'కాల్ మనీ' వ్యాపారులు వేధిస్తున్నారంటూ కొండపల్లికి చెందిన బండి సావిత్రి సోమవారం ఉదయం విజయవాడ పోలీసు కమిషనర్ కార్యాలయం ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది.
-విజయవాడలో మహిళ ఆత్మహత్యాయత్నం
-పోలీసు కమిషనర్ కార్యాలయం ఎదుట ఘటన
విజయవాడ సిటీ (కృష్ణా జిల్లా) : 'కాల్ మనీ' వ్యాపారులు వేధిస్తున్నారంటూ కొండపల్లికి చెందిన బండి సావిత్రి సోమవారం ఉదయం విజయవాడ పోలీసు కమిషనర్ కార్యాలయం ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. ఈ హఠాత్పరిణామంతో కంగుతిన్న భద్రతా సిబ్బంది హుటాహుటిన ఆమెను చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి బాగానే ఉందని పోలీసులు చెపుతున్నారు.
రుణమిచ్చిన వారి వేధింపులకు తోడు పోలీసులు పట్టించుకోకపోవడమే ఆత్మహత్యాయత్నానికి కారణమని ఆమె చెప్తోంది. పోలీసులు మాత్రం అప్పులు ఇచ్చిన వాళ్లు జీతం అటాచ్‌మెంటు కోసం కోర్టు నుంచి డిక్రీ తెచ్చుకున్నారని, తామేమీ చేయలేమని అంటున్నారు. సావిత్రి తెలిపిన వివరాల ప్రకారం.. డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్‌లో సావిత్రి భర్త పనిచేస్తున్నారు. వ్యక్తిగత అవసరాల కోసం ఇదే ప్రాంతానికి చెందిన టైలర్ చిమటా శ్రీనివాసరావు వద్ద రూ.40 వేలు కాల్‌మనీ కింద అప్పు తీసుకున్నారు. అంగన్‌వాడీ వర్కర్ గెట్టం నిర్మలకుమారి వద్ద కూడా కొంత అప్పు తీసుకున్నారు. వడ్డీ కింద రూ.లక్షన్నర వరకు చెల్లించినప్పటికీ ఇంకా చెల్లించాలంటూ ఒత్తిళ్లు తెస్తున్నారు.
పోలీసులు కూడా వడ్డీ వ్యాపారులకే మద్దతుగా ఉన్నారనేది ఆమె ఆరోపణ. కమిషనరేట్ అధికారుల వద్ద కూడా తనకు న్యాయం జరగలేదని భావించి వెంట తెచ్చుకున్న పురుగుల మందును శీతల పానీయంలో కలుపుకుని పోలీసు కమిషనర్ కార్యాలయం గేటు వద్ద తాగింది. ఇది గమనించిన భద్రతా సిబ్బంది అంబులెన్స్‌ను రప్పించి చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రూ.2.70 లక్షలకు శ్రీనివాసరావు, రూ.2.50 లక్షలకు నిర్మలకుమారి కోర్టు నుంచి డిక్రీ తెచ్చుకున్నట్టు తెలిసింది.
కోర్టు ఆదేశాలను దృష్టిలో ఉంచుకొని వడ్డీ వ్యాపారులపై చర్యలకు పోలీసులు వెనుకడుగు వేస్తున్నారు. ఇబ్రహీంపట్నం పోలీసుస్టేషన్ ఇన్‌స్పెక్టర్ డి.చవాన్ సాక్షితో మాట్లాడుతూ కోర్టు డిక్రీ ఇవ్వడంతో తాము జోక్యం చేసుకుంటే కోర్టు ధిక్కారణ కిందకు వస్తుందని ఆమెకు నచ్చజెప్పామన్నారు. పదే పదే ఆమె వచ్చి అడగడంతో అప్పు ఇచ్చిన వారిని కూడా పిలిపించి మాట్లాడామని, వారు అంగీకరించకపోవడంతో పెద్ద మనుషుల సమక్షంలో పరిష్కారం చేసుకోమని సూచించినట్టు తెలిపారు.