చేతులెత్తి నమస్కరిస్తున్నా.. అర్థం చేసుకోండి

YS Jagan Mohan Reddy Request Public To Stay At Home - Sakshi

ప్రజలకు సీఎం వైఎస్‌ జగన్‌ విజ్ఞప్తి

అందరం ఇళ్లకు పరిమితం కాకుంటే కరోనాను అదుపు చేయలేం

నిర్లక్ష్యం చేసిన దేశాల్లో ఏమైందో చూశాం

మన వాళ్లను ఆపాల్సి రావడం కలచి వేస్తోంది.. కానీ తప్పదు

మన వాళ్లను బాగా చూసుకుంటామని తెలంగాణ సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు

నిత్యావసరాలను నిల్వ చేసుకోవద్దు.. కొరత రాకుండా చర్యలు తీసుకున్నాం

ఎవరికి ఏ కష్టం వచ్చినా 24 గంటలూ అందుబాటులో ఉంటాం

సాక్షి, అమరావతి: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని అదుపు చేయాలంటే మూడు వారాల పాటు ఎక్కడి వారక్కడే ఉండి పోవాలని, ప్రస్తుత పరిస్థితుల్లో అంతకంటే మరో మార్గం లేదని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. విపత్కర పరిస్థితుల్లో కొన్ని గట్టి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తోందని, లేదంటే అనర్థం జరుగుతుందన్నారు. మనందరం ఇళ్లకే పరిమితం కాకపోతే ఈ వైరస్‌ను అదుపు చేయలేమని  అన్నారు. దేశంలో కరోనా వైరస్‌ ప్రబలకుండా ఏప్రిల్‌ 14వ తేదీ వరకు లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో గురువారం సాయంత్రం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్ర ప్రజలందరూ ప్రభుత్వం విధించిన ఆంక్షలకు అనుగుణంగా స్వీయ నియంత్రణ పాటించి సహకరించాలని కోరారు. పరిస్థితులను అర్థం చేసుకోవాలని చేతులు జోడించి నమస్కరిస్తూ విజ్ఞప్తి చేశారు. సీఎం వైఎస్‌ జగన్‌ ఇంకా ఏం చెప్పారంటే..

మన వాళ్లను చిరునవ్వుతో ఆహ్వానించే పరిస్థితి లేదు
►వందేళ్లకు ఒకసారి వచ్చే ఇలాంటి వ్యాధులను మన జీవిత కాలంలో ఇప్పుడు చూడాల్సి వస్తోంది. దీనిని మనం క్రమశిక్షణతోనే నివారించగలం. నిర్లక్ష్యం చేస్తే కొన్ని దేశాల్లో ఏం జరిగిందో చూశాం. అందుకే కొన్ని గట్టి నిర్ణయాలు తీసుకోకపోతే అనర్థం జరుగుతుందనే భయం ఉంది. కాబట్టి అందరూ సహకరించాలి. 
►నిన్న (బుధవారం) రాత్రి జరిగిన కొన్ని ఘటనలు మనసును కలిచి వేశాయి. మన వాళ్లను కూడా మనం చిరునవ్వుతో ఆహ్వానించే పరిస్థితి లేక పోవడం బాధ కలిగించింది. కానీ అందరం ఒక్కసారి ఆలోచించాలి. ఇవాళ మనందరం ఇళ్లకు పరిమితం కాకపోతే వ్యాధిని అదుపు చేయలేం. ఇవాళ కూడా పొందుగుల, దాచేపల్లి, సాగర్‌ సరిహద్దుల్లో మన వాళ్లను మనం రానీయలేని పరిస్థితి ఉంది. 
►ఒకసారి ప్రదేశం మారుతున్న వారు ఎందరితోనో కాంటాక్ట్‌లో ఉండి ఉంటారు. వారు ఇంకా ఎంత మందితో కాంటాక్ట్‌లోకి వెళ్తారో తెలియదు. అది కనుక్కోవడం చాలా కష్టం. 

ఏప్రిల్‌ 14 వరకు ఇళ్లల్లోనే ఉండక తప్పదు
►ఏప్రిల్‌ 14 వరకు మనం ఎక్కడికీ వెళ్లకుండా ఇళ్లలోనే ఉంటే, కాంటాక్ట్‌ ట్రేసింగ్‌ తేలిగ్గా తెలిసి పోతుంది. వ్యాధి సోకిన వారిని గుర్తించి వెంటనే ఆసుపత్రికి తరలించవచ్చు. ఈ మూడు వారాల పాటు అందరూ ఎక్కడి వారు అక్కడే ఆగిపోవాలి. మన వాళ్లను మనమే ఆపాల్సి రావడం బాధ కలిగిస్తోంది. 
►నిన్న (బుధవారం) మార్కాపురం, అద్దంకి వద్ద 44 మందిని, కందుకూరు వద్ద 152 మందిని అనుమతించాం. మానవతా దృక్పథంతో అనుమతించినా, వారు వేరే రాష్ట్రం నుంచి వచ్చారు కనుక వారందరినీ 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచక తప్పదు.  
►విదేశాల నుంచి తిరిగి వచ్చిన వారు మొత్తం 27,819 మంది ఉండగా, వారందరిపై నిఘా వేసి ట్రాకింగ్‌లో పెట్టాం. వారు ఎందరితో కాంటాక్ట్‌లో ఉన్నారో పరిశీలిస్తున్నాం. ఇదే సమయంలో మనందరం స్వయం క్రమశిక్షణ, సామాజిక దూరం పాటించకపోతే ఇబ్బంది పడతాం.

నాలుగు క్రిటికల్‌ కేర్‌ ఆసుపత్రులు
► విశాఖ, నెల్లూరు, విజయవాడ, తిరుపతి.. నాలుగు చోట్ల క్రిటికల్‌ కేర్‌ ఆస్పత్రులు ఏర్పాటు చేశాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 470 ఐసీయూ పడకలతో వెంటిలేటర్లు, అదనపు పడకలు అందుబాటులో ఉన్నాయి.
►ప్రతి జిల్లాలో 200 పడకలతో క్వారంటైన్‌ కేంద్రాలను ఏర్పాటు చేశాం. ప్రతి నియోజకవర్గంలో 100 పడకలతో క్వారంటైన్‌ కేంద్రాలు ఏర్పాటు చేశాం. ప్రైవేటు సెక్టార్‌లో కూడా 213 ఐసీయూ పడకలతో వెంటిలేటర్లు సిద్ధంగా ఉన్నాయి.  
►పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించడానికి సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి కృష్ణబాబుతో పాటు, మరో 10 మంది ఉన్నతాధికారులను ఏర్పాటు చేశాం. ఇంకా ఆరోగ్యపరమైన సమస్యలకు 104 నంబర్‌ కూడా అందుబాటులో ఉంది.

కంట్రోల్‌ రూమ్‌లు అండగా ఉన్నాయి..
►రాష్ట్ర స్థాయిలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశాం. ఇందులో పది మంది సీనియర్‌ అధికారులతో పాటు ముగ్గురు మంత్రులు, సీఎం ఆఫీసు నుంచి మరో ముగ్గురు అధికారులు ఉంటారు. ప్రతి జిల్లాలోనూ కంట్రోల్‌ రూమ్‌లు ఉంటాయి. జిల్లా మంత్రులు జిల్లా కంట్రోల్‌ రూమ్‌లలో భాగస్వాములవుతారు. అక్కడ కూడా వివిధ శాఖలకు చెందిన 10 మంది అధికారులు ఉంటారు. ఎవరికి అసౌకర్యం కలగకుండా చూస్తారు. 
►ఎవరికీ ఆహారం, వసతి ఇతర సౌకర్యాల లోటు లేకుండా చూడాలని కలెక్టర్లకు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం. ఏ ఇబ్బంది ఉన్నా 1902 కు ఫోన్‌ చేయండి. వెంటనే కలెక్టర్‌ స్పందించి మీ సమస్యలు పరిష్కరిస్తారు.
►సరుకుల రవాణా వాహనాలకు అనుమతి ఇచ్చాం. నిత్యావసరాలు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయి. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. నిల్వ చేసుకోవాల్సిన అవసరం లేదు.
►రైతు బజార్లను విస్తరిస్తున్నాం. ప్రజల సంఖ్య, వారి అవసరాలు గుర్తించి కేవలం 2 నుంచి 3 కి.మీ పరిధిలో రైతు బజార్లతో పాటు, నిత్యావసరాలు అందుబాటులో ఉంటాయి. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అన్నీ తెరిచి ఉంటాయి. కాబట్టి అవసరమైనవి తీసుకుని, ఆ తర్వాత ఇళ్లలోనే ఉండండి.

రైతులు సామాజిక దూరం పాటించాలి
►పంటలు కోతకు వస్తున్నాయి కాబట్టి తప్పదు కనుక రైతులు, రైతు కూలీలు పనులకు వెళ్లండి. కానీ అక్కడ తప్పనిసరిగా సామాజిక దూరం పాటించాలి. 
►గ్రామాల్లో పారిశుధ్య పనులు చేపట్టాలని పంచాయతీ రాజ్, పురపాలక శాఖలకు స్పష్టంగా ఆదేశాలు జారీ చేశాం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top