
ఇజ్రాయెల్‌లోని హడేరాలో డీశాలినేషన్ ప్లాంట్‌ను పరిశీలించేందుకు వెళ్తున్న సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ఇజ్రాయెల్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం హడేరాలోని హెచ్‌టూఐడీ డీశాలినేషన్ (ఉప్పు నీటి నుంచి ఉప్పును తొలగించే ప్రక్రియ) ప్లాంటును సందర్శించారు. ఆయన వెంట టెల్ అవీవ్‌లోని భారతీయ మిషన్ ఉప అధిపతి షెరింగ్ ఉన్నారు. హడేరా చేరుకున్న ముఖ్యమంత్రికి సముద్రపు నీటి నుంచి ఉప్పును తొలగించి మంచినీరుగా తయారు చేసే ప్రక్రియపై ప్లాంటు అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. మంచినీటి తయారీ ప్రక్రియను, ప్లాంటు నెలకొల్పడానికి అయ్యే ఖర్చు, ఇతర వ్యయం వంటి అంశాలను విపులంగా వివరించారు. ఆ తర్వాత సీఎం ప్లాంటు అంతా కలియతిరిగి పరిశీలించారు. మంచినీటి తయారీ ప్రక్రియలో విభిన్న దశలను చూశాక అధికారులను అభినందించారు. అక్కడ తయారైన మంచినీటిని రుచి చూసి చాలా నాణ్యతతో ఉన్నాయంటూ ప్రశంసించారు. హడేరా ప్లాంటులోని సీనియర్ ఎగ్జిక్యూటివ్ రఫీ షామీర్ ఈ ప్లాంటు సందర్శనను ఏర్పాటు చేశారు.
నేడు తాడేపల్లికి ముఖ్యమంత్రి
సీఎం జగన్‌మోహన్‌రెడ్డి విదేశీ పర్యటనను ముగించుకుని సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో తాడేపల్లికి చేరుకోనున్నారు. ఆయన ఈ నెల 1వ తేదీ రాత్రి కుటుంబసభ్యులతో కలసి ఇజ్రాయెల్‌కు వెళ్లిన విషయం విదితమే. కాగా పర్యటన ముగించుకుని ముఖ్యమంత్రి ముంబయి మీదుగా గన్నవరం విమానాశ్రయానికి 10 గంటల ప్రాంతంలో చేరుకుంటారని అధికార వర్గాలు వెల్లడించాయి.