ప్రజా దేవాలయమైన అసెంబ్లీలో రౌడీ రాజకీయాలు చేయడం టీడీపీ నాయకులకే చెల్లిందని వైఎస్సాఆర్ సీపీ హైపర్ కమిటీ సభ్యులు తమ్మినేని సీతారాం అన్నారు.
పాత శ్రీకాకుళం: ప్రజా దేవాలయమైన అసెంబ్లీలో రౌడీ రాజకీయాలు చేయడం టీడీపీ నాయకులకే చెల్లిందని వైఎస్సాఆర్ సీపీ హైపర్ కమిటీ సభ్యులు తమ్మినేని సీతారాం అన్నారు. ఆయన మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే తనపై వచ్చిన ఆరోపణలకు సీబీఐ విచారణకు ఆదేశించాలన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో ప్రతిపక్ష పార్టీ చేసిన ఆరోపణలను ధైర్యంగా ఎదుర్కొని విచారణ చేయించారని గుర్తు చేశారు. జగన్‌మోహన్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా కేసుల్లో ఇరికించాలనే ప్రయత్నాన్ని అధికార పార్టీ మానుకోవాలన్నారు.
రెండు లక్షల కోట్లు ఎలా..?
రెండు ఎకరాల ఆస్తితో రాజకీయాల్లోకి వచ్చిన చంద్రబాబు రెండు లక్షల కోట్ల ఆస్తికి ఎలా అధిపతి అయ్యారని తమ్మినేని సూటిగా ప్రశ్నించారు. ఓటుకు నోటు వ్యవహారంలో తన పా త్ర లేదని దేవునిపై ప్రమాణం చేయగలరా అని నిలదీశారు. అసెంబ్లీలో స్పీకర్ కూడా టీడీపీ కార్యకర్తలాగానే వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మూజువాణి ఓటు ప్రవేశపెట్టకుం డానే ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణ శాసనసభ సమావేశాలను పక్కదారి పట్టించడం ఆయనకే చెల్లిందన్నారు. అచ్చెన్నాయుడికి ఇంకా మాట్లాడే పద్ధతి రాదని, ఆయనకు ధైర్యం ఉంటే మళ్లీ ఎన్నికలు జరిపించి కొత్తగా చేరిన ఎమ్మెల్యేలను గెలిపించాలని సవాల్ విసిరారు. సమావేశంలో వైఎస్సాఆర్ సీపీ నాయకులు టి.కామేశ్వరి, కేఎల్ ప్రసాద్, ఎస్.వెంకట్రావు, ఎస్.నారాయణరావు, కోరాడ రమేష్, మండవల్లి రవి తదితరులు పాల్గొన్నారు.