తిరుమలలోని కాటేజీల్లో పనిచేసే పారిశుధ్య కార్మికులు సోమవారం ఆదోళన చేశారు. ఆరు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో సుమారు వందమందికిపైగా కార్మికులు సోమవారం
తిరుమల : తిరుమలలోని కాటేజీల్లో పనిచేసే పారిశుధ్య కార్మికులు సోమవారం ఆదోళన చేశారు. ఆరు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో సుమారు వందమందికిపైగా కార్మికులు సోమవారం ఉదయం విధులకు హాజరుకాకుండా పద్మావతి అతిథిగృహం వద్ద ‘టీటీడీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఆండ్ వర్కర్స్ యూనియన్’ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. తమకు బీవీజీ కాంట్రాక్ట్ సంస్థ ఆరు నెలలుగా జీతాలు ఇవ్వకపోగా వేధింపులకు గురిచేస్తోందని ఆరోపించారు.
తమను కాంట్రాక్టర్లు చిన్నచూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చాలీచాలని జీతంతో కుటుంబ పోషణ కష్టంగా మారిందన్నారు. కనీసం బస్సు పాసులు కూడా ఇవ్వటం లేదని తెలిపారు. శ్రీవారి దర్శనానికి వచ్చిన జాతీయ సఫాయి కర్మచార చట్టం సభ్యులు విజయకుమార్ వారి వద్దకు వెళ్లి విషయాన్ని తెలుసుకున్నారు.
టీటీడీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులందరికీ రూ.8.500 కనీస వేతనం ఇవ్వాలని కాంట్రాక్ట్ యజమానులకు, టీటీడీ అధికారులకు ఆయన తెలియజేశారు. అనంతరం యూనియన్ ప్రధాన కార్యదర్శి వాడ గంగరాజు, ఉపాధ్యక్షుడు మార్కొండయ్య మాట్లాడుతూ ఇప్పటికైనా అధికారులు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
నిరసన వ్యక్తం చేస్తున్న కార్మికులను టూటౌన్ ఎస్‌ఐ వెంకటరమణ, విజిలెన్స్ ఏవీఎస్‌వో వెంకటాద్రి అడ్డుకున్నారు. సమస్యలు ఉంటే అధికారులతో మాట్లాడి పరిష్కరించుకోవాలని, రోడ్లపై ఆందోళన నిషేధమని హెచ్చరించారు. వారం రోజుల్లో సమస్యలను పరిష్కరిస్తామన్న అధికారుల హామీతో కార్మికులు ఆందోళన విరమించి విధులకు హాజరయ్యారు.