వైఎస్‌ఆర్‌ సీపీ బీసీ ముఖ్యనేతల భేటీ

 YS Jagan Mohan Reddy Mees with BC Community Leaders in Vijayawada - Sakshi

జనగర్జనలో బీసీ డిక్లరేషన్‌ : వైఎస్‌ జగన్‌

సాక్షి, విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీసీలను ఓటు బ్యాంక్‌గానే చూస్తున్నారని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ  అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని కూడా సీఎం అమలు చేయలేదన్నారు.  వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధ్యక్షతన బందర్‌రోడ్‌ లోని వైఎస్‌ఆర్‌ సీపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం  బీసీ ముఖ్యనేతల సమావేశం జరిగింది.

 ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ...‘రూ.10 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్‌ అని చెప్పి... చంద్రబాబు మాట తప్పారు. కనీసం బీసీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కూడా చేయలేదు. రాష్ట్రవ్యాప్తంగా బీసీ సంఘాల నేతలు పర్యటించాలి. చంద్రబాబు మోసాలను ఎండగట్టాలి. బీసీల పట్ల ప్రభుత్వం చూపుతున్న వివక్షను ప్రతి ఒక్కరికీ వివరించాలి. బడుగు, బలహీన వర్గాల ప్రజలందరినీ ఒక్క తాటిపైకి తీసుకురావాలి. నేను పాదయాత్ర చేస్తున్న ఆరు నెలల్లో బీసీ నేతలు గ్రామాలకు వెళ్లి అన్యాయాలను ప్రజలకు వివరించాలి. పాదయాత్ర తర్వాత బీసీ జనగర్జన ఏర్పాటు చేసి బీసీ డిక్లరేషన్‌ ప్రకటిద్దాం. ప్రతి కులానికి న్యాయం జరిగేలా బీసీ డిక్లరేషన్‌ ఉంటుంది. ప్రతి పేదవాడికి వైఎస్‌ఆర్‌ పాలనను గుర్తు చేయాలి. అన్న వస్తున్నాడు.. రాజన్న రాజ్యం వస్తుందని చెప్పండి.’ అని సూచించారు.

విజయవాడలో పార్టీ రాష్ట్ర కార్యాలయం ఏర్పాటయ్యాక తొలిసారిగా విస్తృతస్థాయిలో జరుగుతున్న ఈ సమావేశానికి 13 జిల్లాల నుంచి పార్టీకి చెందిన బీసీ ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రస్తుతం రాష్ట్రంలోని బీసీల స్థితిగతులు, వారి సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందో అనే దానిపై  వైఎస్‌ జగన్‌ నేతలందరి అభిప్రాయాలు, సూచనలను తీసుకుంటున్నారు.

ఆయా జిల్లాల్లో స్థానికంగా నెలకొన్న ప్రత్యేక పరిస్థితులు, బీసీల విషయంలో పాలకవర్గం వ్యవహరిస్తున్న తీరు, ఇలా అనేక అంశాలపై కూలంకుషంగా చర్చిస్తున్నట్లు సమాచారం. సమావేశంలో నేతలు వ్యక్తపరిచే అభిప్రాయాలు, క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులు, వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక తీసుకోవాల్సిన చర్యలు వంటి వాటిని క్రోడీకరిస్తారు. ఆ తర్వాత ఉన్నత స్థాయిలో మరిన్ని దఫాలు సంప్రదింపులు జరిపి.. సమగ్రంగా రూపకల్పన చేశాక తగిన సమయంలో పార్టీ తరఫున ‘బీసీ డిక్లరేషన్‌’ను చేస్తారు.
 

(ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

బీసీ డిక్లరేషన్‌‌పై వైఎస్ జగన్ ఏమన్నారో చూడండి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top