ఆ రూ.133 కోట్లు ఎక్కడివి?

Where are those Rs133 crores? - Sakshi

కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారానికి రెండు రోజుల ముందు ఓ బ్యాంకు రుణం తీర్చిన సుజనా చౌదరి

డిఫాల్టర్ల జాబితాలో ఆయన పేరు ఉండటంతో తొలిదఫాలో దక్కని అవకాశం

మార్చి 2014 బ్యాలెన్స్‌ షీట్స్‌ ప్రకారం భారీ నష్టాల్లో ఉన్న సుజనా గ్రూపు

హఠాత్తుగా రుణం తీర్చేసిన డబ్బు ఎక్కడిది?.. ప్రశ్నించేందుకు సిద్ధమైన ఈడీ

సాక్షి, అమరావతి: టీడీపీ ఎంపీ వై. సుజనా చౌదరి కేంద్ర మంత్రిగా పదవి చేపట్టడానికి సరిగ్గా రెండు రోజుల ముందు తీర్చేసిన రూ.133 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయనే అంశంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ప్రధానంగా దృష్టి సారించింది. మంత్రి పదవికి అడ్డంకిగా మారిన రూ.133 కోట్ల సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రుణాన్ని 2014 నవంబర్‌ 7న సుజనా చెల్లించారు. అనంతరం రెండు రోజులకే మోదీ సర్కారు రెండో విడత మంత్రివర్గ విస్తరణలో 2014 నవంబర్‌ 9వ తేదీన సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రిగా సుజనా చౌదరి ప్రమాణ స్వీకారం చేశారు. బ్యాంకు డిఫాల్టర్లకు మంత్రి పదవి ఎలా ఇస్తారని కాంగ్రెస్‌తో సహా బ్యాంకు యూనియన్లు సైతం నిలదీయటంతో సుజనా చౌదరి తన పేరుతో ఉన్న రుణాలన్నీ తీర్చేసిన తర్వాతే మంత్రివర్గంలోకి తీసుకున్నట్లు ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ వివరణ ఇచ్చారు. అప్పటికే 2014 డిఫాల్టర్ల లిస్టును ఆడిట్‌ కమిటీ ఆమోదించడంతో ఆ జాబితాలో సుజనా యూనివర్సల్‌ పేరు కూడా ఉంది. కానీ తన పేరు మీద ఎటువంటి రుణాలు లేవని సుజనా చౌదరి అప్పట్లో స్వయంగా చెప్పారు. అంతేకాదు నవంబర్‌ 13న సుజనాగ్రూపు డైరక్టర్ల పదవి నుంచి తప్పుకుంటూ రాజీనామా చేశారు. 2015 డిఫాల్టర్ల లిస్టు నుంచి సుజనా పేరును తొలగించడంపై బ్యాంకు యూనియన్లు కూడా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించిన సంగతి తెలిసిందే. 

టీడీపీ ప్రధాన ఆర్థిక వనరు సుజనా...!
నరేంద్ర మోదీ గత ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసే ముందు మిత్రపక్షానికి రెండు క్యాబినెట్‌ బెర్తులు ఇస్తామని ప్రతిపాదించగా అశోక్‌ గజపతిరాజు, సుజనా చౌదరిల పేర్లను టీడీపీ సూచించింది. అయితే బ్యాంకు డిఫాల్టర్ల జాబితాలో సుజనా పేరు ఉండటంతో ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకునేందుకు మోదీ తిరస్కరించారు. దీంతో తొలివిడత మంత్రివర్గంలో సుజనాకు అవకాశం లభించలేదు. అనంతరం రెండోసారి మంత్రి వర్గ విస్తరణ సమయంలో కూడా చంద్రబాబు మరోసారి ఆయన పేరునే సూచించడంతో బకాయిలు చెల్లిస్తే తమకు అభ్యంతరం లేదన్న ప్రతిపాదన రావడంతో సుజనా హడావుడిగా రూ.133 కోట్ల రుణాన్ని తీర్చినట్లు బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. బ్యాంకులకు రూ.వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టిన వ్యక్తికే మంత్రి పదవి ఇవ్వాలని చంద్రబాబు పట్టుబట్టడంటీడీపీకి సుజనా ప్రధాన ఆర్థిక వనరు అనే విషయాన్ని స్పష్టం చేస్తోందంటున్నారు.

ఆ నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి?
సుజనా చౌదరి కేంద్ర మంత్రి పదవి చేపట్టే నాటికి గ్రూపు సంస్థలు భారీ నష్టాల్లో ఉండటమే కాకుండా పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయాయి. 2013 నాటికి సుజనా గ్రూపు వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.930 కోట్లు బకాయి పడినట్లు ఆల్‌ ఇండియా బ్యాంక్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ తన నివేదికలో స్పష్టంగా పేర్కొంది. 2013–14 ఆర్థిక సంవత్సరానికి సుజనా మెటల్స్‌ రూ.38 కోట్లు, సుజనా యూనివర్సల్‌ రూ.6.3 కోట్లు, సుజనా టవర్స్‌ రూ.1.8 కోట్ల నష్టాలను ప్రకటించాయి. మరి ఇంత నష్టాల్లో ఉన్న కంపెనీలు రూ.133 కోట్ల రుణాన్ని ఎలా తీర్చగలిగాయి? ఈ నిధులు ఎక్కడి నుంచి సమకూర్చుకున్నారనే అంశాలపై ఈడీ ఆరా తీస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. విచారణలో ఈ అంశంపైనే ప్రధానంగా దృష్టి సారించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. పార్లమెంట్‌ సమావేశాలు ఉండటంతో ఈనెల 27న విచారణకు హాజరు కాలేనని సుజనా చౌదరి ఆదివారం ప్రకటించిన సంగతి విదితమే. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top