ప్రజలకు అండగా నిలవండి

ysrcp booth level meetings in Kadapa - Sakshi

వేంపల్లె: చిన్న, పెద్దా తేడా లేదు..వీళ్లు వాళ్లు అన్న బేధాలు వద్దు..ఐక్యంగా ప్రజలతో మమేకం కండి..వారి కష్టనష్టాల్లో అండగా నిలవండి..చంద్రబాబు, టీడీపీ నాయకులు ప్రజలను ఏవిధంగా మభ్యపెడుతున్నారో ప్రతి ఇంటా వివరించండి..  ప్రజాకర్షక పథకాలతో టీడీపీ జనాలను ఎలా మోసం చేస్తున్నది తెలియజేయండని కడప మాజీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి  బూత్‌ కమిటీ కన్వీనర్లు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శనివారం వేంపల్లెలోని ఎంఎంఆర్‌ ఫంక్షన్‌ ప్యాలెస్‌లో మండలస్థాయి బూత్‌ కమిటీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.

 ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ బలోపేతానికి బూత్‌ కన్వీనర్లు కీలకపాత్ర పోషించాలని తెలిపారు. అందరూ కలిసికట్టుగా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలను ప్రజలకు తెలియజేయాలని అన్నారు. మండలంలో 2014 నాటి ఎన్నికల కన్నా భారీ మెజార్టీని తీసుకొచ్చే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. గ్రామాల్లో ఏ చిన్న సమస్య వచ్చినా మా దృష్టికి తీసుకరావాలని తెలిపారు. వ్యక్తిగత ద్వేషాలతో పార్టీకి నష్టం కలిగేలా ఏ ఒక్కరు వ్యవహరించ రాదన్నారు. ప్రతి ఒక్కరూ ఇంటింటికి తిరిగి కొత్త ఓటర్లను చేర్పించాలని..దొంగ ఓట్లను గుర్తించి వాటిని తమ దృష్టికి తీసుకురావాలన్నారు.

 పార్టీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు సురేష్‌బాబు మాట్లాడుతూ బూత్‌ లెవెల్‌ కమిటీని ముందుగా బలోపేతం చేసుకుని ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని కోరారు. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన 108, ఉచిత విద్యుత్, ఫీజు రీయింబర్స్‌మెంట్, రుణమాఫీ తదితర అనే అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు గుర్తు చేయాలన్నారు. చంద్రబాబు వంచన తప్ప ఎటువంటి హామీని నెరవేర్చలేదని తెలిపారు. పులివెందులకు కృష్ణా జలాలు తెచ్చిన ఘనత వైఎస్‌ఆర్‌దేనన్నారు. ఆయన హయాంలో 95శాతం ప్రాజెక్టుల పనులు పూర్తి చేశారని.. ఆయన మరణానంతరం ప్రభుత్వాలు పట్టించుకోలేదని తెలిపారు. చంద్రబాబు 5శాతం పనులు పూర్తి చేసి గొప్పలు చెప్పుకోవడం సిగ్గు చేటు అన్నారు.  

చంద్రబాబు మోసాలను వివరించండి
40ఏళ్ల అనుభవం అని చెప్పుకుంటూ ఈ నాలుగేళ్ల వ్యవధిలో చంద్రబాబు చేసిన మోసాలను, ఆయన చేస్తున్న అవినీతి, అక్రమాలను ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు మాజీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి సూచించారు.రైతులకు రుణమాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ  అంటూ అన్ని వర్గాల వారిని ఎలా మోసం చేసింది వివరించాలన్నారు. ప్రత్యేక హోదా అన్నందుకు మనమందరిపైన చంద్రబాబు కేసులు పెట్టించి ప్యాకేజీ చాలని కేంద్ర మంత్రులకు సన్మానం చేసి ఇప్పుడు ప్రత్యేక హోదా అంటూ ఎలా డ్రామాలాడుతోంది వివరించాలన్నారు. ఇక్కడి నాయకులు ఇళ్లు కట్టిస్తాం.. కార్పొరేషన్‌ రుణాలు ఇప్పిస్తామంటూ మభ్యపెట్టి హామిలతో గ్రామాల్లోకి వస్తున్నారని వారిపట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. 

నవరత్నాల గురించి ప్రజలకు తెలపండి..
రాష్ట్రంలో రైతులను ఆదుకున్న మహానుభావుడు వైఎస్‌ రాజశేఖరరెడ్డి అని, ఆయన ఆశయాలను నెరవేర్చేందుకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పోరాడుతున్నారని మాజీమంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి అన్నారు. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు  పాదయాత్ర చేపడుతున్నారని తెలిపారు. భావి తరాలకు దిశ దశ చూపించాలని వైఎస్‌ జగన్‌ ఆరాటపడుతున్నారని పేర్కొన్నారు. నవరత్నాల గురించి ప్రజలకు తెలియజేయాలని చెప్పారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా బూత్‌ కమిటీ మేనేజర్‌ మధుసూదన్‌రెడ్డి, మండల కన్వీనర్‌ చంద్ర ఓబుళరెడ్డి, ఎంపీపీ రవికుమార్‌రెడ్డి, జెడ్పీటీసీ షబ్బీర్‌వల్లి, నియోజకవర్గ బూత్‌ కమిటీ మేనేజర్‌ బెల్లం ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ డాక్టర్‌ ఎస్‌ఎఫ్‌ బాషా, బూత్‌ కమిటీ కన్వీనర్లు, కమిటీ సభ్యులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top