జగన్‌ నోట... సీపీఎస్‌ రద్దు మాట...

YS Jagan Says Contributory Pension System Would Be Removed - Sakshi

 హామీపై ఉద్యోగ, ఉపాధ్యాయుల హర్షం    

 జిల్లాలో 16 వేల మంది సీపీఎస్‌ ఉద్యోగులు

రాయవరం (మండపేట): ప్రభుత్వ ఉద్యోగం అంటే భద్రత, భరోసా. దానికి కారణం ఉద్యోగ విరమణ అనంతరం కూడా పెన్షన్‌ రావడమే. అయితే 2004 సెప్టెంబర్‌ నుంచి అమలవుతున్న కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ పథకం (సీపీఎస్‌) ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల పాలిట అశనిపాతంగా మారింది. సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు పోరాటం చేస్తున్నారు. సీపీఎస్‌ విధానంతో కష్టనష్టాలను చవిచూస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయులు ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ పోరాటబాట పడుతున్నారు. జిల్లాలో 16 వేల మంది సీపీఎస్‌ ఉద్యోగులున్నారు. సీపీఎస్‌పై రాష్ట్రాల పరిధిలోనే నిర్ణయం తీసుకోవాలని కేంద్రం చెప్పగా, ఇటీవల ముఖ్యమంత్రి ఇది తన పరిధిలో లేదని, కేంద్రమే నిర్ణయం తీసుకోవాలని చెప్పడంతో నిరాశకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభం సందర్భంగా కడప జిల్లా ఇడుపులపాయలో ప్రతిపక్ష నేత సీపీఎస్, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణపై చేసిన ప్రకటన ఆయా వర్గాల్లో ఆశలు రేకెత్తించింది. ఈ సందర్భంగా పలు ఉపాధ్యాయ సంఘాలు, ఉద్యోగ సంఘం నేతల అభిప్రాయాలు వారి మాటల్లోనే...

ఇది మంచి నిర్ణయం..
సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేసి, పాత పింఛన్‌ విధానాన్ని అమలు చేస్తానని ప్రతిపక్ష నేత వైఎస్‌.జగన్‌ మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ మంచి నిర్ణయం.
– చింతాడ ప్రదీప్‌ కుమార్,
ప్రధాన కార్యదర్శి, పీఆర్‌టీయూ

ఆహ్వానించదగ్గ పరిణామం..
పాత పింఛన్‌ విధానాన్ని అమలు చేస్తానని జగన్‌ ఇచ్చిన హా మీ ఆహ్వానించదగ్గ పరిణామం. సీపీఎస్‌ విధానంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
– కవి శేఖర్, ప్రధాన కార్యదర్శి, ఎస్‌టీయూ

ఉద్యోగుల శాపాన్ని తొలగించినట్లవుతుంది..
ప్రతిపక్షనేత జగన్‌ మోహన్‌ రెడ్డి సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేస్తానని ఇచ్చిన హామీ ఉద్యోగుల పాలిట శాపాన్ని తొలగించినట్లవుతుంది. లక్షలాది మంది ఉద్యోగులు పదవీ విరమణ తర్వాత బతుకుతామనే ఆశను కల్పించినటై్టంది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు హర్షం వెలిబుచ్చుతున్నారు.
– డీవీ రాఘవులు, జిల్లా అధ్యక్షుడు, యూటీఎఫ్‌

పోరాటాలు ఫలించినట్లవుతుంది..
సీపీఎస్‌ విధానం రద్దుకు చర్యలు తీసుకుంటామని ప్రతిపక్ష నేత వైఎస్‌.జగన్‌ మోహన్‌రెడ్డి చెప్పడం ఉద్యోగులు, ఉపాధ్యాయుల పోరాటాన్ని గుర్తించినట్లయింది.
– పితాని త్రినాథరావు, జిల్లా చైర్మన్, అమరావతి జేఏసీ, కాకినాడ

జగన్‌ మోహన్‌రెడ్డి ప్రకటన హర్షణీయం..
రాష్ట్రాల పరిధిలో సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేసుకోవచ్చునని కేంద్రం ప్రభుత్వం చెబుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన చేతుల్లో లేదని చెప్పడం ఆశ్ఛర్యంగా ఉంది. ప్రతిపక్ష నేత జగన్‌ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేస్తాననడం హర్షణీయం.
– చింతా నారాయణ మూర్తి, జిల్లా ప్రధాన కార్యదర్శి,
ఏపీసీపీఎస్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top