యానిమేటర్లకు వైఎస్సార్‌సీపీ అండ

YSRCP Leaders Support to Animators Anantapur - Sakshi
అధికారంలోకి వస్తే రూ.10 వేలు వేతనం స్పష్టం చేసిన వైఎస్సార్‌ సీపీ నేతలు ధర్నాకు ఎమ్మెల్సీ వెన్నపూస, పీడీ రంగయ్య, తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి సంఘీభావం

అనంతపురం అర్బన్‌: స్వయం సహాయక సంఘాలకు జీవనాడిగా ఉన్న యానిమేటర్లకు (వీఓఏ) వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని ఎమ్మెల్సీ వెన్నపూసగోపాల్‌రెడ్డి, వైఎస్సార్‌ సీపీ అనంతపురం పార్లమెంట్‌ సమన్వయకర్త తలారి పీడీ రంగయ్య, రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. డిమాండ్ల సాధనకు వీఓఏలు చేస్తున్న పోరాటాలకు వైఎస్సార్‌ సీపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే యానిమేటర్లకు రూ.10 వేలు వేతనం ఇస్తామని ఇప్పటికే వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారన్నారు. అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే అమలు చేసి కుటుంబాల్లో వెలుగులు నింపుతామన్నారు. విలేజ్‌ ఆర్గనైజేషన్‌ అసిస్టెంట్‌ (వీఓఏ) ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్‌ ఎదుట యానిమేటర్లు చేపట్టిన ధర్నాకు వారు హాజరై సంఘీభావం ప్రకటించి మాట్లాడారు.

ఎమ్మెల్సీ గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ, యానిమేటర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అనంతరం సంఘం గౌరవాధ్యక్షులు ఇ.ఎస్‌.వెంకటేశ్‌ మాట్లాడుతూ, దసరా కానుకగా జీఓ 1,243ను విడుదల చేసిన ప్రభుత్వం..ఏడాది కాల పరిమితికే జీఓ ఇవ్వడం మోసం చేయడమేనన్నారు. ఇందులో పదోన్నతులు, ప్రమాదబీమా, సెర్ఫ్‌ నుంచి గుర్తింపుకార్డులు, యూనిఫారం ప్రస్తావన లేదన్నారు. దీన్నిబట్టి చూస్తే యానిమేటర్లకు ఉద్యోగభద్రత కల్పించాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదన్నారు. యానిమేటర్ల న్యాయమైన డిమాండ్లు పరిష్కారమయ్యే వరకూ పోరాటం సాగిస్తామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మీసాల రంగన్న, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బోయ నరేంద్ర (రాజారాం), ట్రేడ్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు మరువపల్లి ఆదినారాయణరెడ్డి, మహిళా విభాగం అనంతపురం పార్లమెంట్‌ అధ్యక్షురాలు బోయ గిరిజమ్మ, వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షుడు చింతా సోమశేఖర్‌రెడ్డి, వీఓఏ ఉద్యోగుల సంఘం జిల్లా కన్వీనర్‌ వాసునాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

ముమ్మాటికీ మోసం చేయడమే
ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లుతున్న యానిమేటర్లకు వేతనం ఇవ్వడంలో ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంభించడం బాధాకరం. యానిమేటర్లకు రూ.3 వేలు ఇచ్చేలా జీఓ ఇచ్చి అమలు చేయకపోవడం మోసమే. అది కూడా ఒక ఏడాదికి మాత్రమే ఇవ్వడం దుర్మార్గం. చంద్రబాబు స్వయం సహాయక సంఘాల్లో రాజకీయం జొప్పించి కలుషితం చేశారు. మహిళ సంఘాలు ఆర్థిక పరిపుష్టి సాధించేందుకు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విశేష కృషి చేశారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే తిరిగి ఆ మహానేత అమలు చేసిన పథకాలన్నీ అమలు చేస్తాం. కచ్చితంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి యానిమేటర్లకు రూ.10 వేలు వేతనం అమలు చేసి భద్రత కల్పిస్తారు.– అనంతపురం పార్లమెంట్‌ సమన్వయకర్త తలారి పీడీ రంగయ్య

యానిమేటర్లకు తీరని అన్యాయం
యానిమేటర్లకు ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తోంది. ప్రాజెక్టుల పేరుతో రూ. వందల కోట్లు కొల్లగొడుతున్న ప్రజాప్రతినిధులు.. యానిమేటర్లకు వేతనం ఇప్పించేందుకు మాత్రం మనసు రావడం లేదు. గౌరవవేతనం రూ.3 వేలు సర్వీసు చార్జీ ఇస్తామంటూ జీఓ ఇచ్చి దానిని అమలు చేయకపోవడం అన్యాయం. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 50 వేల సంఘాలు డీఫాల్ట్‌ అయ్యాయి. ప్రభుత్వం యానిమేటర్లను రాజకీయంగా వాడుకుంటోంది. ప్రజాప్రతినిధులు కూడా తమకు నచ్చిని వారిని తొలగించి...అనుకూలమైన వారిని నియమించుకుంటూ అభద్రతాభావం తీసుకొస్తున్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే యానిమేటర్లకు తప్పక న్యాయం జరుగుతుంది.  –రాప్తాడు నియోజకవర్గం సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top