
అధ్వాన ‘భోజనం’
జిల్లాలో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం విద్యార్థుల ఆకలి తీర్చడం లేదు. చాలాచోట్ల ముద్దకడుతున్న అన్నం, నీళ్ల సాంబారు వడ్డిస్తున్నారు.
=ముద్దకడుతున్న అన్నం, నీళ్ల సాంబారు
=70 శాతం పాఠశాలల్లో ఆరుబయటే వంట
=నీళ్లులేక శాంతిపురంలో ఆగిన మధ్యాహ్న భోజనం
=మంజూరు కాని బకాయి సొమ్ము
=ఇస్కాన్ భోజనంలోనూ నాణ్యత అంతంతమాత్రం
జిల్లాలో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం విద్యార్థుల ఆకలి తీర్చడం లేదు. చాలాచోట్ల ముద్దకడుతున్న అన్నం, నీళ్ల సాంబారు వడ్డిస్తున్నారు. కోడిగుడ్డు మాటేలేదు. సుమారు 70 శాతం పాఠశాలల్లో ఆరుబయటే వంట చేస్తున్నారు. నీళ్లు లేక శాంతిపురంలో భోజన పథకం అమలు కావడం లేదు. మరోవైపు ఇస్కాన్ వారు అందిస్తున్న భోజనంలో నాణ్యత అంతంతమాత్రంగానే ఉంటోంది.
సాక్షి, చిత్తూరు: జిల్లాలో 5096 పాఠశాలల్లో 3.72 లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. ఈ పథకం అమలవుతున్న తీరు పట్ల విమర్శలు వినిపిస్తున్నాయి. మదనపల్లె, పలమనేరు, కుప్పం నియోజకవర్గాల్లో ఎక్కువగా ఆరుబయటే వంట చేస్తున్నారు. దీంతో దుమ్ముధూళి వచ్చి చేరుతోంది. కొన్ని చోట్ల ఏజెన్సీ నిర్వాహకులు ఇంటి నుంచి వంట చేసుకొచ్చి పెడుతున్నారు. పుత్తూరు లాంటి చోట్ల ఇస్కాన్ సరఫరా చేస్తున్న భోజనం నాణ్యత అంతంతమాత్రంగానే ఉంటోంది. ముద్ద అన్నం, నీళ్లు సాంబార్ వడ్డిస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అత్యధిక పాఠశాలల్లో భోజనం రుచికరంగా ఉండడం లేదనేది సాక్షి పరిశీలనలో వెల్లడైంది.
తంబళ్లపల్లెలో మధ్యాహ్న భోజన పథకానికి 8,03,627 రూపాయలు ప్రభుత్వం బకాయి ఉంది. 1 నుంచి 8వ తరగతి పిల్లలకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వ నిధులు మాత్రం 2014 వరకు ఎంఈవోల ఖాతాల్లో జమ అయింది. నెలకు 465 క్వింటాళ్ల బియ్యం అందాల్సి ఉంది. ఆరు మండలాల్లో బియ్యం సరఫరా చేయలేదు. ఏజెన్సీల నిర్వాహకులు బియ్యం అప్పు తీసుకొచ్చి పిల్లలకు వంట చేసి పెడుతున్నారు.
చిత్తూరులో ఐదారు పాఠశాలలకు బయట వండి భోజనం తీసుకొస్తున్నారు. నిబంధనల ప్రకారం ఉపాధ్యాయుల సమక్షంలో మధ్యాహ్నా భోజనం వండాలి. కాని అలా జరగడం లేదు. కొన్ని చోట్ల పిల్లలు ఇంటి దగ్గర నుంచి క్యారియర్ తెచ్చుకుంటున్నారు.
పలమనేరు నియోజకవర్గంలో 497 పాఠశాలలు ఉన్నాయి. మొత్తం 44 వేల మంది చదువుతున్నారు. ఇక్కడ మధ్యాహ్న భోజనం నాసిరకంగా ఉంటోంది. తమకు నిధులు చాలడం లేదని నిర్వాహకులు అంటున్నారు. బెరైడ్డిపల్లె మండలంలో బియ్యంలో రాళ్లు ఉంటున్నాయి. పలమనేరు మండలంలో సాంబారు రుచికరంగా లేదని, అన్నం ముద్ద కడుతోందని ఫిర్యాదులు అందాయి. దీనివల్ల పిల్లలు అన్నం తినకుండా పడేస్తున్నారు. పెద్దపంజాణి మండలంలో వంట గదులు లేవు. నేలపల్లె ఉన్నత పాఠశాలలో ఆరుబయటే భోజనం వండుతున్నారు.
కుప్పం నియోజకవర్గంలో 453 పాఠశాలలు ఉన్నాయి. ఉడికీ ఉడకని అన్నం, రుచిలేని సాంబారు నీళ్ల నీళ్లగా వడ్డిస్తున్నారు. నీళ్లు లేకపోవడంతో శాంతిపురంలో తుంసీరోడ్డు హైస్కూల్‌లో మధ్యాహ్న భోజన పథకం అమలు కావడం లేదు.
నగరి నియోజకవర్గంలో 310 పాఠశాలలు ఉన్నాయి. సుమారు 23 వేల మంది చదువుతున్నారు. నగరి రూరల్ మండలానికి సరఫరా అవుతున్న బియ్యం నాసిరకంగా ఉంటున్నాయి. వంట గదులు లేకపోవడంతో ఆరుబయటే వంట తయారీ తప్పడం లేదు. వడమాలపేట, పుత్తూరు పట్టణంలో కొన్ని పాఠశాలల్లో ఇస్కాన్ భోజనం అందిస్తున్నారు.
హస్తి నియోజకవర్గంలో 410 పాఠశాలలు ఉన్నాయి. బియ్యం నాసిరకంగా ఉంటున్నాయి. గ్యాస్ సిలిండర్లు లేకపోవడంతో కట్టెలపొయ్యతోనే వంట చేస్తున్నారు. బుధవారం, ఆదివారం గుడ్డు పెట్టడం లేదు. అధికారుల సరైన పర్యవేక్షణ లేకపోవడంతో పథకం అమలు తూతూమంత్రంగా సాగుతోంది.
పీలేరు నియోజకవర్గంలో ముతక అన్నం పెడుతున్నారు. ఇస్కాన్ భోజనం ఇంకా ఘోరంగా ఉంటోంది. సగం మంది విద్యార్థులు ఇళ్ల నుంచి క్యారియర్ తెచ్చుకుంటున్నారు.
మదనపల్లెలో మండలంలో 140 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. సుమారు 60 పాఠశాలలకు వంట గదులు లేవు. కొందరు నిర్వాహకులు ఇంటి నుంచే భోజనం చేసుకుని వస్తున్నారు. మరికొన్ని పాఠశాలల్లో నేడోరేపో కూలిపోనున్న గదుల్లో వంట చేస్తున్నారు.