ఐటీ గ్రిడ్‌.. ప్రభుత్వ దుశ్చర్యే!

Ycp Leaders Fired Tdp For Data Scam - Sakshi

పట్నంబజారు(గుంటూరు): రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తన సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని స్వార్థ ప్రయోజనాల కోసం తప్ప, రాష్ట్ర, ప్రజా ప్రయోజనాలపై ఏనాడూ దృష్టి సారించలేదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ గుంటూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు లేళ్ళ అప్పిరెడ్డి విమర్శించారు. ఓట్లు, సీట్లు తప్ప చంద్రబాబుకు మరేమీ పట్టవని మండిపడ్డారు. నగరంలోని పట్టాభిపురంలో పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

రాష్ట్రంలో ఐటీ కంపెనీలు లేకపోయినా తన కుమారుడు లోకేష్‌బాబుని ఐటీ మంత్రిని ఎందుకు చేశారో అప్పట్లో అర్ధం కాలేదన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఐటీ గ్రిడ్‌ ద్వారా ఏపీ ప్రజలకు సంబంధించిన వ్యక్తగత వివరాలు, ఏ పార్టీకి చెందిన వారు... బ్యాంకు ఖాతాలు ఇవన్నీ బహిర్గతం కావటం ఆయనపై వస్తున్న అనుమానాలకు బలం చేకూరుతోందన్నారు.

కేవలం ఎలాగైనా సరే 2019లో గెలవాలన్న ఉద్దేశంతో పల్స్‌ సర్వే, ప్రజా సర్వేలు అని పెట్టి వైఎస్సార్‌ సీపీకి సానుభూతిపరులుగా ఉన్న వారి ఓట్లను తొలగించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.ఆధార్‌ నంబర్ల ఆధారంగా, బ్యాంకు అకౌంట్ల వివరాలు తీసుకుంటున్నారని, ప్రజలు ఎంతో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఏపీకి సంబంధించిన వివరాలు బహిర్గతం అయిన విషయంపై తెలంగాణ ప్రభుత్వం విచారిస్తుంటే, చంద్రబాబు ఎందుకు భుజాలు తడుముకుంటున్నారని ప్రశ్నించారు.

కచ్చితంగా ఇది ప్రభుత్వ కుట్రేనని, బాధ్యులైన వారిని తక్షణమే అరెస్ట్‌ చేసి, విచారించాల్సిన అవసరం ఉందన్నారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే షేక్‌ మొహమ్మద్‌ ముస్తఫా మాట్లాడుతూ ఐటీ గ్రిడ్‌ సీఈవోకు మంత్రి లోకేష్‌కు మధ్య సత్సంబంధాలు ఉన్నాయని తెలుస్తోందని, మరోసారి చంద్రబాబు కుట్రలు బహిర్గతం అయ్యాయని దుయ్యబట్టారు. పార్టీ నగర అధ్యక్షుడు పాదర్తి రమేష్‌గాంధీ మాట్లాడుతూ వైఎస్సార్‌ సీపీ గెలుస్తుందనే భయంతో ఇటువంటి కుట్రలకు నాంది పలికారని మండిపడ్డారు. ఇప్పటికైనా అధికారులు అప్రమత్తతతో వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు.

పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త చంద్రగిరి ఏసురత్నం మాట్లాడుతూ ఏపీకి చెందిన వ్యక్తి రాష్ట్రానికి సంబంధించిన వారి వ్యక్తిగత సమాచారం ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లో ఉందని తెలుసుకుని ఫిర్యాదు చేస్తే.,.అక్కడ ఏపీ పోలీసులకు పనేంటని ప్రశ్నించారు. హడావుడిగా ఇక్కడ మిస్సింగ్‌ కేసు కట్టించటంతో పాటు, ఫిర్యాదుదారుడిని భయపెట్టడం సిగ్గుచేటన్నారు.

చంద్రబాబు హడావుడి చూస్తుంటే స్పష్టంగా ఐటీ గ్రిడ్‌కు ప్రభుత్వానికి సంబంధం ఉందనే తెలుస్తోందన్నారు. సమావేశంలో వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు అబ్దుల్‌ కర్నుమా, బొర్రా వెంకటేశ్వరరెడ్డి, అనుబంధ విభాగాల నేతలు యేటిగడ్డ బుజ్జి, తిప్పారెడ్డి రామకృష్ణారెడ్డి, మెట్టు వెంకటప్పారెడ్డి, జగన్‌కోటి, షేక్‌ రబ్బాని, పసుపులేటి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top