నా భర్తను స్వదేశానికి చేర్చండి

Wife Request Husband Stuck in Kuwait Help to Return Home - Sakshi

అనారోగ్యంతో కువైట్‌లో అవస్థలు

కుటుంబం వేడుకోలు

వైఎస్‌ఆర్‌ జిల్లా, రైల్వేకోడూరు రూరల్‌ : కువైట్‌లో తన భర్త అనారోగ్యంతో అవస్థలు పడుతున్నాడని, క్షేమంగా స్వదేశానికి చేర్చాలని ఓ మహిళ వేడుకుంటోంది. బాధితురాలి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. అనంతరాజుపేట పంచాయతీ బీసీ కాలనీకి చెందిన ఇర్ల సురేష్‌బాబు డ్రైవర్‌గా జీవనం సాగించే వాడు. ఆయనకు భార్య తేజావతి, కుమారుడు వంశీ(14), మధురిమ(13), మరో కుమారుడు సంతోష్‌(10) ఉన్నారు. పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని భావించి, నాలుగేళ్ల క్రితం కువైట్‌ వెళ్లారు. గతేడాది అక్టోబరులో ఇండియాకు వచ్చారు. భార్య, పిల్లలతో కొన్ని రోజులు గడిపారు. (మరదలిని చంపిన బావ )

రెండో సారి వెళితే జీతం పెరుగుతుందని.. గతేడాది నవంబరు 1న కువైట్‌ వెళ్లారు. అంతా సవ్యంగా ఉందనుకున్న సమయంలో.. జనవరిలో అనారోగ్యంగా ఉందని కువైట్లో ఆసుపత్రికి వెళ్లారు. వైద్య పరీక్షలు చేయించుకున్నారు. విషయం భార్య, పిల్లలకు తెలిపారు. మే 2న అదే ఆసుపత్రికి వెళ్లి తనకు ఆరోగ్యం కుదుట పడలేదని, అడ్మిట్‌ అవుతున్నానని భార్య పిల్లలతో వీడియో కాల్‌ చేసి మాట్లాడారు. ఆ తర్వాత ఆయన నుంచి ఎటువంటి సమాచారం అందలేదు. అక్కడే ఉంటున్న బంధువులకు ఫోన్‌ చేసి విచారణ చేయగా.. ఆసుపత్రిలో ఉన్నాడని, వైద్య సేవలు సక్రమంగా అందలేదని తెలిపారు. కోవిడ్‌ – 19 లాక్‌డౌన్‌ కారణంగా  ఆసుపత్రిలోకి ఎవరినీ అనుమతించడం లేదని చెప్పారు. తన భర్త ఎలా ఉన్నాడో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో తెలియదని తేజావతి ఆందోళన చెందుతోంది. ప్రభుత్వం ఆదుకుని ఆయనకు మంచి వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరుతోంది. తమ కుటుంబానికి న్యాయం చేయాలని వేడుకుంటోంది. (కువైట్‌ నుంచి ప్రవాసాంధ్రుల రాక)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top