గర్భిణికి ఎయిడ్స్‌ అన్న తప్పుడు నివేదికపై విచారణ

Wrong Report On Pregnant Woman HIV Test East Godavari - Sakshi

కంటితుడుపు చర్యగా సాగిందంటున్న బాధితులు

తూర్పుగోదావరి, తాడితోట (రాజమహేంద్రవరం): గర్భిణికి ఎయిడ్స్‌ ఉందంటూ తప్పుడు నివేదిక ఇచ్చిన ఘటనపై వైద్య అధికారులు ఆదివారం విచారణ నిర్వహించారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలోని మాతా శిశు విభాగం ల్యాబ్‌లో గర్భిణికి రక్తపరీక్షలు చేసి ఎయిడ్స్‌ ఉందంటూ తప్పుడు నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై డిప్యూటీ డీ అండ్‌ ఎంహెచ్‌ఓ డాక్టర్‌  ఎం.పవన్‌కుమార్, జిల్లా అసుపత్రుల సమన్వయకర్త, రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ టి.రమేష్‌కిషోర్, ఆర్‌ఎంఓ డాక్టర్‌ పద్మశ్రీ , విచారణాధికారి డాక్టర్‌ సునీత విచారణ జరిపారు. బాధితురాలు నల్లమాటి మనీషాను, ల్యాబ్‌ టెక్నీషియన్‌ రవి, కౌన్సెలర్‌ లలితను వేరు వేరుగా విచారణ జరిపారు.

బాధితురాలు మనీషా జరిగిన క్రమాన్ని వివరించారు. తన పట్ల కౌన్సెలర్‌ లలిత దురుసుగా ప్రవర్తించడాన్ని అధికారులకు వివరించారు. ఎయిడ్స్‌ లేకుండానే ఉందంటూ బలవంతంగా తనతో మందులు వాడించేందుకు ప్రయత్నించారన్నారు. తనకు ఎయిడ్స్‌ లేదని చెప్పినా వినకుండా లలిత దుర్భాషలాడారన్నారు.   దాంతో తాను, తన భర్త, తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడేందుకు యత్నించామన్నారు. తనకు ఎయిడ్స్‌ లేదని చెప్పినప్పుడైనా రెండోసారి టెస్ట్‌లు చేసేందుకు ప్రయత్నించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం
ఈ ఘటనపై డిప్యూటీ డీ అండ్‌ ఎంహెచ్‌ఓ ఎం.పవన్‌కుమార్‌ను ప్రశ్నించగా గర్భిణికి ఇచ్చిన టెస్ట్‌ నివేదికలు పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. అయితే ఈ ఘటనపై ఇంతవరకూ ఎవరిపైనా ఏవిధమైన చర్యలూ తీసుకోలేదని బాధిత కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ల్యాబ్‌ టెక్నీషియన్లు ఎమైనా తప్పులు చేస్తే ప్రసూతి ఆసుపత్రిలో ఉన్న ల్యాబ్‌ నుంచి ప్రధాన ఆసుపత్రిలో ఉన్న ల్యాబ్‌కు, అక్కడ నుంచి ఇక్కడకు బదిలీ చేస్తున్నారు తప్ప వారిపై ఏ విధమైన చర్యలు తీసుకోవడం లేదని వారు ఆరోపించారు. విచారణ తూతూమంత్రంగా జరిగిందని వారు తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top