పేరుకే పెద్దాసుపత్రి.. | Women's medical ward basic facilities drought | Sakshi
Sakshi News home page

పేరుకే పెద్దాసుపత్రి..

Aug 19 2014 12:37 AM | Updated on Sep 2 2017 12:04 PM

జబ్బు నయం చేయించుకునేందుకు ఎక్కడి నుంచో వచ్చే వారికి కొత్త రోగాలు అంటుకుంటున్నాయి.

కర్నూలు(హాస్పిటల్): జబ్బు నయం చేయించుకునేందుకు ఎక్కడి నుంచో వచ్చే వారికి కొత్త రోగాలు అంటుకుంటున్నాయి. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని నీతులు చెప్పే వైద్యులు ఆసుపత్రిలో లోపించిన పారిశుద్ధ్యాన్ని పట్టించుకోవడం లేదు. కర్నూలు సర్వజన వైద్యాశాల పందులకు నిలయంగా మారింది. వార్డుల చుట్టూ పందుల సంచారం అధికం కావడంతో రోగులు బెంబేలెత్తుతున్నారు. పేరుకే పెద్దాసుపత్రిలో కనీస సౌకర్యాలు కరువయ్యాయని రోగుల సహాయకులు ఆరోపిస్తున్నారు.

 టీబీ వార్డు పక్కన ఉన్న స్త్రీల మెడికల్ వార్డు పరిస్థితి అధ్వానంగా ఉంది.  ఈ వార్డు శిథిలావస్థకు చేరుకోవడంతో గతంలో మూసివేశారు. దీని పక్కనే మరో స్త్రీ మెడికల్ వార్డు(కొత్త భవనం) నిర్మించారు. అయితే మహిళా రోగుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండటంతో మూసివేసిన ఈ వార్డును మళ్లీ తెరిపించారు. సౌకర్యాలు  కల్పించడం అధికారులు మరిచారు.

 వేధిస్తున్న మంచాల కొరత..
 స్త్రీల మెడికల్ వార్డుకు టీబీ, జ్వరం, ఆయాసం వంటి జబ్బులతో బాధపడుతున్న వారు వస్తుంటారు. రోగులకు వైద్యం సంగతి దేవుడెరుగు. పడుకునేందుకు మంచాలు సరిపడక వార్డు ఆవరణలో నిద్రిస్తున్నారు. వార్డు చుట్టూ పందులు స్వైర విహారం చేస్తుండటంతో  దుర్వాసన వస్తోంది. వార్డుకు ఆనుకుని మురుగు కాల్వ ఉంది. ఇందులో చెత్తా చెదారం పేరుకుపోయింది. ఈ ప్రాంతంలో దోమలు వృద్ధి చెందడంతో రోగులు అల్లాడుతున్నారు. తగినన్ని ఫ్యానులు లేక, ఉన్న ఫ్యాన్లలో కొన్ని చెడిపోవడంతో ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు. సరిపడ బాత్‌రూమ్‌లు, టాయిలేట్లు లేక మహిళా రోగులు అవస్థలు పడుతున్నారు.

 రోగుల చుట్టే పందులు..
 ఆసుపత్రి ఆవరణలో పందుల సంచారం అధికమైంది. రోగుల చుట్టూ తిరుగుతుండటంతో వ్యాధిల భారీన పడుతున్నారు. ఎమర్జెన్సీ వార్డు ఆవరణలో పందులు గుంపులు గుంపులుగా తిరుగుతున్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని రోగుల సహాయకులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రి అధికారులు పారిశుద్ధ్యం, కనీస సౌకర్యాలపై దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement