వైఎస్సార్‌ రైతు భరోసా అర్హులకే అందాలి

YS Jagan Says YSR Raithu Barosa for all the True Farmers - Sakshi

వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులతో సీఎం

లబ్ధిదారుల గుర్తింపునకు 18 నుంచి 25 వరకు సర్వే  

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్‌ 15వ తేదీ నుంచి అమలు చేయనున్న ‘వైఎస్సార్‌ రైతు భరోసా’ పథకాన్ని నిజమైన రైతులందరికీ అందేలా చూడాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలోని వెబ్‌లాండ్‌ జాబితాను గ్రామ పంచాయితీల వారీగా పరిశీలించి అందులో ఉన్న వారు నిజమైన రైతులో కాదో గుర్తించి ఈ పథకం కింద పెట్టుబడి సాయాన్ని అందించాలన్నారు.  

ఈ పథకం అమలుకు అధికారులు తీసుకుంటున్న చర్యలపై బుధవారం ఆయన వ్యవసాయ మంత్రి కన్నబాబు, జిల్లా కలెక్టర్లు, వ్యవసాయ, అనుబంధ రంగాల ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. గతంలో మాదిరిగా వ్యవసాయం చేయని వారికి, విదేశాల్లో ఉంటూ సాగు చేయని భూ యజమానులకు, వ్యవసాయ భూములను రియల్‌ ఎస్టేట్, చేపల చెరువులుగా మార్పిడి చేసిన వారికి రైతు భరోసా కింద లబ్ధి కలగకూడదన్నారు.  

సర్వే తర్వాతే గ్రామ సచివాలయాలలో జాబితా : వైఎస్సార్‌ రైతు భరోసాపై పక్కా ప్రణాళిక రూపకల్పన కోసం సీఎంతో సమీక్ష అనంతరం అధికారులు చర్చలు జరిపారు. తండ్రి చనిపోయాక వ్యవసాయం చేస్తున్న పిల్లల పేర్లు, కొత్తగా భూమి కొనుగోలు చేసిన వారి పేర్లు, ఈనాం సాగుదార్లను రికార్డుల్లోకి ఎక్కించాలని నిర్ణయించారు. రైతు భరోసా పథకానికి అర్హులు ఎవరో తేల్చేలా ఈనెల 18 నుంచి 25 వరకు సర్వే చేయించాలని నిర్ణయించారు. అనంతరం అర్హుల జాబితాను గ్రామ సచివాలయాలలో ప్రదర్శిస్తారు. కాగా, పీఎం కిసాన్‌ డేటా, అన్నదాత సుఖీభవలో చాలా లోపాలు జరిగాయని, వాటిని సవరించి అర్హులను గుర్తించనున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు చెప్పారు. రైతుల సందేహాల నివృత్తికి హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేస్తామన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top