
తగ్గిపోతున్న మహిళా ఓటర్లు
ఒకవైపు జనాభా నిష్పత్తిలో మహిళలు తగ్గిపోయి పురుషులు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తుండగా ఇప్పుడు ఓటర్లలో కూడా మహిళలు తగ్గిపోవడం గమనార్హం.
సాక్షి, హైదరాబాద్: ఒకవైపు జనాభా నిష్పత్తిలో మహిళలు తగ్గిపోయి పురుషులు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తుండగా ఇప్పుడు ఓటర్లలో కూడా మహిళలు తగ్గిపోవడం గమనార్హం. గత కొన్ని సంవత్సరాలుగా మెజారిటీ నియోజకవర్గాల్లో పురుష ఓటర్ల కన్నా మహిళా ఓటర్లే ఎక్కువగా ఉండేవారు. ఇప్పుడు అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొందని, మహిళా ఓటర్లు తగ్గిపోయారని, ఓటర్‌గా నమోదుకు మహిళలు ముందుకు రావాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ విజ్ఞప్తి చేశారు. గత ఏడాది ఓటర్ల జాబితా సవరణ అనంతరం ఈ ఏడాది జనవరిలో ప్రకటించిన తుది జాబితాలో పురుష ఓటర్లు 2.90 కోట్ల మంది ఉండగా మహిళలు 2.92 కోట్ల మంది ఉన్నారు. అంటే పురుష ఓటర్ల కన్నా రెండు లక్షల మంది ఎక్కువగా ఉన్నారు.
ఈ ఏడాది ఏప్రిల్-మే నెలల్లో నిర్వహించిన ఇంటింటి తనిఖీల అనంతరం మహిళా ఓటర్ల సంఖ్య గణనీయంగా తగ్గింది. పురుష ఓటర్లు 2.99 కోట్ల మంది ఉండగా మహిళా ఓటర్లు 2.95 కోట్ల మందే ఉన్నారని తేలింది. ఇంటింటి తనిఖీల్లో భాగంగా... మృతి చెందిన, ఒకటి కంటే ఎక్కువచోట్ల నమోదైన ఓటర్లు, ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయిన ఓటర్లు.. ఇలా మొత్తం 20.36 లక్షల మందిని జాబితా నుంచి తొలగించారు. ఇదే ఇంటింటి సర్వేలో కొత్తగా 33.10 లక్షల మంది ఓటర్లను జాబితాలో చేర్చుకున్నారు.
హిజ్రా ఓటర్ల తగ్గుదల: హిజ్రా ఓటర్ల సంఖ్య కూడా తగ్గింది. గత ఏడాది ఓటర్ల జాబితా సవరణ అనంతరం ఈ ఏడాది జనవరిలో ప్రకటించిన జాబితాలో ఈ ఓటర్లు 3,964 మంది ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 2,547 మందికి తగ్గిపోయింది.