నష్టపోయిన పంటలకు అదనంగా 15 శాతం సాయం

YS Jagan comments in a review on flood damage - Sakshi

వరద నష్టంపై సమీక్షలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 

రైతు సంక్షేమ ప్రభుత్వమని నిరూపించాలి

ప్రభుత్వం ఇచ్చే డబ్బును బ్యాంకులు జమ చేసుకోకుండా ఏర్పాటు

రైతు సేవలో కాల్‌ సెంటర్, యాప్‌ 

సాక్షి, అమరావతి: వరదలు, భారీ వర్షాలు, తుపాన్లు వంటి ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన పంటలకు ప్రస్తుతం ఇస్తున్న పరిహారానికి అదనంగా 15 శాతం ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారు. కృష్ణా, గోదావరి తదితర నదులకు వచ్చిన వరదల వల్ల ఆహార, ఉద్యాన, వాణిజ్య పంటలకు జరిగిన నష్టం, తీసుకున్న చర్యలు, అందించాల్సిన సాయం తదితర అంశాలపై మంగళవారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో మంగళవారం జరిగిన సమీక్ష సమావేశంలో వైఎస్‌ జగన్‌  మాట్లాడారు. వరదల కారణంగా నష్టపోయిన వివరాలను సమీక్ష ప్రారంభంలో మంత్రులు, వ్యవసాయ, ఉద్యాన సహా వివిధ శాఖల అధికారులు సీఎంకు నివేదించారు. కృష్ణా నది వరదలతో గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం బాగా దెబ్బతిందని, కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ, పామర్రు, పెనమలూరులో పంటలు దెబ్బతిన్నాయని చెప్పారు. విజయవాడ, మరికొన్ని ప్రాంతాల్లో పంట ముంపు బారిన పడిందని అధికారులు నివేదించారు. 

సాయం నేరుగా రైతులకు మాత్రమే అందాలి
పంట నష్టాన్ని బ్యాంకులు మినహాయించుకోకుండా రైతుల అన్‌ ఇన్‌కంబర్డ్‌ ఖాతాలకే ఇన్‌పుట్‌ సబ్సిడీ వేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. ప్రస్తుతం వివిధ పంటలకు ఇస్తున్న పరిహారాన్ని (తక్షణ సాయాన్ని) 15 శాతం పెంచాలని ఆదేశించారు. ఇది రైతు సంక్షేమ ప్రభుత్వమని నిరూపించాలన్నారు. భూసార పరీక్షలు జరగాలని, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు అందుబాటులో ఉంచాలని చెప్పారు. వీటి నాణ్యతను గుర్తించడానికి ప్రతి నియోజకవర్గంలో పరీక్ష కేంద్రాలు (ల్యాబ్స్‌) ఏర్పాటు చేయాలని, గ్రామ సచివాలయాల్లో కౌలు రైతులకు కార్డులు ఇవ్వాలని, కౌలు రైతుల చట్టంపై అవగాహన కల్పించాలన్నారు. దీనిపై వలంటీర్లకు ముందుగా శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. కల్తీ, నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు సరఫరా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఈ కార్యక్రమాలన్నీ వచ్చే నాలుగైదు నెలల్లో కార్యరూపం దాల్చాలన్నారు. పంటల సాగులో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు తక్షణమే సలహాలు, పరిష్కారాల కోసం కాల్‌సెంటర్, ఒక యాప్‌ను సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రులు కన్నబాబు, బుగ్గన రాజేంద్రనాథ్, మోపిదేవి వెంకటరమణ, పేర్నినాని, మేకతోటి సుచరిత, కొడాలి నాని, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు మధుసూదన్‌రెడ్డి, హెచ్‌.అరుణ్‌కుమార్, చిరంజీవి చౌదరి, సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం, ధనుంజయరెడ్డి, ప్రకృతి విపత్తుల విభాగం అధికారులు పాల్గొన్నారు.

సబ్సిడీపై మినుములు, పెసలు
రాష్ట్రంలో తొలిసారిగా మినుములు, పెసలు పూర్తి సబ్సిడీపై రైతులకు సరఫరా చేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. సమీక్ష సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యాన పంటలకు సుమారు రూ.228 కోట్ల నష్టం జరిగిందని చెప్పారు. రైతులకు నిరంతరం సేవలందించే కాల్‌ సెంటర్‌ను త్వరలో ఏర్పాటు చేస్తామని చెప్పారు. కాగా, వరద ప్రాంతాల్లో సబ్సిడీపై సరఫరా చేసే మినుము, పెసర, వరి వంగడాలను ఇప్పటికే ఆయా ప్రాంతాలకు పంపామని వ్యవసాయాధికారి అరుణ్‌కుమార్‌ వివరించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top