మూడేళ్లలో నిర్మాణం పూర్తి చేస్తాం : సీఎం జగన్‌

YS Jagan Laid Foundation Stone For Steel Plant In YSR District - Sakshi

సాక్షి, వైఎస్సార్‌ : జిల్లాలో ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన చేయడం తన జీవితంలో మరచిపోలేని రోజని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఈ ఉక్కు కర్మాగారాన్ని మూడేళ్లలో పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. సోమవారం జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లెలో కడప ఉక్కు కర్మాగారానికి సీఎం వైఎస్‌ జగన్‌ శంకుస్థాపన చేశారు. అనంతరం బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్‌ మాట్లాడుతూ.. ‘జిల్లాకు స్టీల్‌ ప్లాంటు రావాలని.. అభివృద్ధి బాటలో పరుగులు పెట్టాలని చాలా ఏళ్లుగా అనుకున్నాం. నాన్నగారి హయాంలో జిల్లా అబివృద్ధికి బీజాలు పడ్డాయి. కానీ ఆయన చనిపోయిన తరువాత జిల్లా అభివృద్ధిని పట్టించుకునేవారే లేకుండా పోయారు. 

సరిగ్గా ఎన్నికలకు ఆరు నెలల ముందు ఒక పెద్ద మనిషి వచ్చి టెంకాయ కొట్టాడు. ఐదేళ్లు పాలించడానికి ప్రజలు అధికారమిస్తే.. నాలుగేళ్లు ఏమి చేయకుండా ఎన్నికలకు ఆరు నెలల ముందు టెంకాయ కొడితే మోసం అంటారు. అదే అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే టెంకాయ కొడితే చిత్తశుద్ధి అంటారు. పాలనలో తేడాను ప్రజలు గమనించాలి. ఈ పరిశ్రమ ద్వారా ప్రత్యక, పరోక్షంగా 25వేల మందికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి నెలకొంటుంది. అక్షరాల రూ. 15 వేలకోట్ల రూపాయలతో పునాదిరాయి వేశాం. స్టీల్‌ ప్లాంట్‌కు కావాల్సిన ఐరన్‌ ఓర్‌ కోసం ఎన్‌ఎండీసీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంద’ని తెలిపారు. 

అంతకముందు, దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్టు అయిన కడప ఉక్కు కర్మాగారానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. రూ.15 వేల కోట్ల పెట్టుబడి అంచనాతో వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లె వద్ద ఈ కర్మాగారాన్ని నిర్మిస్తున్నారు. ఏడాదికి 30 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటు చేయనున్న ఈ కర్మాగారానికి రాష్ట్ర ప్రభుత్వం సున్నపురాళ్లపల్లి, పెదనందలూరు గ్రామాల్లో 3,275.66 ఎకరాలను కేటాయించింది. ఈ కర్మాగారానికి గండికోట రిజర్వాయర్‌ నుంచి 2 టీఎంసీల నీటిని సరఫరా చేయనున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top