దుర్మార్గ పాలనకు చరమగీతం


నంద్యాల ఓటు నాంది కావాలి... వైఎస్‌ జగన్‌ పిలుపు



 

సాక్షి ప్రతినిధి, కర్నూలు: వాగ్దానాలన్నీ విస్మరించి ప్రజలను దారుణంగా మోసం చేసిన చంద్రబాబు దుర్మార్గపాలనకు చరమగీతం పాడదామని, అందుకు నంద్యాలలో వేసే ఓటే నాంది కావాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. మూడున్నరేళ్లలో ఏ సామాజికవర్గానికీ ఏమీ చేయలేదని, అందుకే నంద్యాల ఉప ఎన్నికల్లో వందల కోట్ల సొమ్ము ఖర్చు పెట్టేందుకు సిద్ధపడుతున్నారని విమర్శించారు. నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మూడో రోజైన శుక్రవారం రోడ్‌ షో క్రాంతినగర్‌ నుంచి ప్రారంభమై చాపిరేవుల, పాండురంగాపురం మీదుగా పోలూరు వరకూ సాగింది. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ వాగ్దానాన్నీ అమలు చేయలేదు కాబట్టే... చంద్రబాబు, ఆయన కొడుకుతో పాటు మొత్తం కేబినెట్‌ అంతా నంద్యాల రోడ్లపై తిరిగే పరిస్థితి వచ్చిందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను అటకెక్కించి ప్రజలను మోసం చేసే చంద్రబాబు లాంటి వ్యక్తులకు ఉరిశిక్ష విధించినా తక్కువే అని గట్టిగా చెబుతున్నానన్నారు.



చంద్రబాబు ఏమి అనుకున్నా.... మీరు తప్పుచేశారు బాబూ అని చెబుతూనే ఉంటానని తేల్చిచెప్పారు. నంద్యాల ఎన్నికల్లో వేసే ప్రతీ ఓటును గుర్తుపెట్టుకుంటానని... నంద్యాలను పులివెందులంత గొప్పగా అభివృద్ధి చేస్తానన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీ కెనాల్‌ ఆయకట్టుకు రెండు పంటలకు నీరిచ్చేందుకు గుండ్రేవుల ప్రాజెక్టును నిర్మిస్తామని స్పష్టం చేశారు. అంతేకాకుండా సిద్దేశ్వరం అలుగు ప్రాజెక్టుపై కూడా సాధ్యాసాధ్యాల అధ్యయనం జరిపిస్తామని పేర్కొన్నారు. సాధ్యమని తేలితే సిద్ధేశ్వరం అలుగును కూడా నిర్మిస్తామని తేల్చిచెప్పారు. ఆర్యవైశ్యులు వైఎస్సార్సీపీకి మద్దతిస్తున్నారని... రాత్రి ఒంటి గంట దాటిన తర్వాత వారి ఇళ్లపై దాడులు చేసి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు.



14 రీళ్ల సినిమాలో 13 రీళ్ల వరకూ విలన్‌దే పైచేయి ఉంటుందని, చివరి రీల్‌ వచ్చేసరికి దేవుడు ఆశీర్వదిస్తాడు... విలన్‌ను హీరో ఫుట్‌బాల్‌ ఆడుకుంటాడని, చివరకు న్యాయమే గెలుస్తుందని పేర్కొన్నారు. ఏ సినిమా చూసినా ఇదేనని... భగవద్గీత, రామాయణం, ఖురాన్, బైబిల్‌ ఏది చదివినా ఉన్నది ఇదేనని పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి స్వర్ణయుగం....జగన్‌ హయాంలో మళ్లీ వస్తుందన్న నమ్మకం ప్రజల్లో ఉందన్నారు. నంద్యాలలో శిల్పా మోహన్‌రెడ్డిని గెలిపించుకుని అందుకు నాంది పలకాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 

 

పులివెందులంత గొప్పగా అభివృద్ధి..

‘మోసం చేసేవారిని ప్రజలు వదిలిపెట్టరు...కాలర్‌ పట్టుకుంటారనే పరిస్థితి రావాలి. చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలో న్యాయం, ధర్మం రావాలి. నంద్యాలలో మీరు వేసే ఈ ఓటుతో రాష్ట్ర రాజకీయ వ్యవస్థ మారుతుంది.  నవరత్నాలు తెచ్చుకునే మనందరి పరిపాలనకు నాంది, బీజం నంద్యాల నుంచే పడుతుంది. నంద్యాలలో ఏ ఒక్కరికీ నష్టం జరగదని హామీనిస్తున్నా. మీరు వేసే ఈ ఓటు మర్చిపోను. పులివెందుల తర్వాత అంత గొప్పగా నంద్యాలను అభివృద్ధి చేస్తానని మాట ఇస్తున్నా’  అని జగన్‌ అన్నారు.
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top