వన్యప్రాణులు విలవిల..!

Wild Animals Suffering With Water Problems - Sakshi

దాహంతో జనారణ్యంలోకి పరుగులు

అటవీ ప్రాంతంలో ఎండిన నీటి కుంటలు

ట్రాక్టర్ల ద్వారా సాసర్‌పిట్‌లల్లోకి నీటితరలింపు

ప్రత్యామ్నాయ చర్యలకు దిగిన అటవీఅధికారులు

జిల్లాలో ఉన్న అభయారణ్యాలలో వన్యప్రాణులు నీటి కోసం అలమటిస్తున్నాయి. చుక్కనీరు లభించికదాహంతో తట్టుకోలేక జనారణ్యంలోకి పరుగులు తీస్తున్నాయి. అటవీ ప్రాంతంలో నీటి కుంటలుఎండిపోయాయి. భగభగ మండే ఎండలకు దాహంతో అలమటిస్తున్నాయి. అటవీ శాఖ అధికారులుప్రత్నామ్నాయ చర్యలు తీసుకొని ట్రాక్టర్ల ద్వారా సాసర్‌ పిట్‌లలోకి నీరు నింపుతున్నారు.  

వైఎస్‌ఆర్‌ జిల్లా, రాజంపేట : జలకళతో ఉట్టిపడాల్సిన శేషాచలం, లంకమల అభయారణ్యం, పెనుశిల అభయార ణ్యాలలో ఈ యేడాది మాత్రం పరిస్థితి భిన్నంగా మారింది. వర్షాకాలం సీజన్‌తో అటవీ ప్రాంతంలో జలపాతాలు, నీటి కుంటలు, చెక్‌డ్యాంలు, సాసర్‌పిట్‌లలో నీళ్లు సమృద్ధిగా ఉండటం సహజం. వర్షాకాలంలో వర్షాలు సక్రమంగా కురవలేదు. ప్రకృతి ప్రకోపంతో కరువు తెచ్చిపెట్టింది. అటవీ ప్రాంతంలో వన్యప్రాణులకు దాహార్తిని తీర్చే వనరులు వట్టిపోయాయి. జిల్లాలో రాజంపేట, కడప, ప్రొద్దుటూరు ఫారెస్టు డివిజన్లు ఉన్నాయి. ప్రధానంగా శేషాచలం, లంకమల, పెనుశిల, నల్లమల అభయారణ్యాలున్నాయి.

మండుటెండలకు అల్లాడుతూ...
అటవీ ప్రాంతంలో మండుటెండలకు వన్య ప్రాణులు అల్లాడిపోతున్నాయి. చుక్క నీరు లేక వన్యప్రాణులు గ్రామాలవైపు పరుగులు పెడుతున్నాయి. అటవీ ప్రాంతంలో జింకలు, దుప్పిలు, కొండ గొర్రెలు, అడవి బర్రెలు, అడవిపందులు, నెమళ్లు, చిరుతలు, పెద్దపులి, హనిబాడ్జర్,మనుబోతు, కణుజు, రోషకుక్కలు, తోడేళ్లు, నక్కలు, ఎలుగుబంట్లుతోపాటు ఇతర జంతువులు, పక్షలు నీటి కోసం జననివాసాల్లోకి వస్తున్నాయి. వీటికి అవి సంచరించే ప్రాంతంలో దాహార్తిని తీర్చుకునేందుకు అవసరమైన పరిస్థితులు లేకపోవడంతోనే అవి అడవి దాటుతున్నాయి.        

రాత్రుల్లో నీటికోసం..
అటవీ ప్రాంతంలో ఉన్న వన్య ప్రాణులు పగలుకన్నా..రాత్రుల్లోనే నీటికోసం అటవీ గ్రామాల శివారుల్లోకి వచ్చేస్తున్నాయి. రాత్రి వేళలో తోటల్లోకి వచ్చి నీటి కోసం పరుగులు తీయడం కనిపిస్తోందని ప్రత్యక్షంగా చూసిన రైతులు అంటున్నారు. వీటి వల్ల తోటలకు ఎటువంటి హానీ ఉండదని, ఏనుగులతో హానీ ఉంటుందని చెప్పుతున్నారు. తెల్లవారుజాము వరకు మైదాన ప్రాంతంలోనే దాహార్తీ తీర్చుకొని సేదతీరుతుంటాయి. గుక్కెడ నీటì కోసం నీటి చలమలను వెతుకొంటూ వస్తున్నాయి.  

వన్యప్రాణుల దాహార్తికి ప్రత్యామ్నాయ చర్యలు
శేషాచలం,పెనుశిల అభయారణ్యం, లంకామల్ల అభయారణ్యాలు ఉన్నాయి.ఈ అభయారణ్యాలలో ఉన్న వన్యప్రాణులకు దాహార్తిని తీర్చేందుకు ప్రత్యామ్నాయ చర్యలను అటవీశాఖ చేపట్టింది. అటవీ ప్రాంతంలో ఏర్పాటుచేసిన సాసర్‌పిట్స్‌లో ట్యాంకర్ల ద్వారా నీటిని నింపుతున్నారు. అలాగే రాజంపేట డివిజన్‌ మొబైల్‌ సాసర్‌పిట్స్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. అభయారణ్యాలలో దట్టమైన ప్రాంతంలోని అక్కడక్క చిన్నపాటి కొలనులో నీరు ఉన్నట్లుగా చెప్పుతున్న ఇప్పుడు అవి ఆవిరికావడంతో వన్యప్రాణాలు జనారణ్యంలోకి వస్తున్నాయనే వాదన వినిపిస్తోంది.  

డివిజన్లు : 3
అభయారణ్యాలు : 4

సాసర్‌పిట్‌లో నీరు నింపుతున్నాం
సాసర్‌పిట్‌లలో ట్రాక్టర్ల ద్వారా నీటిని నింపుతున్నాము. వన్యప్రాణులు దా హార్తి తీర్చేందుకు అవసరమైన చర్యలు ఎప్పటికప్పుడు తీసుకోవడం జరుగుతోంది. అంతేగాకుండా రాజంపేట ఫారెస్టు డివిజన్‌ పరిధిలో తాత్కలిక సాసర్‌పిట్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చాం. – ఖాదర్‌వల్లి, డీఎఫ్‌ఓ, రాజంపేట

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top