‘అమ్మ ఒడి’తో బడికి దారి

‘అమ్మ ఒడి’తో బడికి దారి - Sakshi


పిల్లల చదువులకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా

 

 పురిటినొప్పులను సైతం భరించి జన్మనిచ్చిన బిడ్డ తండ్రిలా కూలికి వెళ్లాలా లేక తనలా పాచి పనిచేసుకోవాలా... అందుకేనా ఈ బిడ్డను కన్నదనే సందేహం రాకుండా  ప్రతీ తల్లికీ భరోసాగా నిలిచేదే ‘వైఎస్సార్ అమ్మ ఒడి’ పథకం. పూరి గుడిసెల్లో పేద తల్లిదండ్రుల గుండెల్లో బిడ్డల భవిష్యత్తు పట్ల ఆశలను, భయాలను గమనించి, వారికి భరోసానిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపాదించిన ఈ పథకం పట్ల సర్వత్రా ఆసక్తి, హర్షం వ్యక్తమవుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ తొలి ప్లీనరీలో ప్రకటించిన అమ్మ ఒడి పథకాన్ని రెండో ప్లీనరీలోనూ పునరుద్ఘాటించడంతో ఈ పథకం రాష్ట్రమంతా చర్చనీయాంశంగా మారింది.


 


‘‘ఓదార్పుయాత్ర చేసినప్పుడు ప్రజల అవస్థలను, అవసరాలను జగన్ ప్రత్యక్షంగా చూశారు. అప్పుడు ఆయన మదిలో తలెత్తిన ఆలోచనకు అనుగుణంగానే అధికారంలోకి రాగానే ఈ పథకాన్ని ప్రవేశపెట్టాలని భావించారు’’ అని పార్టీ శాసనసభా పక్షం ఉప నాయకురాలు శోభా నాగిరెడ్డి చెప్పారు. ఆర్థికంగా వెనకబడిన విద్యార్థులను ఉన్నత చదువులు చదివేందుకు సహాయపడిన ఫీజు రీయింబర్స్‌మెంటు పథకంలానే ‘అమ్మ ఒడి’ సైతం పేదల జీవితాల్లో విప్లవాత్మక మార్పు తెస్తుందన్నారు. తమ బిడ్డలను ఎలా చదవించుకోవాలని మథనపడే తల్లులకు అమ్మ ఒడి పథకం వరంలాంటిదని పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు కొల్లి నిర్మలాకుమారి చెప్పారు.

 

 

 ఆడబిడ్డ భవితకు భరోసా

 నేను, నా భర్త కృష్ణాజిల్లా మచిలీపట్నం మున్సిపాలిటీలో కాంట్రాక్టు పారిశుధ్య కార్మికులుగా పనిచేస్తున్నాం. రెక్కలు ముక్కలు చేసుకుంటూ మా నలుగురు పిల్లలనూ చదివించుకుంటున్నాం. పిల్లల చదువులకోసం ప్రతీ నెల రూ.500 చొప్పున ఇచ్చే అమ్మఒడి పథకం పెడితే మాలాంటి కుటుంబాలకు చాలా మేలు కలుగుతుంది.  జగన్‌మోహన్‌రెడ్డి పుణ్యమా అని మా పిల్లలకు పెద్ద చదువులు దక్కుతాయంటే ఎంతో ఆనందంగా ఉంది.     

 - దలాయి జ్యోతి

 

 పేదవారికి ప్రోత్సాహం

 వైఎస్సార్ అమ్మ ఒడి పథకం పేద కుటుంబాలకు ప్రోత్సాహంగా ఉంటుంది. పిల్లలు బడిలో చేరినప్పట్నుంచి పీజీ వరకు ప్రతి ఏటా నగదు రూపేణా ప్రోత్సాహం వస్తుంది. ఈ పథకం అమల్లోకి వస్తే పేద కుటుంబాల్లో అందరూ చదువుకునే వీలుంటుంది.     

 - ఉషారెడ్డి, నర్సీపట్నం మున్సిపాలిటీ

 

 

 అమ్మ ఒడి పథకం హర్షణీయం

 ఒక్కరు పనిచేస్తూ నలుగురు కూర్చుని తినాలంటే కుదరదు. ఇంటిల్లిపాది పనిచేస్తే గానీ ఇల్లు గడవదు. అందుకే తల్లిదండ్రులు పిల్లలను పనికి పంపుతున్నారు. పిల్లలను పనికి కాకుండా బడికి పంపిస్తే ఒక్కో పిల్లవాడికి నెలకు రూ.500 ప్రకారం ఇస్తామని జగన్ ప్రకటించడం హర్షణీయం.    

 - శ్రీనివాసులు, ఆటోడ్రైవర్, కర్నూలు

 

 డ్రాపౌట్స్ తగ్గుతాయి

 

 అనంతపురంలాంటి కరువు జిల్లాలో పిల్లలు సైతం కూలి పనులకు వెళ్తే కాని కుటుంబాలు గడవడం కష్టం. పిల్లలను చదివించాలనే తపన ఉన్నా.. ఆర్థిక భారంతో చదివించలేకపోతున్నారు. వారిని చదివిస్తే నెలనెలా అమ్మ బ్యాంకు ఖాతాలో డబ్బు జమ చేస్తే ఇక ఎందుకు చదువుకోరు? లక్షణంగా చదువుకుంటారు. దీనివల్ల ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాపౌట్స్ తగ్గుతాయి.  

     - మహమ్మద్ రఫీ, ఉపాధ్యాయుడు, అనంతపురం

 

 

 ‘‘ఓదార్పు చేస్తూ నేను వెళ్లినన్ని పూరిగుడిసెలకు ఏ రాజకీయ నాయకుడూ వెళ్లి ఉండడు. దాదాపు 700 పైచిలుకు కుటుంబాలను కలిశాను... వారి బాధలు ఆలకించాను. పేదరికం అంటే ఏమిటన్నది ఈ రాజకీయ నాయకుల్లో ఏ ఒక్కరికీ అర్థం కావడంలేదని అర్థంచేసుకున్నాను. ఆ గుడిసెల్లో అవ్వా, తాతలతో... అక్కాచెల్లెళ్లతో మాట్లాడుతున్నపుడు చిన్నచిన్న పిల్లలు కనిపించేవారు. ఏం చేస్తున్నారని వారిని అడిగితే... 4 లేదా 5 తరగతి పిల్లాడైతే స్కూలుకు వెళ్తున్నామని చెప్పేవారు. 7వ తరగతి వారేమో పనికిపోతున్నానని చెప్పేవారు. చదువుకోకుంటే జీవితాలు ఎలా మారుతాయి? కుటుంబంలో ఒక్కరైనా డాక్టర్ లేదా ఇంజినీర్ లేదా కలెక్టర్ వంటి పెద్ద పెద్ద చదువులు చదవాలి కదా... అప్పుడే కదా వారు భవిష్యత్తులో మిమ్మల్ని కంటికిరెప్పలా చూసుకుంటారని ఆ తల్లులతో అన్నపుడు... ‘నాయనా... కూలికి వెళ్తే 100లేదా 150 రూపాయలో వస్తాయి. ఆ డబ్బుతో మాకు రెండురోజులు తిండికి వస్తుంది. మూడో రోజు తిండికి ఎక్కడికి  వెళ్లాలి? ఏ పనికి వెళ్లాలి అని ఆలోచిస్తాం. ఏడో తరగతి వయసు పిల్లల్ని కూడా పనిలో పెట్టకపోతే మా పరిస్థితి ఎలా?’ అని ఆవేదనతో చెప్పారు. ఆ మాటలు తలుచుకుంటే ఇవాళ్టికీ గుండె తల్లడిల్లుతుంది. ఏ తల్లి కూడా తమ పిల్లలను చదివించేందుకు భయపడని రోజులు రావాలి. ఏ తల్లి కూడా పొద్దున లేస్తే ఎలా బ్రతకాలని ఆలోచించే రోజు పోవాలి. ప్రతి తల్లీ చేయాల్సింది... మీ పిల్లలను బడికి పంపించండి. ప్రతి పిల్లాడికి రూ.500 చొప్పున ఇద్దరు పిల్లలకు రూ.1000 ప్రతి నెలా బ్యాంకు అకౌంట్ వేస్తాను అని హామీ ఇస్తున్నా.’’

 

     - వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి

 

 పథకంలోని ముఖ్యాంశాలు...

 

 విద్యార్థులను కేజీ నుంచి పీజీ వరకు చదువుకునేందుకు ప్రభుత్వమే సహాయపడుతుంది.

 ఒకటి నుంచి పదో తరగతి వరకు ఒక్కో బిడ్డకు నెలకు రూ.500 చొప్పున ఆ బిడ్డ తల్లి పేరుతో బ్యాంకులో డబ్బు జమవుతుంది. ఇద్దరు పిల్లలుంటే నెలకు వెయ్యి రూపాయలు జమచేస్తారు.

 పదవ తరగతి పూర్తయిన తర్వాత ఇంటర్, తత్సమాన విద్యార్థికి నెలకు రూ.700 చొప్పున, డిగ్రీ తత్సమాన, ఆపై అర్హత గల విద్యార్థికి నెలకు రూ.1000 చొప్పున ప్రతి నెలా తల్లి ఖాతాలో డబ్బు జమవుతుంది.

 ఇలా చేయడంవల్ల బడి మానుతున్న విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుంది.

 విద్యార్థుల చదువుల కోసం ఆ కుటుంబంపై భారం ఉండకపోగా, ఆర్థికంగా ఆ కుటుంబం కూడా నిలదొక్కుకుంటుంది.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top