ముప్పు తప్పింది.. ముంపు మిగిలింది

Withdrawal of the two warnings on the Godavari at dhavalesvaram - Sakshi

గోదావరిపై ధవళేశ్వరం వద్ద రెండు ప్రమాద హెచ్చరికలూ ఉపసంహరణ

సముద్రంలోకి 9.21 లక్షల క్యూసెక్కులు విడుదల

సాక్షి, అమరావతి/అమలాపురం/కొవ్వూరు: గోదావరిలో వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో ఉభయ గోదావరి జిల్లాలకు ముప్పు తప్పింది. ఏజెన్సీ, లంక గ్రామాల్లో ముంపు మాత్రం ఇంకా తొలగిపోలేదు. ఆదివారం ఉదయం 6 గంటలకు ధవళేశ్వరం బ్యారేజి వద్ద 15,61,763 క్యూసెక్కుల ప్రవాహం రాగా.. సాయంత్రం 6 గంటలకు 9,21,396 క్యూసెక్కులకు తగ్గింది. తెల్లవారుజామున 5.30 గంటలకు నీటిమట్టం 13.75 అడుగులకు తగ్గడంతో రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. మధ్యాహ్నం 3 గంటలకు నీటిమట్టం 11.60 అడుగులకు దిగి రావడంతో మొదటి ప్రమాద హెచ్చరికనూ ఎత్తివేశారు. సాయంత్రం 6 గంటలకు ఆనకట్ట వద్ద నీటిమట్టం 11 అడుగులుగా నమోదైంది. 8వ తేదీన ఉదయం 11.30 గంటలకు రెండో ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటిన వరద 54 గంటలపాటు కొనసాగింది. ఈనెల 7న ఉదయం 11 గంటలకు జారీ చేసిన మొదటి ప్రమాద హెచ్చరికను నాలుగు రోజుల అనంతరం ఉపసంహరించారు. పోలవరం ప్రాజెక్ట్‌ వద్ద సహజ ప్రవాహానికి కాఫర్‌ డ్యామ్‌ అడ్డంకిగా మారడం వల్ల నీటిమట్టం తగ్గడం లేదు. 

గల్లంతైన యువకుల మృతదేహాలు లభ్యం
తూర్పు గోదావరి జిల్లా అప్పనపల్లి కాజ్‌వే వద్ద శుక్రవారం గల్లంతైన షేక్‌ సమీర్‌బాషా (23), షేక్‌ రెహ్మాన్‌ అలియాస్‌ నాని (17) మృతదేహాలను ఆదివారం ఉదయం వెలికితీశారు. ఇదిలావుంటే.. ఏజెన్సీలోని దేవీపట్నం మండలంలోని గ్రామాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. కోనసీమలోని పి.గన్నవరం మండలంలో ఆరు గ్రామాలు ముంపులోనే ఉన్నాయి. ఐదు గ్రామాల ప్రజలు ఇంకా పడవల ద్వారానే రాకపోకలు సాగిస్తున్నారు. కె.ఏనుగుపల్లి రహదారిపై రెండడుగుల వరద నీటిలోనే స్థానికులు రాకపోకలు సాగిస్తున్నారు. మామిడికుదురు మండల పరిధిలోని మూడు గ్రామాలకు ఇంకా బాహ్య ప్రపంచంతో సంబంధాలు పునరుద్ధరణ కాలేదు. అయినవిల్లి మండలం ఎదురుబిడియం కాజ్‌వే వద్ద పడవలపైనే రాకపోకలు సాగుతున్నాయి. పశ్చిమ పోలవరం మండలంలోని ముంపు గ్రామాలు, ఆచంట, యలమంచిలి మండలాల్లోని లంక గ్రామాల్లో వరద కొంతమేర తగ్గుముఖం పట్టింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top