
సాక్షి, విజయవాడ: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మరోసారి తీవ్ర అస్వస్థత గురయ్యారు. వంశీకి వాంతులు కావడంతో తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. నిలబడలేక, కూర్చోలేక అవస్థలు పడుతున్నారు. దీంతో, వంశీని కాసేపటి క్రితమే జీజీహెచ్‌కు తరలించారు. అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ విచారణ పేరుతో పోలీసులు వంశీని కంకిపాడు పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో ఆయన అస్వస్థతకు గురి కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో వంశీ ఆరోగ్య విషయమై ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. విచారణ నిమిత్తం కంకిపాడు పోలీసుల కస్టడీలో ఉన్న వంశీ శుక్రవారం అర్ధరాత్రి అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటంతో పోలీసులు ఆయన్ను వెంటనే కంకిపాడు సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని నాని, పెనమలూరు నియోజకవర్గ సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి, పలువురు నేతలు ఆస్పత్రి వద్దకు వచ్చారు. అనంతరం, పేర్ని నాని వైద్యులతో మాట్లాడి వంశీ ఆరోగ్య పరిస్థితిపై ఆరాతీశారు. వంశీ సతీమణి పంకజశ్రీకి ధైర్యం చెప్పారు. ఇక, వంశీకి వైద్యం నేపథ్యంలో ఆసుపత్రి వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
