విడిది చేసిన అతిథులు | Who resort guests | Sakshi
Sakshi News home page

విడిది చేసిన అతిథులు

Jan 10 2014 2:00 AM | Updated on Aug 29 2018 4:16 PM

వెంకటాపురం గ్రామానికి ఈ ఏడాది కూడా విదేశీ అతిథుల రాక మొదలైంది. కొత్త సంవత్సరం మొదటి రోజు నుంచి గ్రామంలో...

  •  వెంకటాపురంలో విదేశీ పక్షుల సందడి
  •   ఈ ఏడాది ఆలస్యంగా రాక
  •  
    వెంకటాపురం (పెనుగంచిప్రోలు), న్యూస్‌లైన్ : వెంకటాపురం గ్రామానికి ఈ ఏడాది కూడా విదేశీ అతిథుల రాక మొదలైంది. కొత్త సంవత్సరం మొదటి రోజు నుంచి గ్రామంలో గుంపులు గుంపులుగా సంచరిస్తున్న ఈ పక్షలుతో సందడి వాతావరణం నెలకొంది. ఇంతకీ ఈ అతిథులు ఎవరని అనుకుంటున్నారా... సుమారు 50 ఏళ్లుగా ఏటా క్రమం తప్పకుండా వస్తున్న సైబీరియన్ పెయింటెడ్ స్టాక్ (ఎర్రకాళ్ల కొంగలు). గతంలో నవంబర్, డిసెంబర్ నెలల్లో గ్రామానికి వచ్చే ఈ పక్షులు మారిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది ఆలస్యంగా వచ్చాయి.
     
    పెయింటెడ్ స్టాక్ (ఎర్రకాళ్ల కొంగలు)
     
    పక్షులు సంతానోత్పత్తి కోసం ఏటా వెంకటాపురం గ్రామానికి వలస వస్తాయి. ముందుగా నాలుగైదు పక్షలు గ్రామానికి వచ్చి పరిస్థితులు చూసి తమకు అనుకూలంగా ఉందని భావిస్తే మిగతా వాటిని తీసుకు వస్తాయి. వందల సంఖ్యలో వచ్చే ఈ పక్షలు ఆరు నెలలపాటు ఇక్కడే ఉంటాయి. గూళ్లు కట్టుకుని, వాటిలో గుడ్లు పెట్టి, వాటిని పొదిగిన తరువాత పిల్లలకు ఆహారం తినటం, వేటాడటం, ఎగరటం నేర్పిన తరువాత స్వస్థలానికి వెళ్తాయి. గ్రామం సమీపంలోని చెరువులు, మునేరులో దొరికే చేపలను తిని జీవిస్తాయి.
     
    విదదీయలేని అనుబంధం
     
    రంగు రంగుల రెక్కలు, పెద్ద ముక్కు, పొడవాటి ఎర్రకాళ్లతో పెయింటెడ్ పక్షులు ఆకట్టుకుం టాయి. సందడిచేసే విదేశీ విహంగాలను చూసేం దుకు సందర్శకులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఈ పక్షులు తమ గ్రామానికి రావటం మొదలైనప్పటి నుంచి పాడిపంటలు బాగా వృద్ధి చెంది సుభిక్షంగా ఉంటోందని గ్రామస్తులు సంతోషంగా చెబుతున్నారు. గత ఏడాది వేసవిలో దాహార్తితో పక్షులు మృతి చెందడంతో గుడివాడకు చెందిన జంతు సంరక్షణ కమిటీ ఉపాధ్యక్షుడు రంగారావు తమ సహకారంతో నీటి తొట్టెలు, పైపులైన్ ఏర్పాటు చేశారని పేర్కొన్నారు.
     
    విద్యుత్ వైర్లు తొలగించాలి
     
    చెట్ల మధ్య నుంరి ఏర్పాటు చేసిన 11 కేవీ విద్యుత్ వైర్లతో ఏటా పెద్ద సంఖ్యలో విదేశీ పక్షులు మృత్యువాత పడుతున్నాయి. గత ఏడాది మాజీ ఎం పీపీ గూడపాటి శ్రీనివాసరావు సహకారంతో గ్రీన్ టీమ్ నిర్వాహకులు ప్లాస్టిక్ పైపులు అమర్చారు. అయితే ఇంకా కొన్ని తీగలకు పైపులు అమర్చాల్సి ఉంది. అధికారులు స్పందించి విద్యుత్ తీగలు మార్చాలి.    
     - పుణ్యవతి
     
     పర్యాటకంగా అభివృద్ధి చేయాలి
     గ్రామాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తామన్న నేతలు, అధికారుల హామీలు నీటిమూటలయ్యాయి. మా గ్రామానికి ప్రత్యేక ప్యాకేజీ కేటాయించి పర్యాటకంగా అభివృద్ధి చేయాలి. కొల్లేరులో పక్షుల సంరక్షణకు తీసుకుంటున్న చర్యలు ఇక్కడా చేపట్టాలి. కేవలం కొందరు పక్షుల ప్రేమికులు మాత్రమే వీలున్నంత వరకు సహకరిస్తున్నారు.
     - జొన్నలగడ్డ రామారావు
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement