పరిహారం కోసం అడ్డదారులు.. | wrong route for New homes Compensation | Sakshi
Sakshi News home page

పరిహారం కోసం అడ్డదారులు..

Nov 18 2017 6:05 AM | Updated on Nov 18 2017 6:05 AM

wrong route  for New homes Compensation - Sakshi

పుట్టుకొస్తున్న కొత్త ఇళ్లు పరిహారం కోసం అడ్డదారులు తొక్కుతున్నారు కొందరు. అధికారుల అండదండలతో పరిహారం కోసం కొత్త ఇళ్లు పుట్టుకొచ్చేస్తున్నాయి. ఒకే ముంపు గ్రామంలో వందకుపైగా కొత్త ఇళ్ల నిర్మాణం చూసి స్పెషల్‌ కలెక్టర్‌ కంగుతినాల్సిన పరిస్థితి వచ్చింది. 

సాక్షి ప్రతినిధి, ఏలూరు : జీలుగుమిల్లి మండలం అంకంపాలెం గ్రామంలో ఎక్కడా ఖాళీ స్థలాలు కనపడటం లేదు. ఆర్‌అండ్‌బీ, పంచాయతీ స్థలాలు, శ్మశానాలు, ఏదీ వదలకుండా ఎక్కడపడితే అక్కడ ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదు. కాని వందల సంఖ్యలో ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. కారణం ఏంటంటే ఈ గ్రామం జల్లేరు ముంపులో ఉంది. నెల రోజుల క్రితం ఈ గ్రామం జల్లేరు రిజర్వాయర్‌ ముంపులో ఉన్నట్లు ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇంకేముంది అంకంపాలెంలో పరిహారం కోసం పుట్టగొడుగుల్లా ఇళ్ల నిర్మాణం ప్రారంభం అయింది. అవసరం ఉన్నా లేకపోయినా ఖాళీ స్థలం కనపడితే చాలు పేక మేడల్లా ఇళ్లు, షెడ్లు, షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, భారీ కట్టడాలు నిర్మాణం చేస్తున్నారు. ముంపులో 

ఉన్న ఇళ్లకు మూడు నుంచి నాలుగు రెట్ల వరకు పరిహారం వస్తుందనే కారణంతో కొత్తగా ఇళ్ల నిర్మాణం చేపట్టినట్లు సమాచారం. దీనికి పంచాయతీ అధికారులు కూడా పూర్తిస్థాయిలో సహకరించడంతో పునాది వేయగానే ఇంటి పన్ను వచ్చేస్తోంది. పంచాయతీ అధికారులకు రూ. పది వేలు సమర్పించుకుంటే మూడు సంవత్సరాల పాత తేదీలతో ఇంటి పన్నులు, కుళాయి కనెక్షన్లు ఇచ్చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. శుక్రవారం అంకంపాలెంలో జరుగుతున్న ముంపు సర్వే పనులను పరిశీలించేందుకు భూసేకరణ స్పెషల్‌ కలెక్టర్‌ భానుప్రసాద్‌ ఆకస్మిక తనిఖీకి వచ్చారు. అయన వచ్చే సరికి సర్వే బృందం కనపడకపోవడంతో గ్రామం అంతా కలియతిరిగారు. గ్రామంలో కొత్తగా పెద్ద సంఖ్యలో ఇళ్ల నిర్మాణం జరుగుతుండటం చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడేళ్ల క్రితం కట్టిన ఇళ్లను తప్ప ఇప్పుడు కడుతున్న కొత్త ఇళ్లకు సర్వే చేస్తే ఉద్యోగాలు ఊడతాయని సర్వే సిబ్బందిని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement