంద్రబాబు నాయుడు కాదు.. పీకే నాయుడు అంటూ ఎద్దేవా చేశారు. వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మాట తప్పని వ్యక్తని అన్నారు. వైఎస్‌ జగన్‌ వస్తేనే ప్రత్యేక హోదా సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.

రాజీనామా చేయమంటే దొడ్డి దారిన పారిపోయారు
గుంటూరు : టీడీపీ ఎంపీలను రాజీనామా చేయమంటే దొడ్డిదారిన పారిపోయారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిథి జోగి రమేష్‌ ఎద్దేవా చేశారు. గురువారం గుంటూరులో జరిగిన వంచనపై గర్జన దీక్షలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రత్యేక హోదా కోసం రాజీనామాలు చేసిన ఐదుగురు వైఎస్సార్‌ సీపీ ఎంపీలను ఆయన అభినందించారు. దేశ రాజకీయాలన్నీ వైఎస్సార్‌ సీపీ వైపు చూస్తున్నాయని తెలిపారు.

వైఎస్సార్‌ సీపీ ట్రాప్‌లో టీడీపీ పడిందని లోక్‌సభలో మోదీ చెప్పారు.. హోదా సాధించే క్రమంలో వైఎస్సార్‌ సీపీ ఎందాకైనా పోరాతుందని ప్రధానీ మోదీ పరోక్షంగా ఒప్పుకున్నారని అన్నారు. టీడీపీ ఎంపీల వేషాలన్నీ అయిపోయాయని, వారి వేషాలను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు. ప్రత్యేక హోదా వైఎస్‌ జగన్‌తోనే సాధ్యమన్నారు. హోదా ఎజెండాతోనే ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు. 

ఏపీని  చంద్రబాబు దోపిడీ చేశారు
గుంటూరు : నాలుగేళ్లు ఆంధ్రప్రదేశ్‌ను చంద్రబాబు దోపిడీ చేశారని వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి విమర్శించారు. గురువారం గుంటూరులో జరిగిన వంచనపై గర్జన దీక్షలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇప్పటికి హోదా పేరుతో చంద్రబాబు మోసం చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర భవిష్యత్‌ కోసం వైఎస్సార్‌ సీపీ ఎంపీలు రాజీనామా చేశారని తెలిపారు. చంద్రబాబు తన ఎంపీలను ఏరోజు కూడా హోదా కోసం పోరాటం చేయమని చెప్పలేదన్నారు.

అవిశ్వాసం పెడతామని.. మద్దతివ్వమన్నా చంద్రబాబు ఒప్పుకోలేదని చెప్పారు. మోదీ భయంతోనే.. వైఎస్‌ జగన్‌ చేసిన తీర్మానానికి మద్దతివ్వలేదని పేర్కొన్నారు. లక్షల కోట్ల అవినీతి నుంచి తప్పించుకునేందుకు హోదాను కేంద్రం వద్ద చంద్రబాబు తాకట్టుపెట్టారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, చంద్రబాబుకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర భవిష్యత్‌ కోసం వైఎస్‌ జగన్‌ పోరాటం చేస్తున్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు, మోదీలకు గుణపాఠం చెప్పాలన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top