
సాక్షి, తిరుపతి: తిరుపతిలో ‘నిపా’ వైరస్ కలకలం సృష్టిస్తోంది. కేరళ నుంచి వచ్చిన ఓ మహిళా డాక్టర్‌కి ‘నిపా’ వైరస్ లక్షణాలు ఉన్నట్లు తెలుస్తోంది. రుయా ఆస్పత్రిలో ఆ వైద్యురాలికి వైద్య పరీక్షలు చేస్తున్నారు. ప్రాణాంతక ‘నిపా’ వైరస్ దేశంలో మొదటిసారిగా కేరళలో బయటపడింది. ఇప్పటి వరకూ ‘నిపా’ బారిన పడి కేరళలో మరణించిన వారి సంఖ్య 16కు చేరుకున్న విషయం తెలిసిందే.
‘నిపా’ వైరస్ కలకలంపై చిత్తూరు కలెక్టర్ ప్రద్యుమ్న స్పందించారు. మదనపల్లికి చెందిన డాక్టర్‌కి ‘నిపా’ వైరస్ లక్షణాలు ఉన్నట్లు అనుమానంగా ఉందని కలెక్టర్ చెప్పారు. రుయా ఆస్పత్రిలో కేరళ వైద్యురాలిని కలెక్టర్ పరామర్శించారు. వైద్యుల పర్యవేక్షణలోనే కేరళ డాక్టర్ ఉన్నారు. జిల్లాలో ఇప్పటి వరకూ ఒక ‘నిపా’ వైరస్ కేసు నమోదు కాలేదని ప్రద్యుమ్న తెలిపారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని కలెక్టర్ చెప్పారు. కేంద్రం సూచనల మేరకు ఆమెను వైద్యుల పర్యవేక్షనలో ఉంచారన్నారు. వైద్య పరీక్షల అనంతరం మహిళకు ‘నిపా’ వైరస్ లేదని డాక్టర్లు వెల్లడించారు.