సీఎం పర్యటనకు సర్వం సిద్ధం

YS Jagan Mohan Reddy Tour on Chittor This Month Ninth - Sakshi

ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగాచిత్తూరుకు వస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

భారీగా స్వాగత ఏర్పాట్లు హెలిప్యాడ్‌ నుంచి మానవహారం

9న అమ్మఒడి ప్రారంభం

రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితొలిసారిగా ఈనెల 9వ తేదీ జిల్లా కేంద్రానికి వస్తున్నారు. అది కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నవరత్నాల్లో ఒకటైన అమ్మఒడి పథకాన్ని ప్రారంభించడానికి చిత్తూరును ఎంచుకున్నారు.  ఈ కార్యక్రమానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. రెవెన్యూ, పోలీసు, పురపాలక శాఖలు సంయుక్తంగా కలిసి సీఎం పర్యటనకు సంబంధించి పనులు పూర్తి చేస్తున్నాయి.

చిత్తూరు అర్బన్‌: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చిత్తూరు నగరానికి వస్తున్న నేపథ్యంలో ఓవైపు అధికారులు పర్యటన ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు సీఎంకు స్వాగతం పలకడానికి ఏర్పాట్లపై నిమగ్నమయ్యారు. ఇప్పటికే నగరంలోని అన్ని ప్రాంతాలను ఫ్లెక్సీలు, కటౌట్లతో నింపేశారు. తమిళనాడులో ఫ్లెక్సీలు, స్వాగత ఆర్చిలను తయారుచేసే వారిని చిత్తూరుకు పిలిపించి పలుచోట్ల పెద్ద ఎత్తున పనులు చేయిస్తున్నారు. సీఎం పర్యటన కావడంతో అటు కూలీలకు.. నగరంలోని ఫ్లెక్సీ ప్రింటర్లకు పెద్ద ఎత్తున పనులు దొరుకుతున్నాయి. చిత్తూరుతో పాటు తమిళనాడు నుంచి కూడా ఫ్లెక్సీలను ప్రింట్‌ తీసుకువచ్చి పెడుతున్నారు. 

పర్యటన ఇలా..
ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి ప్రస్తుతం అధికారులకు ప్రాథమికసమాచారం అందింది. దీని ప్రకారం తొలుత ముఖ్యమంత్రి ప్రత్యేక విమానం ద్వారా తిరుపతి ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌ ద్వారా చిత్తూరు నగరంలోని డీఎస్‌ఏ (మెసానికల్‌) మైదానంలో దిగుతారు. అక్కడి నుంచి ఓపెన్‌టాప్‌ జీపు నుంచి ప్రజలకు అభివాదం చేస్తూ కలెక్టర్‌ బంగ్లా, ఓవర్‌ బ్రిడ్జి, గాంధీ విగ్రహం, ఎంఎస్‌ఆర్‌ కూడలి, వేలూరు రోడ్డు, గిరింపేట మీదుగా పీవీకేఎన్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ద్వారా మైదానంలోకి చేరుకుంటారు. అక్కడ అమ్మఒడికి అంకురార్పణ చేసి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
అనంతరం కాన్వాయ్‌ ద్వారా మెసానికల్‌ మైదానంలోని హెలిప్యాడ్‌కు చేరుకుని తిరుగుప్రయాణం అవుతారు. ఇందులో ఏవైనా చిన్నపాటి మార్పులు ఉండొచ్చు.. లేకుంటే యథావిధిగా షెడ్యుల్‌ ప్రకారం సీఎం పర్యటన సాగుతుంది. 

పోలీసుల భద్రత..
ముఖ్యమంత్రి పర్యటనకు పెద్ద ఎత్తున పోలీసు బలగాలు పహారాకాస్తున్నారు. చిత్తూరు ఎస్పీ సెంథిల్‌కుమార్‌ ఆధ్వర్యంలో సివిల్, ఏఆర్, ఎస్టీఎఫ్, బాంబ్‌స్వా్కడ్‌ బృందాలు సీఎం పర్యటన సాగే ప్రాంతాలను జెల్లెడ పడుతున్నాయి. మరోవైపు సీఎంవో కార్యాలయ సెక్యూరిటీ కూడా భద్రత ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top