
తవణంపల్లి : చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం మరేడుపల్లి వద్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లి కొడుకులు మృతి చెందగా అదే కుటుంబానికి చెందిన మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత‍్తం రాయవేలూరు సీఎమ్‌సీ ఆసుపత్రికి తరలించారు. కాణిపాకంకు చెందిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత విద్యాసాగర్ రెడ్డి , ఆయన తల్లి ధనమ్మ, భార‍్య, ఇద‍్దరు కొడుకులు, కోడలుతో కలసి బెంగుళూరుకు బయలుదేరారు. రెండు కిలోమీటర్ల దూరం వెళ్లిన వారి కారు అదుపు తప్పి కల్వర్టును ఢీకొంది. ఈ సంఘటనలో విద్యాసాగర్ రెడ్డి, ఆయన తల్లి ధనమ‍్మ అక్కడికక్కడే మరణించగా, మిగతా నలుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో రాయవేలూరు ఆస‍్పత్రికి తరలించారు. సమాచారం అందుకున‍్న పోలీసులు సంఘటన స‍్థలానికి చేరుకుని కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.