అక్కను చంపిన తమ్ముడు | Widow fornication | Sakshi
Sakshi News home page

అక్కను చంపిన తమ్ముడు

Dec 19 2014 2:29 AM | Updated on Sep 2 2017 6:23 PM

అక్కను చంపిన తమ్ముడు

అక్కను చంపిన తమ్ముడు

ఓ వితంతువు వివాహేతర సంబంధం ఆమె ప్రాణాలనే బలిగొంది.

పచ్చడిబండతో కొట్టి.. పీక నొక్కి..
 
వివాహేతర సంబంధాన్ని భరించలేకే..
ఇంటివద్ద గొడవ జరగడంతో తీవ్ర ఆగ్రహం
కంకిపాడులో ఘటన

 
కంకిపాడు : ఓ వితంతువు వివాహేతర సంబంధం ఆమె ప్రాణాలనే బలిగొంది. ఆమె ప్రవర్తన కారణంగా గొడవ జరగడంతో భరించలేక తోబుట్టువే ఆమెను హతమార్చాడు. కంకిపాడులో గురువారం ఈ దారుణ ఘటన జరిగింది. సేకరించిన వివరాలు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఉప్పు శివపార్వతి (38) వ్యవసాయ కూలీ. ఆమె భర్త రాంబాబు తొమ్మిదేళ్ల కిందట కుటుంబ పరమైన కారణాలతో ఆత్మహత్య చేసుకున్నాడు. శివపార్వతికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు సంతానం. కంకిపాడు పోలీస్‌స్టేషన్ ఎదుట తన తల్లి నర్సమ్మతో కలిసి నివాసం ఉంటోంది.

గొడవ జరిగిందని తెలుసుకుని వచ్చి..

శివపార్వతికి, పునాదిపాడుకు చెందిన దుర్గారావుకు వివాహేతర సంబంధం ఉందనే విషయం తెలియడంతో అతడి భార్య గురువారం ఉదయం శివపార్వతి ఇంటికి వచ్చి గొడవ పడి వెళ్లింది. అదే ప్రాంతంలో ఉంటున్న శివపార్వతి (38) రెండో తమ్ముడు డేరంగుల శివనాగేశ్వరరావు(32)కు ఈ విషయం తెలిసి అక్కడికొచ్చి అక్కతో గొడవ పడ్డాడు. గొడవ ముదిరి ఆవేశంతో అందుబాటులో ఉన్న పచ్చడిబండతో తలపై మోదాడు. తీవ్ర రక్తస్రావమవుతున్నా కోపం చల్లారక ఆమె పీక పిసికాడని, తరువాత మళ్లీ పచ్చడిబండతో మోదాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి వచ్చారు. రక్తపు మడుగులో పడి ఉన్న ఆమెను ఆటోలో విజయవాడ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే చనిపోయిం దని నిర్ధారించారు. సీఐ రవికుమార్ ఆస్పత్రికి వచ్చి వివరాలు తెలుసుకున్నారు. ఎస్‌ఐ జి.శ్రీనివాస్ ఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు నమోదు చేశారు.
 
వివాహేతర సంబంధం పెట్టుకుందనే..

దాడికి పాల్పడిన శివనాగేశ్వరరావును ఎస్‌ఐ శ్రీనివాస్, ఏఎస్‌ఐ పంచకర్ల వెంకటేశ్వరరావు (కొండా) అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. అక్క వివాహేతర సంబంధం కలిగి ఉండటంతో గొడవలు వస్తున్నందున కోపం వచ్చి ఆమెపై దాడి చేశానని.. చంపాలనే ఉద్దేశం లేదని అతడు పోలీసులకు చెప్పినట్లు సమాచారం. శివపార్వతి రెండో కుమార్తెకు కొన్ని నెలల కిందట వివాహం జరిగింది. పెళ్లయిన కొద్దిరోజులకే ఆమె ఆత్మహత్య చేసుకుంది. కుమారుడు గోపి విజయవాడ ఆటోనగర్‌లో పనిచేస్తున్నాడు. గొడవలో తన తల్లికి గాయాలైన సమాచారం తెలియగానే అతడు హుటాహుటిన గ్రామానికి వచ్చాడు. తల్లి పరిస్థితి గురించి అతడు అడిగి తెలుసుకుంటున్న తీరు స్థానికులను కలచివేసింది. మృతురాలి పెద్ద కుమార్తె భవాని భర్తతో కలిసి కొద్దిరోజుల కిందట తల్లి వద్దకు వచ్చి, మరో ఊరు వెళ్లింది. భవాని ఇక్కడ ఉండి ఉంటే గొడవను అడ్డుకుని ఉండేదని, శివపార్వతి చనిపోయేది కాదని స్థానికులు పేర్కొంటున్నారు.  
 
న్యాయం చేయాలని ఆందోళన

 మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలంటూ బాధితులు గురువారం సాయంత్రం పునాదిపాడులోని దుర్గారావు ఇంటికి మృతదేహాన్ని తీసుకెళ్లి ఆందోళన నిర్వహించారు. దుర్గారావుతో శివపార్వతికి అక్రమ సంబంధం ఉందనే నెపంతో దుర్గారావు భార్య మరో పది మందితో కలసి వచ్చి గొడవ చేయడం వల్లే ఈ ఘటన జరిగిందని వారు ఆరోపించారు. ఇదే విషయమై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నచ్చజెప్పడంతో మృతదేహాన్ని ఆమె స్వస్థలానికి తరలించారు. ఆందోళన సమయంలో దుర్గారావు కుటుంబసభ్యులు ఇంటివద్ద లేకపోవడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement