ఆదాయం అల్పం.. చెల్లింపులు ఘనం

YSRCP Government Paying Funds Regularly Despite The Lack Of Funding In Kurnool - Sakshi

సాక్షి, కర్నూలు(అగ్రికల్చర్‌) : జిల్లా నుంచి ప్రభుత్వానికి ఆదాయం అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ  చెల్లింపుల విషయంలో మాత్రం రాజీ పడడం లేదు. ఎవ్వరికీ ఏ సమస్యా లేకుండా చెల్లింపులు చేస్తోంది. ఎన్నికల ముందు అప్పటి టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర ఖజానాను పూర్తిగా ఖాళీ చేసింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి ఖాళీ ఖజానాను అప్పగించింది. అయినప్పటికీ నిధులు లేవనే కారణం చూపకుండా ప్రభుత్వం వివిధ చెల్లింపులు సాఫీగా చేస్తోంది. ఉద్యోగులకు జీతభత్యాలు, మెడికల్‌ రీయింబర్స్‌మెంట్, విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంటు, డైట్‌ చార్జీలు, వాటర్, విద్యుత్‌ తదితర బిల్లులన్నీ సకాలంలో చెల్లిస్తోంది. ఉద్యోగులకు 27 శాతం ఐఆర్‌ కూడా ఇస్తుండడం గమనార్హం. ఇక అభివృద్ధి పనులకు చెల్లింపుల విషయంలోనూ ఎక్కడా జాప్యం జరగడం లేదు. 

జిల్లా ట్రెజరీతో పాటు 14 సబ్‌ ట్రెజరీలు ఉన్నాయి. ప్రభుత్వానికి ఆదాయం జమతో పాటు చెల్లింపులు కూడా వీటి ద్వారానే చేపడుతున్నారు. ప్రభుత్వ ఆదాయాన్ని చలానాల రూపంలో జమ చేస్తున్నారు. ప్రస్తుతం జమలు, చెల్లింపులన్నీ సమగ్ర ఆర్థిక నిర్వహణ విధానం (సీఎఫ్‌ఎంఎస్‌) ద్వారానే జరుగుతున్నాయి. 2019–20 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌తో మొదలైంది. ఏప్రిల్‌ నుంచి ఆగస్టు వరకు లావాదేవీలను పరిశీలిస్తే జిల్లా నుంచి ప్రభుత్వానికి అయిన జమలు రూ.476.29 కోట్లు మాత్రమే. రవాణా, ఎక్సైజ్, స్టాంపులు– రిజిస్ట్రేషన్‌లు, మార్కెట్‌ ఫీజు, మైనింగ్‌ రాయల్టీ తదితర రూపాల్లో ఈ ఆదాయం వచ్చింది. ఈ ఐదు నెలల్లో చెల్లింపులు మాత్రం ఏకంగా రూ.1,962.99 కోట్లు ఉన్నాయి. ప్రభుత్వానికి వచ్చిన ఆదాయాన్ని మినహాయిస్తే రూ.1,486.70 కోట్లు అధికంగా చెల్లించింది. దీన్నిబట్టి చూస్తే నిధుల కొరత ఉన్నప్పటికీ వివిధ అవసరాలకు డబ్బు సర్దుబాటు చేయడంలో ప్రభుత్వం వెనుకంజ వేయడం లేదన్న విషయం స్పష్టమవుతోంది. 

అత్యధిక చెల్లింపులు జిల్లా ట్రెజరీ నుంచే.. 
చెల్లింపులు, జమలు ఎక్కువగా కలెక్టరేట్‌లోని జిల్లా ట్రెజరీ కార్యాలయం ద్వారానే జరుగుతున్నాయి.  జిల్లా నుంచి రూ.476.29 కోట్లు ప్రభుత్వానికి జమ కాగా.. ఇందులో రూ.234.78 కోట్లు ఒక్క జిల్లా ట్రెజరీ ద్వారానే జమ కావడం గమనార్హం. చెల్లింపుల్లోనూ రూ.715.15 కోట్లు ఇక్కడి నుంచే చేపట్టారు. జిల్లా ట్రెజరీ తర్వాత బనగానపల్లె సబ్‌ ట్రెజరీ నుంచి జమలు కొంత మెరుగ్గా ఉన్నాయి. బనగానపల్లె ప్రాంతంలో మైనింగ్‌ ఎక్కువగా ఉంది. దీంతో రాయల్టీలు, జరిమానాలు, ఇతరత్రా రూపాల్లో కాస్త ఎక్కువగా ఆదాయం జమ అవుతోంది. ఇక్కడ జూలైలో జమలు రూ.13.21 కోట్లు ఉండగా.. చెల్లింపులు రూ.11.05 కోట్లు ఉన్నాయి. మిగులు రూ.2.16 కోట్లు ఉంది. జిల్లా ట్రెజరీ, బనగానపల్లె సబ్‌ ట్రెజరీ మినహా మిగిలిన అన్ని సబ్‌ట్రెజరీల్లోనూ జమలు తక్కువగా, చెల్లింపులు మాత్రం భారీగా ఉన్నాయి. 

పక్కదారి పడుతున్న ఆదాయం 
జిల్లాలో వనరులు అపారంగా ఉన్నాయి. ముఖ్యంగా డోన్, ప్యాపిలి, కృష్ణగిరి, వెల్దుర్తి, బేతంచెర్ల, అవుకు, కొలిమిగుండ్ల, దేవనకొండ, బనగానపల్లె తదితర ప్రాంతాల్లో మైనింగ్‌ జరుగుతోంది. అక్రమ మైనింగ్‌ను, అక్రమ రవాణాను అరికట్టడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వాదాయానికి భారీగా గండి పడుతోంది. అధికార యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేస్తే జిల్లా నుంచి ప్రభుత్వానికి ఆదాయం పెరిగే అవకాశముంది. 

ఆర్థిక నిర్వహణ భేష్‌ 
గత ప్రభుత్వం ఖాళీ ఖజానాను అప్పగించినప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం ఆర్థిక నిర్వహణలో మెరుగ్గా వ్యవహరిస్తోంది. ఉద్యోగులు, విద్యార్థులు, రైతులకు సంబంధించిన బిల్లులేవీ ఆపడం లేదు. ప్రభుత్వానికి ఆదాయం అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ చెల్లింపులకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా అప్రమత్తతతో వ్యవహరిస్తోంది.  
– ఫలనాటి సునీల్, రాష్ట్ర ట్రెజరీ ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షుడు 

అన్ని వర్గాల ప్రజలు సంతృప్తితో ఉన్నారు 
ప్రభుత్వ పనితీరుపై ఉద్యోగులే కాదు.. అన్ని వర్గాల ప్రజలు సంతృప్తితో ఉన్నారు. ఎన్నికలకు ముందు టీడీపీ ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసింది. అయినప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం నిధుల సమస్య అనేది కన్పించకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఉద్యోగులకు ఐఆర్‌తో పాటు అన్ని రకాల చెల్లింపులు జరుగుతున్నాయి. ఇది ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లకు ఆనందాన్నిస్తోంది. ఆదాయం తక్కువగా ఉన్నా చెల్లింపులు మాత్రం షెడ్యూలు ప్రకారం జరుగుతుండడం విశేషం. 
– జయశంకర్‌రెడ్డి, జిల్లా కన్వీనర్, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య

ఏ బిల్లునూ ఆపడం లేదు
వివిధ ప్రభుత్వ కార్యాలయాల నుంచి వస్తున్న బిల్లులను వస్తున్నట్టే ఆమోదించి సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారా ఆర్‌బీఐకి పంపుతున్నాం. ఆర్‌బీఐ నుంచి ఎటువంటి జాప్యం లేకుండా వ్యక్తిగత ఖాతాలకు డబ్బు జమ అవుతోంది. జిల్లా నుంచి వెళ్తున్న బిల్లులేవీ పెండింగ్‌ ఉండటం లేదు.    
– వెంకటరమణ, ఉప సంచాలకులు, జిల్లా ట్రెజరీ  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top